క్రియా యోగం
క్రియా యోగం, ఒక ప్రాచీన యోగ శాస్త్రం. ఇది ఇటీవల కాలంలో మహాయోగి మహావతార్ బాబాజీ శిష్యుడు లాహిరి మహాశయుల ద్వారా పునరుద్ధరింపబడి, పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ ద్వారా లోకంలో వెలుగులోకి వచ్చింది. యోగానంద సూచనల ద్వారా పాశ్చాత్య దేశాల్లో కూడా దీని సాధన 1920 నుండి మొదలైంది.
యోగానందుల వారు ఒక యోగి ఆత్మకథలో, యోగవిద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన పతంజలి క్రియా యోగాన్ని పేర్కొంటూ "ఉచ్ఛ్వాశ నిశ్శ్వాసల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామంతో ముక్తిని సాధించవచ్చు" అని వ్రాశాడు. అలాగే ఇది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ప్రాణవాయువుతో నింపే ఒక మానసిక - శారీరక ప్రక్రియ అని పేర్కొన్నాడు.[1][2]
క్రియా యోగశాస్త్రంలో ఆధ్యాత్మిక పురోగతిని త్వరితగతిని పొందేందుకు, భగవదనుభవం పొందేందుకు అనేక స్థాయిల్లో ప్రాణాయామం, మంత్రం, ముద్ర, ధ్యానం మొదలైన పద్ధతులు ఉన్నాయి. యోగానందకు ఈ విద్య గురు-శిష్య పరంపరాగతంగా శ్రీ యుక్తేశ్వర్ గిరి, లాహిరీ మహాశయ, మహావతార్ బాబాజీ నుండి సంక్రమించింది.
పద వ్యుత్పత్తి
మార్చుక్రియా అనే శబ్దానికి మూలధాతువు సంస్కృతంలో కృ అంటే చేయడం, స్పందించడం అని అర్థం. యోగం అంటే కలయిక అని అర్థం. క్రియా యోగం అంటే ఏదైనా చర్య లేదా కాండ (క్రియ) ద్వారా పరమాత్మునిలో కలవడం (సంయోగం).
సాధన
మార్చులాహిరీ మహాశయులు ఈ విద్యను ఒక దీక్షగా గురువు నుండి మాత్రమే ఉపదేశం పొందాలని మార్గనిర్దేశం చేశారు.[3] ఈ విద్యను గురువు నుండి శిష్యునకు ప్రసారం చేసేటప్పుడు పాటించవలసిన ప్రాచీన కఠిన నియమాలను బాబాజీ తనకు బోధించారని చెప్పారు. [4]
యోగానందులు దీన్ని వివరిస్తూ, "క్రియా యోగి తన ప్రాణశక్తిని, వెనుబాములోని ఆరు కేంద్రాల్ని (ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన, మూలాధారాలనే షట్చక్రాల్ని) చుట్టి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ ఆరు చక్రాలూ విరాట్పురుషునికి సంకేతమైన రాశిచక్రం లోని 12 రాశులకు సమానం. మానవుని సున్నితమైన వెనుబాము చుట్టూ అరనిమిషముసేపు పరిభ్రమించే శక్తి, అతని పరిణామంలో సూక్ష్మప్రగతిని సాధ్యం చేస్తుంది; ఒక్క క్రియకు పట్టే ఆ అరనిమిషం కాలం, ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం" అన్నారు.
చరిత్ర
మార్చుయోగానందులు వ్రాసిన భగవద్గీత భాష్యంలో, ఈ క్రియా యోగాన్ని మొట్టమొదట మనువుకు ఇవ్వబడినట్లు, ఆయన నుండి జనకుడు, తదితర మహా యోగులకు ఇవ్వబడింది. ఈ విద్య పురాతన కాలంలో సుప్రసిద్ధమనీ, కానీ కాలక్రమేణా "పురోహితుల గోప్యప్రవృత్తి వల్లా, మానవుని ఉపేక్ష వల్లా" అందుబాటులో లేకుండా పోయిందని ఆయన చెప్పారు. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో దీన్ని ఇలా ప్రస్తావించినట్లు చెప్పారు:
పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చే గాలిలో వేల్చి, రెండు శ్వాసల్నీ యోగి తటస్థీకరిస్తున్నాడు; ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండె నుంచి విడుదల చేసి, ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు.[5]
"నాశరహితమైన ఈ యోగాన్ని, వెనుకటి ఒక యుగంలో, ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతునికి ఉపదేశించింది నేనే" అని అన్నప్పుడు కృష్ణుడు క్రియా యోగాన్నే పేర్కొన్నట్లు యోగానందులు చెప్పారు. వైవస్వతుడు దీన్ని మనువుకు, మనువు సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకునకు అందించినట్లు చెప్పారు.
ఇటీవల చరిత్ర
మార్చులాహిరీ మహాశయులు, 1861లో బాబాజీ నుంచి దీక్షను పొందడం ఒక యోగి ఆత్మకథలో వివరించబడియున్నది. యోగ సంబంధమైన కొన్ని నిషేధాజ్ఞల మూలంగా సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన ఈ పుస్తకంలో క్రియా యోగానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వలేదు కానీ స్థూలమైన వివరాలు ఇవ్వబడ్డాయి.[6] "ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా అందిస్తున్న ఈ క్రియా యోగం, కొన్ని వేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ, తదితర శిష్యులకూ తెలిసి ఉన్న విద్యకు పునరుద్ధరణమే" అని బాబాజీ లాహిరీ మహాశయతో అన్నట్లు, యోగానందులు వ్రాశారు.
లాహిరీ మహాశయుల ద్వారా క్రియా యోగం, భారతదేశమంతటా వ్యాపించింది. ఈయన శిష్యుడైన శ్రీ యుక్తేశ్వర్ గిరి, తన శిష్యుడైన యోగానందుల ద్వారా క్రియా యోగాన్ని 20వ శతాబ్దంలో అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రచారం చేశారు.
లాహిరీ మహాశయుల భక్తుల్లో ఆయన కొడుకులైన డుకౌరి లాహిరీ, టింకౌరి లాహిరీ, ఇతర శిష్యులైన శ్రీ యుక్తేశ్వర్ గిరి, పంచానన్ భట్టాచార్య, స్వామి ప్రణవానంద, కేవలానంద మొదలైన వారెందరో ఉన్నారు.[7]
Notes
మార్చు- ↑ Patanjali, Translator, Chip Hartranft (2003).
- ↑ Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi- Chapter 26 - The Science of Kriya Yoga. Self-Realization Fellowship. ISBN 0876120869.
- ↑ Dasgupta, Sailendra Bejoy (2011). Kriya Yoga, its dissemination, and the Mahamuni Babaji Maharaj - Chapter 5 & 8. Yoga Niketan.
- ↑ Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi- Chapter 33 - Babaji, Yogi-Christ of Modern India. Self-Realization Fellowship. ISBN 0876120869.
- ↑ Bhagavad Gita IV:29
- ↑ Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi- Chapter 34 - Materializing a Palace in the Himalayas. Self-Realization Fellowship. ISBN 0876120869.
- ↑ Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi- Chapters 3, 32, 33, 36. Self-Realization Fellowship. ISBN 0876120869.