గయా క్షేత్రాలు
గయాసురుడు అనే అసురుని శరీరభాగాలైన తల, నాభి, పాదం గయాక్షేత్రాలుగా పవిత్రత పొందిందని పౌరాణిక కథనం. ఆయన శరీరం అత్యంత పవిత్రమైనదిగా, పితృతర్పణాలతో పితృదేవతలను తరింపజేసేదిగా విష్ణువు వరమివ్వడంతో ఈ మూడు ప్రాంతాలు పితృతర్పణాలకు అత్యంత ప్రసిద్ధి చెందాయి.
క్షేత్రాలు
మార్చుదేశవ్యాప్తంగా గయాక్షేత్రాలు 3 ఉన్నాయి.
పౌరాణిక కథనం
మార్చుగయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.[1]
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[2]
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.
మూలాలు
మార్చు- ↑ కమల, ఎం. (నవంబరు 13, 2010). "దేహమే దేవాలయం-పాదగయే పిఠాపురం". ఆంధ్రప్రభ. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 20 December 2014.
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.