చేలలో పండించిన పంటను కోతలు కోసేటప్పుడు జానపదులు శ్రమను మరిచిపోవడానికి బృందగేయాలో, లేక జట్లుజట్లుగా విడిపోయి యుగళగీతాలో పాడుకుంటారు. ఈ పాటలు ఎక్కువగా హాస్య, శృంగార రసాలతో; అప్పుడప్పుడూ కరుణరసంతో కూడా ఉంటాయి. ఇన్నిరోజుల శ్రమ ఫలించి పంట చేతికి వస్తోందన్న ఆనందం ఈ పాటలుపాడేవాళ్ళ గొంతుల్లో ధ్వనిస్తూ ఉంటుంది. చేలల్లో మునుము(వరుస)కు ఒకరు లేక ఇద్దరు కలిసి కోతలు కోస్తారు. వారిలో ఒకరు పాటపాడితే మిగతా మునుముల్లోని వారు ఆ పాట అందుకుని ఒక్కొక్క సుడుగు(చరణం)ను పలుకుతారు. యుగళగీతం పాడేటప్పుడు జట్లుజట్లుగా విడిపోయి పాడుతారు.


రాయలసీమలోని ప్రతిపల్లెలో ప్రతిధ్వనించే పాట కాదరయ్య పాట. హాస్యరసమొలికించే ఈ పాట కోతల సమయంలో పాడుకునేదే.

కాదరయ్య

మార్చు

పొద్దున్నే లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా

కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా

సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా వాడు పంగనామం బెట్టినాడు కాదరయ్యా

పంగనామం బెట్టినాడు కాదరయ్యా వాడు బుట్ట సంకనేసినాడు కాదరయ్యా

బుట్ట సంకనేసినాడు కాదరయ్యా వాడు పల్లె దోవ బట్టినాడు కాదరయ్యా

పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా వాణ్ణి పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా

పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా వాడు అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా

అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా వాడు జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా

జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా వాడు జొన్నకంకులు జూసినాడు కాదరయ్యా

జొన్నకంకులు తుంచినాడు కాదరయ్యా వాడు యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా

యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా వాణ్ణి సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా

సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా వాడు గువ్వల దోల్తాండనుకొండె కాదరయ్యా

గువ్వల్ గాదు గివ్వల్ గాదు కాదరయ్యా వాణ్ణి జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా

జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా వాడు పేండ్లు జూస్తాడనుకొండె కాదరయ్యా

పేండ్లుగాదు గీండ్లుగాదు కాదరయ్యా వాణ్ణి మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా

మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా వాడు ఉయ్యాలూప్తాడనుకొండె కాదరయ్యా

ఉయ్యాల్గాదు గియ్యాల్గాదు కాదరయ్యా చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా

చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా వాడు పెండ్లి జేస్తాడనుకొండె కాదరయ్యా

పెండ్లిగాదు గిండ్లిగాదు కాదరయ్యా వాణ్ణి వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా

వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా వాడూ దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా

దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా... దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా...