గద

(గదలు నుండి దారిమార్పు చెందింది)

గద ఒక విధమైన సామాన్యమైన ఆయుధము. దీని ఒకవైపు చాలా బరువుగా ఉండి అత్యధిక బలాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. సుత్తికి దీనికి తేడా ఏమంటే ఇది రేడియల్ సౌష్టవం కలిగి ఉంటుంది. అందువలన బలాన్ని ఏ మార్గంలోనైనా ప్రయోగించవచ్చును. ఇవి కర్రతో గాని, లోహంతో గాని తయారు చేయబడతాయి. తల భాగం సాధారణంగా రాయి, రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారుచేస్తారు.

ఒక విధమైన గదలు.

హిందూ పురాణాలలో హనుమంతుడు, విష్ణువు గదాధరులుగా పేర్కొనబడ్డారు. భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధంలో ప్రావీణులుగా మహాభారతంలో చెప్పబడింది.

Sculpture of Hanuman carrying the Dronagiri mountain, with a mace in his left hand

గదా యుద్ధం

మార్చు

గదా యుద్ధం అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య గదలతో జరిగే పోరాటం. పురాణాలలో దీనిని ఒక విద్యగా పరిగణించారు. ఇది చాలా భయంకరమైన, ప్రమాదకరమైన విద్య.

శ్రీ మహాభారతంలో కథలు

భీముడూ, దుర్యోధనుడూ గదాయుద్ధానికి సిద్ధమయ్యారు.

ఇద్దరూ ఒరిలోకి దిగారు.

వాళ్ళిద్దరూ తన శిష్యులే కాబట్టి వాళ్ళపోరు చూడాలని వచ్చాడు బలరాముడు.

అందరూ ఆయనకు గౌరవంగా నమస్కరించారు.

భీముడూ, దుర్యోధనుడూ గదాహస్తాలతోనే మొక్కారు.

"మహాత్మా! అన్నదమ్ములు పోరాడుతున్నారు చూడు!" అన్నాడు ధర్మరాజు.

బలరాముడు మట్లాడలేదు. చిరునవ్వు నవ్వి, వెళ్లి దూరంగా కూర్చున్నాడు.

భీమదుర్యోధనులు యుద్ధం మొదలు పెట్టారు.

భూమి గడగడ వణికింది.

గ్రహణసందర్భం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టాడు.

నక్కలు భయంకరంగా అరిచాయి. ఆకాశంలో మబ్బు లేకుండా పిడుగు పడింది. గదాఘాతాల చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కాసేపటికి ఇద్దరి శరీరాలూ నెత్తురుతో తడిసి మోదుగువృక్షాల్లా ఉన్నాయి.

భీముడు రెండుసార్లు మూర్చపోయాడు. అది చూసి అర్జునుడు భయపడి "బావా! దుర్యోధనుడితో మనవాడు చాలలేడంటావా?" అని కృష్ణుణ్ణి అడిగాడు.

కృష్ణుడు నవ్వి, "గురూపదేశ సమన్వయం ఇద్దరికీ సమానమే. భీముడికి బలం ఎక్కువ. దుర్యోధనుడికి చాతుర్యం ఎక్కువ. బలం కలిగి కూడా భీముడు దుర్యోధనుడి ఒడుపులకు చాలలేకపోతున్నాడు. దుర్మార్గుల్ని మోసం చేసి చంపడం తప్పుకాదు. అయినా ఇంతకంటే తెలివితక్కువతనం ఉంటుందా! అందరూ చచ్చి రాజ్యం మీద అశ విడిచి, మడుగులో దాక్కున్నవాణ్ణి వెతికి పిలిచి ఒంటరి కయ్యానికి రమ్మంటారా ఎవరైనా? మీరు లేని పదమూడు సంవత్సరాలూ భీముణ్ణి జయించాలనే దుర్యోధనుడు గదాయుద్ధ పరిశ్రమ చేశాడు. ధర్మారాజుకు కౌరవుల మీద అనుగ్రహం ఎక్కువై ఆలోచన అడుగంటింది. ఆఖరికి ఇది పందెపు యుద్ధమైంది" అన్నాడు.

అర్జునుడి మనస్సు చివుక్కుమంది.

హిడింబ బకాసురులను చంపి, జరాసంధుణ్ణి సంహరించి, కిమ్మీరుని వధించి, కీచకుణ్ణీ వాడి నూటైదుగురు తమ్ముళ్ళనీ ఒకేఒక్క రాత్రిలో శవాలను చేసిన భీమసేనుడు ఇప్పుడు దుర్యోధనుడి గదాఘాతాలకు తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ తమ్ముళ్ళవైపు చూస్తున్నాడు.

"ఇప్పుడేం చెయ్యడం" అన్నాడు అర్జునుడు ఎటూ పాలుపోక.

"గదా యుద్ధంలో నాభికి దిగువ భాగాన కొట్టకూడదు. కాని అంతకుమించి మార్గం కనబడటం లేదు" అన్నాడు కృష్ణుడు.

ఆ మాటలు విని, భీముడు తనవైపు చూసినప్పుడు చేత్తో తొడలు చరిచాడు అర్జునుడు. ఆ సంజ్ఞ తెలుసుకున్నాడు భీముడు.

గద తిప్పుతూ దుర్యోధనుడు పైకి ఎగిరేసరికి అదే అదుననుకుని బలం కొద్దీ అతని తొడలమీద మోదాడు. తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూలాడు. అంతటా గందరగోళం చెలరేగింది.

"పాంచాలిని సభలోకి ఈడ్చి, చీరలు విప్పి అవమానించినట్టు లేదూ.." అంటూ భీముడు ఎడంకాలితో దుర్యోధనుడి తలమీద బలంగా తన్నాడు.

బలరాముడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. పట్టలేనంత ఆగ్రహం వచ్చిందాయనకు. కోపంతో ముఖం ఎర్రబడింది.

"ఓ మహారాజులారా! చూశారా భీముడు చేసిన అన్యాయం! గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన్ని నొప్పించరాదనే నియమం మీరు వినలేదా? భీముడు ఎంత అన్యాయానికి తెగించాడో చూడండి" అంటూ ఎలుగెత్తి అరిచాడు హలాయుధుడు.

గబగబ తన రథం దగ్గరకు వెళ్లి నగలి భుజాన వేసుకుని భూమి అదిరిపోయేటట్లు భీమసేనుడి వైపు నడిచాడు. కృష్ణుడు ఒక్కక్షణం వూరుకుని "దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసిన సంగతి నీకు తెలుసు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోవడం రాజులకు పరమధర్మమని నువ్వే ఒకసారి నాతో అన్నావు. అదీగాక దుర్యోధనుని తొడలు భీముని వల్ల విరిగి పడతాయని మైత్రేయ మహాముని శపించాడు. ఇప్పుడదే జరిగింది. ఇందులో తప్పేముంది?" అన్నాడు.

బలరాముడు మండిపడ్డాడు.

"ధర్మార్థ కామాలు ఒకదాన్నొకటి నశింపచెయ్యకుండా వాటిని జాగ్రత్తగా అనుభవించాలి. అదీ గొప్పతనం! ధర్మాన్ని విడిచి, అర్థకామాల్ని కోరే పురుషుడు నిందలకు గురి అవుతాడు. మునిశాపం, ప్రతిజ్ఞ వుంటే వుండుగాక, అవన్నీ ధర్మం తప్పకుండా తీర్చుకోవాలి గాని ఇంత అన్యాయమా?" అన్నాడు.

"ఇందులో అధర్మమేముంది? ఎదిరించినప్పుడూ నడిచేటప్పుడూ కాదు, ఎగిరినప్పుడు కొట్టాడు భీముడు. అదేం రణనీతికి విరుద్ధం కాదే! అదీకాక ప్రాణం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పులేదని పెద్దలంటారు. తన తల పగలకొట్టడానికి దుర్యోధనుడు ఎగిరితే, నాభి కింది భాగం కొట్టకూడదని ధర్మసూత్రాలు వల్లె వేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడా భీముడు? కలియుగం దగ్గర పడింది. ధర్మాధర్మాల స్వరూపమే మారబోతోంది. అందుకే దుర్యోధనుడు అన్ని పాపపు పనులు చేసాడు" అన్నాడు కృష్ణుడు.

ఆ మాటలు అంటున్నప్పుడు 'ధర్మక్షేత్రాధిపతిని నేనే ' అన్నట్లు ఆయన వెనక క్షణకాలం ఒక మెరుపు మెరిసి మాయమైంది.

బలరాముడు ఆ వెలుగు చూడలేక కళ్ళు నులుముకుని వెంటనే మళ్ళీ బుసకొట్టాడు కోపంతో.

"ఇటువంటి తుచ్చపు గెలుపు పొందిన భీముడు తగిన సత్కారాలే పొందుతాడు" అని రథమెక్కి వెళ్లిపోయాడు.

ధర్మరాజు స్థాణువై నిలబడ్డాడు. ఇంతలో వెనుకనుంచి చేతులమీద పాక్కుంటూ దుర్యోధనుడు వచ్చాడు. అతన్ని చూడగానే ధర్మరాజు కళ్ళవెంట గిర్రున నీళ్ళు తిరిగాయి.

"..నాకు ఎవరి సానుభూతీ అక్కర్లేదు. కంసుడికి దాసుడైన వసుదేవుడి కొడుకు నన్ను దొంగదెబ్బ కొట్టించాడు కనుక మీరంతా బతికిపోయారు. సరిగ్గా యుద్ధం చేస్తే మీతోపాటూ ఈ కృష్ణుడికి కూడా యమదర్శనం చేయించి వుండేవాణ్ణి. శిఖండిని చాటుచేసుకుని భీష్ముణ్ణి అర్జునుడు చంపేటట్లు చేశాడు. ధర్మరాజు చేత ఆబద్దమాడించి ద్రోణుణ్ణి చంపించాడు. రథం భూమిలోకి దిగబడినప్పుడు కర్ణుణ్ణి చంపించాడు. భూరిశ్రవుణ్ణీ, సైంధవుణ్ణీ కూడా అన్యాయంగానే హతమార్చాడు. ఇప్పుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా భీముడి చేత నా తొడలు విరగగొట్టించాడు. ఇంకా సిగ్గులేకుండా ఈ కృష్ణుడేదో కర్మ ధర్మ చక్రవర్తని మీరంతా చాటింపేస్తున్నారు" అన్నాడు దుర్యోధనుడు ఉక్రోషంతో.

కృష్ణుడు నవ్వాడు. "గదాయుద్ధంలో నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు ఫోన్లే పాపం అని పిడికిటితో పొడుస్తాడనుకున్నావా? నువ్వు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడే ఏడుస్తూ పడివుండు" అని పాంచజన్యం పూరించేసరికి పాండవులంతా రథాల మీద బయలుదేరి కౌరవ నగరం చేరుకున్నారు.

"గాండీవం, అమ్ములపొదలూ అవతల పెట్టించి ముందు నువ్వు రథం దిగు. తరువాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు అర్జునుడితో.

"విజయుడు ధనువూ, అమ్ములపొదలూ తీసుకుని దిగిన తరువాత కృష్ణుడు పగ్గాలు మడిచిపెట్టి రథం దిగాడు. జెండాలో వున్న కపి తన భూతగణాలతో సహా తొలగిపోయింది. వెంటనే ఆ రథం గుర్రాలతో సహా చురచుర కాలిపోయింది.

"దేవా! ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ రథం ఎందుకిలా కాలిపోయింది?" అని అర్జునుడు అడిగాడు.

"ద్రోణ కర్ణ అస్త్రాగ్నులలో ఇదివరకే కాలవలసింది. యుద్ధం అయిపోయేదాకా కావాలని నేనే రక్షించాను" అన్నాడు కృష్ణుడు.

అర్జునుడు కృష్ణ ప్రభువుకు వందనం చేశాడు. నడుస్తున్న స్వామిపై పుష్ప వృష్టి కురిసింది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గద&oldid=2822472" నుండి వెలికితీశారు