గాంధీ జ్ఞాన మందిర్

గాంధీ జ్ఞాన మందిర్ హైదరాబాదు నగరంలోని సుల్తాన్ బజారు ప్రాంతంలోని ధ్యాన మందిరం. సమాజంలో తరిగిపోతున్న నైతిక విలువల్ని పెంచడం, జాతీయ సంస్కృతీ సంరక్షణ దీని లక్ష్యాలు.

ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గాంధీ జ్ఞాన మందిర్ స్థాపకుడు

దీనిని జంటనగరాలకు చెందిన కొందరు సాంఘిక కార్యకర్తలు, నాయకులు కలిసి తిలక్ పార్కులో కొంత భూమిని హైదరాబాద్ పురపాలక సంఘం దగ్గర పొంది 1969 డిసెంబరు 27 వ తేదీన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారి చేత శంకుస్థాపన చేయించారు. టోకర్సీలాల్జీ కాపడియా భవన నిర్మాణానికి నడుంకట్టి పి.ఎల్.భండారీ, రామకృష్ణ ధూత్, సత్యనారాయణ గుప్త, బిరధీచంద్ చౌదరి, ఉత్తం చంద్, కమల్ నారాయణ అగ్రవాల్ మొదలగు పెద్దలతోబాటు విరాళాలుగా కొంత ధనం పోగుచేశారు. ఇదికాక బాలాజీ శివనారాయణ అండ్ కంపెనీ ద్వారా పెద్ద మొత్తం విరాళంగా లభించింది. భవన నిర్మాణం పూర్తిచేసి 1974 అక్టోబరు 2వ తేదీన కేంద్రీయ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు శ్రీమన్నారాయణ్ గారు ప్రారంభోత్సవం చేశారు.

మందిర్ కార్యక్రమాల నిర్వహణకు ఒక సహాయోగీ సంఘం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ గాంధీ, వినోబాభావేలకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శిస్తుంటారు. ఒక పుస్తక కేంద్రం కూడా ఏర్పాటుచేయబడింది. గాంధీజీ సిద్ధాంతాలు, పలు అధ్యాత్మిక విషయాలపై సభలు, ఉపన్యాసాలు ఇక్కడ జరుగుతుంటాయి.