గొల్ల హంపన్న హత్య

(గొల్ల హంపన్న మృతి నుండి దారిమార్పు చెందింది)

గూళపాళెం హంపన్న బ్రిటిషు పాలనా కాలంలో నేటి ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు గ్రామం వద్ద రైలు గేటు కాపలాదారుగా ఉండేవాడు. 1893లో ఆంగ్లేయ సైనికుల బలాత్కార ప్రయత్నం నుంచి ఇద్దరు భారతీయ స్త్రీలను కాపాడి, ఆ ప్రయత్నంలో ప్రాణం కోల్పోయాడు. అతని మరణానంతరం నడచిన హత్యకేసు సుప్రసిద్ధమైంది. చివరకు నిందితులైన ఆంగ్లేయ సైనికులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించడం వివాదాస్పదమైంది.[1]

గొల్ల హంపన్న
మరణం1893 అక్టోబరు 4
మరణ కారణంవివాదంలో (తొడలో తగిలిన బుల్లెట్ తొడకి, పొత్తికడుపుకి మధ్యనున్న ప్రదేశంలో ఇరుక్కుని)
సమాధి స్థలంగుత్తిలో స్మారక చిహ్నం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఇద్దరు స్త్రీలను ఆంగ్ల సైనికుల బారి నుంచి కాపాడి, అందుకు చనిపోయారు. ఈ కేసు నీరుగారడంతో ప్రజలు ఓ వీరునిగా స్మారక చిహ్నం నిర్మాణమవుతుంది.
హంపన్న సమాధి, గుత్తి

హిందూపత్రికలో 1893-96లో ఈ కేసుకు సంబంధించి వచ్చిన వివిధ కథనాల ప్రకారం 1893 అక్టోబరు 4 న [2] గుంతకల్లు రైల్వేస్టేషన్ మీదుగా సికిందరాబాద్ వెళ్తున్న ఆంగ్ల సైనికుల పటాలంలోని కొందరి దుష్ప్రవర్తనను, దురన్యాయాన్ని ప్రతిఘటించినందుకు రైల్వేగేటు కావలి (కీపర్) అయిన గొల్ల హంపన్నను కాల్చి చంపారు. వెల్లింగ్టన్ నుంచి సికిందరాబాద్ వెళ్ళేదారిలో గుంతకల్లు వద్ద పటాలం రైలు మారాల్సిరావడంతో వారు ఒక మిలటరీ బంగళాలో దిగారు. సాయంసమయంలో కొందరు మద్యపానం చేసి ఆ దారిగా వెళ్తున్న ఓ పడుచు, ముసలి స్త్రీలపై అత్యాచార యత్నం చేశారు. దానితో వారిద్దరూ పారిపోయి రైల్వేగేట్ కీపర్ గొల్ల హంపన్న శరణుకోరి, ఆయనకు కేటాయించిన చిన్న గదిలో దాక్కున్నారు. గది తలుపులు విరగ్గొట్టబోయి సాధ్యం కాకపోవడంతో తమను వారిస్తున్న గొల్ల హంపన్నను తుపాకీతో కాల్చి బంగళాకు పారిపోయారు. తుపాకీ పేలుడుకు దగ్గరలో రోడ్డు మేస్త్రీ, ఆ ఇద్దరు స్త్రీలు వెళ్లారు. రైల్వేపోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఆ రాత్రి జరిగిన గుర్తింపు కార్యకలాపంలో హంపన్న తానున్న నీరసస్థితిలో కాల్చినవానిని గుర్తించలేకపోయారు. తర్వాతిరోజు పొత్తకడుపుకింద, గజ్జదగ్గర ఇరుక్కున్న తుపాకీ గుండు ప్రభావం వల్ల హంపన్న మరణించారు.[3]

న్యాయవిచారణ

మార్చు

ఈ వృత్తాంతమంతా హిందూ పత్రికలో రావడంతో ఇంగ్లీషువారు ఆంగ్లేయులకు ఏర్పరిచిన ప్రత్యేకమైన ప్రతిపత్తులతో కూడిన కోర్టులో విచారణ జరిపించారు. అక్కడ ఉన్న జ్యూరీవారిలో అధికభాగం ఆంగ్లేయులు, మిగిలిన కొందరు వారిపై జీవనము ఆధారపడిన దుబాసీలు. కోర్టులో ఆ స్త్రీలు వ్యభిచారులని, హంపన్న వ్యభిచరింపజేసే వ్యాపారియని వ్యభిచారం విషయంలో డబ్బు ఎక్కువ తక్కువల్లో తమను కొట్టవచ్చాడని, ఆత్మరక్షణార్థం తాము కాల్చామని వాదించారు. వాదనలు నడుస్తూండగానే ఈ కేసుకు వ్యతిరేకంగా హిందూ పత్రికలో చాలా వార్తలు, అభిప్రాయాలు వచ్చాయి. చివరకు ఈ కేసులో వ్యభిచార వ్యవహారంలో తేడా రావడంతోనే ఈ ఘటన జరిగిందని, హంపన్న అమాయకుడేమీ కాదన్న వ్యాఖ్యలు చేస్తూ ఈ నేపథ్యంలో ఆంగ్ల సైనికుల దోషం ఏమీ లేదని తేల్చి, నిర్దోషులుగా విడిచిపెట్టాయి. చరిత్రకారుడు దిగవల్లి వేంకట శివరావు వ్యాఖ్య ప్రకారం ఏ కారణంగా హత్య చేసినా, దాని శిక్షాకాలంలో తేడా రావచ్చును కానీ మొత్తంగా మరణానికి కారకులదే తప్పూ లేదనడం తగదు. ఇది జాత్యహంకారానికి ఉదాహరణ అంటూ హిందూ దినపత్రిక తీవ్రంగా ఖండించింది. తీర్పు చాలా బాగుందని మద్రాసు మెయిల్ పత్రిక సంతోషం వ్యక్తం చేసింది.[3]

