కవి కాలాదులుసవరించు

కోట శివరామయ్య సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత ఈ కవి 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును.

కవితా ధోరణిసవరించు

సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.

ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1]
ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా
కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్
బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే
దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2]
మ. జమువెంటం బురవీధులం జనుచు భాస్వత్పట్టణశ్రీవినో
దము లీక్షింపుచు జూడ జూడ మఱియుం దండోపతండంబులై
భ్రమ కల్పించుపురీవిశేషములకుం బ్రాజ్యాద్భుతానీతుడై
యమునిం గన్గొని పల్కె సంయమి మరందానందసాంద్రోకులన్. [ఆ.3]

మూలాల జాబితాసవరించు

  • ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు. --కోట శివరామయ్య (విభాగం)