కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కోటికన్యాదానాల ఫలం, నూరు అశ్వమేధయాగాల ఫలం, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈక్షేత్రం. గౌతమీ నదీ తీరాన కోటిపల్లిలో కొలువైఉన్న రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం.
చంద్రుడు తన శాపవిమోచనానికై సోమేశ్వర స్వామి ని, ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని, వశిష్ఠ మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ఆధారంగా తెలుస్తోంది.
కోటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడు.
చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి లింగం భూమికి నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండడం విశేషం.
ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏకైక ఆలయం.
ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణువు ఉండడం, ఇద్దరికీ కలిపి ఒకే గోపురం, ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత.
శివకేశవులు ఒకరే అని తెలియజేయడం కూడా నిగూఢమై ఉంది.
ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత జనార్ధనుడు, ఏకలింగం, భోగలింగ ఆలయాలు కూడా ఉన్నాయి.
బ్రహ్మముహూర్తం లోపుణ్యతీర్థంలో స్నానమాచరించి, ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని, తదుపరి రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామిని, అనంతరం పార్వతీ సమేత సిద్ధి జనార్దన స్వామిని దర్శించుకుని రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకోవడం ఈ ఆలయ ఆచారంగా వస్తోంది.
భక్తులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం.
ఆలయం ఎదురుగా ఉన్న కొలనుకి సోమగుండం అని పేరు.
ఈ ఆలయంలో నిత్యం ప్రాతఃకాలంలో కోటితీర్థంతో అభిషేకం, అర్చన, సాయంత్రం ఆస్థాన సేవ, పవళింపు సేవ జరుపుతున్నారు.
దసరా ఉత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు.
శివరాత్రి నాడు వెలిగించే కోటిదీపాలు చూసిన వారి జన్మ ధన్యమే.
ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం చుట్టుప్రక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలలో కోటిపల్లి సోమేశ్వరాలయం ఒకటి.
గౌతమ మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రంవైపు ప్రవహించేలా చేసారని, గోదావరి నదిప్రవహిస్తున్నా అంతర్వాహినిగా కోటితీర్థాలు ప్రవహిస్తున్న కారణంగా ఈక్షేత్రం కోటిఫలి కాలగమనంలో కోటిపల్లిగా పిలవబడుతోంది.
ఈ క్షేత్రంలో పాపం, పుణ్యం ఏదైనా ఒక్కసారి చేస్తే అది కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు.
సుమారుగా వేల సంవత్సరాలకు పూర్వం దేవతలచే ప్రతిష్ఠించిన మూలవిరాట్ లు కొలువై ఉన్నారు.
పదహారు, పదిహేడు శతాబ్దంలో రెడ్డిరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో, శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపుకుంది.
తర్వాత కాలంలో ఈ ప్రాంతం విజయనగరం మహారాజుల పరిపాలనలో ఉండేది.
పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకూ దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలకి వారే ధనాన్ని, జీతాలు కూడా విజయనగరం మహారాజుల ఆధ్వర్యంలో జరిగాయి.
దేవాలయాల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాక, ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విజయనగరం మహారాజులు 'మానస' అనే పేరుతో ట్రస్ట్ పెట్టి భూములపై వచ్చే ఆదాయం విజయనగరంలో ఉన్న అనేక విద్యాసంస్థలకి విరాళాలంగా ఇచ్చేసారు.
కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం కోటి ఫలితాల క్షేత్రం.
దర్శించిన వారికి ముక్తినొసగే ముక్తిధామం
అక్షరలీడర్ రామచంద్రాపురం ప్రతినిధి(చీకట్ల లోవచంద్రన్న)