కోడిపందెం
కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది.[1] మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. జూదం జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు.
కోళ్ళ రకాలు
మార్చుఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతాయి.[2]
పందెం తీరు
మార్చుకోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా.[2]
విష సంస్కృతి
మార్చుసంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, నొప్పి నివారిణులు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు.[2]
తెలుగు నాట కోడి పందెం
మార్చుకోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించినారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించినాడు:
"కాచిప్రాతలు దారాలు కట్టుముళ్ళు
ముష్టులును నీళ్ళముంతలు మూలికలును
కత్తులపొదుళ్ళు మంత్రముల్ కట్టుపసరు
లెనయవచ్చిరి పందెగాళ్ళేపురేగి
వేగ నెమిలి పింగళి కోడి డేగ కాకి
వన్నెలైదింటి కిరులందు వెన్నెలందు
రాజ్యభోజనగమన నిద్రామరణ
ములను విచారించి యుపజాతులను వచించి"
day
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర ........... రచయిత సురవరం ప్రతాపరెడ్డి సంవత్సరం 1950 ప్రచురణకర్త :సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా :హైదరాబాదు
మూలాలు
మార్చు- ↑ "History". Aseellovers.20m.com. Archived from the original on 2014-02-27. Retrieved 2012-08-13.
- ↑ 2.0 2.1 2.2 "కోడి'తే కోట్లే." Sakshi. 2014-01-14. Retrieved 2014-01-15.