స్మారక చిహ్నం

మార్చు

స్థానికులు వీరుడైన హంపన్నపై ఇటువంటి ఘోరారోపణ చేయడాన్ని సహించలేక ఓ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి హిందూ పత్రిక సహకరించి, తమ పత్రిక ద్వారా విరాళాల కోసం ప్రయత్నాలు సాగించింది. గ్రామస్థులు, హిందూపత్రికవారూ విరాళాలిచ్చిన దాతల సహకారంతో హంపన్న స్మారక చిహ్నాన్ని నిర్మించారు. స్మారక సంఘం వారు స్మారక చిహ్నం నిర్మాణానికి తొమ్మిది చదరపుటడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలంలో గొల్ల హంపన్న అస్థికలు పాతిపెట్టి, దానిపై ఏడడుగుల ఎత్తుగల రాతిస్తంభం నిలబెట్టి, దానికి ఓ స్మారక ఫలకాన్ని వ్రాయించి పెట్టారు. చుట్టూ ఆవరణ గోడ కూడా కట్టించారు. స్మారక ఫలకంపై గుంతకల్లు విశ్రాంతి శిబిరముదగ్గర ఐరోపా సైనికుల బారి నుండి ఇరువురు స్త్రీలను రక్షించుటలో నొక సైనికుని వలన 1893 అక్టోబరు 4వ తేదీన తుపాకితో కాల్చబడి 5వ తేదీన ప్రాణములను బాసిన గొల్ల హంపన్న అస్థికల లిక్కడ భూస్థాపితము చేయబడినవి అని వ్రాయించారు.

ప్రభుత్వ ప్రతిఘటన

మార్చు

స్మారకచిహ్నం ఏర్పాటు తమకు అవమానకరమని కొందరు బ్రిటీష్ అధికారులకు తోచి స్థల విక్రయం రద్దుచేయాలని ప్రయత్నించారు. కాని వ్రాయించిన దస్తావేజు విస్పష్టముగా నుండడం, దానిలో కూడా స్థలం కొనుగోలు స్మారక చిహ్నం నెలకొల్పేందుకేనన్న సంగతి వ్రాసివుండడం కారణాలతో ఏమీ చేయలేకపోయారు. డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సూపరింటెండెంట్ అయిన లెగ్గట్ ఈ స్మారక చిహ్నాన్ని చూసి చాలా ఆగ్రహించారు. దీనిని ఎలాగైనా తొలగించాలని సిఫారసు చేస్తూ చెన్నపట్టణ ప్రభుత్వం వారికి వ్రాశారు. గుత్తి విలేఖరియైన కేశవపిళ్ళైపై రాజద్రోహ నేరం కింద కేసు నమోదుచేయాలని ప్రయత్నాలు చేశారు. ఐతే ఇవేవీ జరగలేదు. మద్రాసు గవర్నర్ వెన్లక్ ప్రభుత్వం హంపన్న స్మారక చిహ్నం ఏమీ చేయరాదన్న ఉత్తర్వు చేసింది.

ప్రజా బాహుళ్యంలో కావలి హంపన్న

మార్చు
 
విద్వాన్ విశ్వం

కావలి హంపన్న వీరోచిత మరణాన్ని కీర్తిస్తూ విద్వాన్ విశ్వం ఒకనాడు అనే పద్యకావ్యం రాసాడు.[2] ఆ కావ్యం లోని పద్యం ఒకటి:

ఈ వీరగల్లు గుడిలో
కావలి హంపన్న ఆత్మ కాపురముండున్
తావెక్కడ చాలును భర
తావనియే వాని ఆలయమ్మగును గదా

మూలాలు

మార్చు
  1. పి., యానాది రాజు (2003). Rayalaseema During Colonial Times: A Study in Indian Nationalism (1 ed.). న్యూఢిల్లీ: నార్తర్న్ బుక్ సెంటర్. p. 109. ISBN 81-7211-139-8. Retrieved 1 December 2014.
  2. 2.0 2.1 "జనగీతంగా మారుతున్న విద్వాన్‌ విశ్వం 'పెన్నేటి పాట'". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2021-05-28. Retrieved 2021-05-28.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; కథలు గాథలు అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు