కొత్తపల్లి సరళాదేవి

కొత్తపల్లి సరళాదేవి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాయకురాలు.

జీవిత విశేషాలు

మార్చు

సరళాదేవి కృష్ణా జిల్లా పైడిగుండ్లవారిపాలెంలో ఆదెమ్మ, అంకప్ప దంపతులకు 1918లో జన్మించింది. ఆమె సోదరులు దేశభక్తులు. ఆమె యలమంచిలి వెంకటప్పయ్యవద్ద హిందీ అభ్యసించి, అన్నతొ పాటు జాతీయోద్యమంలో పాల్గొన్నది. 1932లొ కల్లు అంగళ్ల వద్ద పికెటింగ్ చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం 14 సంవత్సరాల బాలిక సరళాదేవికి 6నెలల కారాగార శిక్ష విధించింది. దుర్గాబాయి, వారి తల్లి చెన్నురి కృష్ణవేణమ్మల తోపాటు రాయవేలూరు, కన్నూరు జైళ్లలో శిక్షాకాలం పూర్తిచేసుకొని 1932 జూలై, 15న విడుదల అయింది.అన్న వెంకటప్పయ్యతోపాటు తెనాలిలో హిందీ పాఠశాల నిర్వహిస్తూన్న కొత్తపల్లి వేంకటకృష్ణవర్మను "పూలదండలు మార్పు"తో పెళ్ళి చేసుకొన్నది. ఆమె భర్త కూడా జాతీయోద్యమంలో జైలుశిక్ష అనుభవించిన దేశభక్తుడు. 1945లొ సరళాదేవి సేవాగ్రామ్లో కస్తూర్బా ట్రస్ట్ బేసిక్ విద్యావిధానంపై నిర్వహిస్తున్న కోర్స్ 'బునియాదీ' శిక్షణ మహాత్మా గాంధీ పర్యవేక్షణలో పూర్తి చేసి, కస్తూర్బా గాంధి స్మారక ట్రస్ట్, ఆంధ్ర విభాగంలో 1949లో తెనాలివద్ద బుర్రిపాలెం గ్రామసేవా కేంద్రంలో పనిచేసి ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. 1959లో మదనపల్లె సమీపంలోని అంకిశెట్టిపల్లిలో గ్రామసేవికగా, 1966 నుంచి 1972 వరకు నెల్లూరుకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో పనిచేసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు .పెద్ద కుమారుడు కొత్తపల్లి రవిబాబు నగరం కళాశాల ప్రిన్సిపాలుగా చేశాడు. సరళాదేవి 1990 సెప్టెంబరు 27న, 72వ ఏట మరణించింది.

మూలాలు

మార్చు
  • స్వాతంత్ర్యోద్యమంలో కమ్మవారు మొదటిభాగం, Kriya Family Publication, November 2022, పుట 17.
  • పల్లిపాడు పినాకిని సత్యాగ్రహాశ్రమంలో సరళాదేవి పఠాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ప్రచురించబడిన సరళాదేవి జీవిత సంగ్రహం కరపత్రం,
  • సరళాదేవి కుమారులు కొత్తపల్లి రవిబాబు(విశ్రాంత ప్రిన్సిపాల్, నగరం కాలేజి},కొత్తపల్లి గురుబాబు చెప్పిన వివరాలు,
  • who is Who of Freedom struggle in Andhra Pradesh, Editor Prof sarojini Regani, Published by Government of Andhra Pradesh, 1982.
  • స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు, రచయిత్రులు :డా.దుర్గాబాయి దేశముఖ్, అచ్యుతుని గిరిజ, పబ్లిషర్:ఆంధ్ర రాస్ట్ర పురావస్తు ప్రదర్శనశాల శాఖ, హైదరాబాదు, (1987), పుటలు 242-246.5.రేపల్లె చరిత్ర, రచయిత :మన్నే శ్రీనివాసరావు, మన్నే వెంకటేశ్వర్లు పబ్లికేషన్స్, రేపల్లి (గుంటూరు జిల్లా) (2018), పుటలు:322,323