కోట సుబ్రహ్మణ్యశాస్త్రి

నాట్యాచార్యులు కోట సుబ్రహ్మణ్యశాస్త్రి నెల్లూరులో దాదాపు 30 సంవత్సరాలు ఎకధాటిగా బాల బాలికాలకు భరతనాట్యం నేర్పించాడు. ఆయన ఇల్లు నెల్లూరు పెద్దపోస్టాఫీసు సమీపంలో అధ్యక్షంవారి వీధిలో ఉండేది. 1947-857మూడు దశాబ్దాలపాటు వందలమందికి నెల్లూరు నగరంలో నృత్యం నేర్పించాడు. ఆరోజుల్లో ధనవంతుల బిడ్డలు, అధికారుల బిడ్డలు వారి ఇంటికివెళ్ళి నృత్యం నేర్చుకునేవారు. కొంచం బాగా నృత్యం వచ్చిన బాలబాలికలచేత నెల్లూరు టౌన్ హాల్ లో ప్రదర్శనలు ఇప్పించేవాడు. ఆయన వద్ద నృత్యం నేర్చుకొన్న బాలికలలో ఉషారాణి, చంద్రికారాణి అనే ఇద్దరు యువతులు వివిధ నగరాల్లో ప్రదర్శనలిచ్చారు.

సుబ్రహ్మణ్యశాస్త్రి గురువు వేదాంతం లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధుడు. హైద్రాబాదులో ఆయనవద్ద భరతనాట్యం అభ్యసించి, అక్కడే నృత్య పాఠశాల నెలకొల్పి 1946 వరకు నిర్వహించాడు. హైద్రాబాదు అల్లరులలో నెల్లూరు వచ్చి డాక్టర్ మాచ్యుస్ సహకారంతో 1947 జనవరిలో జైహింద్ నృత్యపాఠశాల ప్రారంభించాడు. తొలి విద్యార్థిని డాక్టర్ మాచ్యుస్ గారి మనమారలే. మొదట్లో ఇతను విడెట్ శాఖలో ఉద్యోగి, తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నృత్యమే జీవనంగా ఎంచుకున్నాడు.

5 సంవత్సరాల వయసు బాలికలనుంచి జైహింద్ స్కూల్లో డాన్సు నేర్చుకొనేవారు . కొందరు ఐదేళ్లు నేర్చుకొని సిలబస్ పూర్తుచేసి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగేవాళ్ళు. ఆరోజుల్లో నృత్యం అభ్యసించడం అంటే మధ్యతరగతి, ఆ పైవర్గాలలో చాలా మోజుండేది. సంప్రదాయవాదుల అసమ్మతిని లెక్కపెట్టకుండా బాలబాలికలు ఇతనివద్ద నృత్యం అభ్యసించారు.

ఉషారాణి, కళారాణి, రాజమన్నారు గారి మేనగోడలు మనోహరి,శకుంతల, యశోద, లక్ష్మి, నందిని, సురేఖ, విజయలక్ష్మి సిస్టర్స్ వంటి ఎందరో నృత్యం నేర్చుకొని అనేక నగరాల్లో, సభల్లో, రాజకీయ నాయకుల సముఖంలో ప్రదర్శన లిచ్చారు. సినిమా నటి సావిత్రికి ఇతను కొంతకాలం నృత్యశిక్షణ ఇచ్చాడు.

కస్తూరిదేవి విద్యాలయం సహాయార్థం ఏర్పాటయిన కేరళ సిస్టర్స్ లలితా, పద్మిని నృత్యప్రదర్శనంలో వారిచేత సుబ్రహ్మణ్యశాస్త్రికి సన్మానం జరపడం అతని జీవితంలో గొప్ప అనుభూతిగా భావించాడు .

ఎస్ .వి . టొంపే అనే విఆర్ హైస్కూల్ అధ్యాపకుడు ఇతని వద్ద నృత్యం నేర్చుకొని ప్రదర్శనలిచ్చేవాడు కానీ స్త్రీవేషం ధరించి రంగస్థలంమీద నాట్యంచేసేవాడు.

ఆధారాలు: నెల్లూరు జిల్లా మండల సర్వస్వం , సంపాదకులు: శ్రీనేలనూతల శ్రీకృష్ణమూర్తి , నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1963

జమీన్ రైతు వారపత్రిక సంచికలు.