గొబ్బిళ్ళ పాటలు

గొబ్బి పాటలకు జానపదవాఙ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు. "కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకులసామికి గొబ్బిళ్ళో" అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ముందు ఒక నెలరోజులకాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ఈ ధనుర్మాసం రోజుల్లో ఊరూరా ఆడవారు తెల్లవారకముందే లేచి ఇంటిముందు పేడనీళ్ళు చల్లి ముగ్గులు వేసిన తర్వాత పేడతో చేసిన ముద్దలను గొబ్బెమ్మలుగా భావించి ఆ ముగ్గుల మధ్యభాగంలో పెట్టి వాటికి అలంకారంగా పువ్వులు పెడతారు. సాయంత్రమయ్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బెమ్మలను చేసి ఒక పెద్ద పళ్ళెంలో ఉంచుతారు. కళ్ళస్థానంలో గురివింద గింజలు, ముక్కుస్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచడం కద్దు. ఈ గొబ్బెమ్మలకు రకరకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసుకువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉంచి గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడుతారు. అక్కడ పాడే పాటలే గొబ్బిపాటలు. పాడడం పూర్తయ్యాక మధ్యలో ఉన్న అమ్మాయి గొబ్బెమ్మను పట్టుకోగా మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చేరి ఒకరి భుజాలమీద ఇంకొకరు చేతులు వేసుకుని గొంతులు కలిపి పాటలు పాడుకుంటూ తిరిగివస్తారు. చివరిరోజైన కనుమ నాడు పాటలు పాడడం పూర్తయ్యాక గొబ్బెమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

గొబ్బెమ్మలు


గొబ్బెమ్మలకు, తెలంగాణా ప్రాంతంలోని బతుకమ్మలకు పోలికలున్నా, కొన్ని విషయాల్లో స్వల్పభేదాలున్నాయి. బతుకమ్మ పాటలు ఒక నిర్ణీత ప్రదేశంలో పాడితే గొబ్బిపాటలు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందూ పాడుతారు. గొబ్బిపాటలు నిటారుగా నిలబడి తిరుగుతూ పాడతారు. బతుకమ్మపాటలు పాడేవాళ్ళు నడుం దగ్గర వంగి తిరుగుతారు. బతుకమ్మపాటలు పాడేవారి కదలికల్లో సొగసు, వయ్యారం ఉంటే గొబ్బిపాటలు పాడేవారిలో హుందాతనం ఉంటుంది. బతుకమ్మపాటలు పాడేవాళ్ళు చప్పట్లు వేగంగా తడితే గొబ్బిపాటలు పాడేవాళ్ళు నిదానంగా తడతారు.

సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు

యివి కూడ చూడండి

మార్చు