గిజిగాడు (ఆంగ్లం: Baya Weaver) అనేది ఓరకమైన పిచ్చుక. ఇవి సాధారణంగా భారతదేశం, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో నివసిస్తాయి.

గిజిగాడి గూడు
మగ పక్షి
ఆడ పక్షి

గూడు నిర్మాణం మార్చు

వీటి గూళ్ళు చెరువులోకి వంగిన తుమ్మ చెట్టు కొమ్మలకో, తాటి చెట్లకో ఈత చెట్లకో వేలాడుతూ కనబడతాయి. ఈ గూళ్ళను గిజిగాడి గూళ్లు అంటారు. ఓ రకం పిచ్చుకలే అయిన గిజిగాళ్ళు పాములూ, ఇతర శత్రువుల బారినుండి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోడానికి గూళ్ళను ఇలా కట్టుకుంటాయట. కొన్నిచోట్ల ఈ గిజిగాళ్ళు కరెంటు తీగలకు కూడా వ్రేలాడే గూడును కట్టుకుంటాయి. ఈ గూళ్ళు అద్భుతంగా కట్టుకుంటాయి. కొమ్మలకు వ్రేలాడుతూ ఉండే ఈ గూళ్ళ నిర్మాణంలో, ఈ పక్షులు చూపించే సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవి గూళ్ళు అల్లడమూ, పిల్లలకి ఆహారం నోటికందించడమూ, శత్రువులను ఎదుర్కోవడమూ, ఆటలూ పాటలూ చాలా చూడ ముచ్చటగా ఉంటాయి.

ఈ గూళ్ళలో గోల గోలగా కూస్తుండే బుల్లి పిట్టలు ఉంటాయి. ఈ గిజిగాడి గూడు నింగికీ నేలకీ మధ్య వేలాడదీసిన గదులున్న చిన్న గృహంలా, ఊగుతూ ఉంటుంది. ఈ పక్షులు గూళ్ళను గుంపులుగా ఒకే చోట కట్టుకుంటాయి. పాములు, జంతువుల బారినుండి తన పిల్లలను రక్షించుకోవడానికి ఈ గూడు నిర్మించినప్పటికీ, కాకుల వలన కొంతవరకూ ప్రమాదం ఉంటుంది. శత్రువుల తాకిడి ప్రారంభమవగానే అవి ఒక్కసారిగా కూతలుపెడుతూ పారిపోతాయి. కాకులు వెళ్లిపోగానే అవన్నీ మళ్లీ ఒకేసారి తమగూళ్ళలోకి తిరిగివస్తాయి.. తల మీద బంగారు కిరీటంలా పసుపు రంగు, గడ్డమూ ముక్కూ నలుపు రంగు, రెక్కలేమో గోధుమా నలుపు రంగు చారలతో మగ పక్షులు కనిపిస్తాయి. ఆడ పక్షికి పసుపూ కిరీటమూ, ముఖం మీద నలుపూ ఉండవు. చూడ్డానికి అచ్చం ఊరపిచ్చుకలానే ఉంటుంది.

పిల్లల్ని పోషించే బాధ్యత ఆడ పక్షులదైతే గూళ్ళు కట్టే పని పూర్తిగా మగ పక్షులదే. వరి, ఇతర గడ్డి మొక్కల ఆకుల నుండి చీల్చుకొచ్చిన పోచలతో ఈ గూడుని అల్లుతాయి. సగం అల్లిన గూడుని మగపక్షి ప్రదర్శనకి పెట్టి రెక్కలు ఆడిస్తూ వచ్చి చూసుకొమ్మన్నట్లు ఆడపక్షులకు సంకేతాలు అందిస్తుంది. గుంపులో ఒక్క ఆడ పక్షి అయినా మెచ్చక పోదు కదా! తన గూటిని ఎవరూ మెచ్చకపోతే, అది వదిలి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగ పక్షి. ఆడపక్షికి నచ్చిన తర్వాత, గొట్టం లాంటి ప్రవేశ ద్వారం వంటి మిగతా పనులు పూర్తి చేయడంతో, కాపురానికి అందమైన గూడు సిద్దమవుతుంది! గూడు చుట్టూ ఎగురుతూ పనితనాన్ని సరిచూసుకుంటాయి కొన్ని. ఊగి చూసి గట్టితనాన్నీ పరీక్షించుకుంటాయి కొన్ని పక్షులు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు