గోపీనాథుని వెంకయ్యశాస్త్రి

గోపినాథుని వెంకయ్యశాస్త్రి తెలుగు పండితుడు. అతను గోపీనాథ వేంకటకవి గా సుపరిచితుడు. అతను తన చేవ్రాలు కూడా ఆ విధంగానే చేసేవాడు.

జీవిత విశేషాలు

మార్చు

గోపినాథుని వెంకయ్యశాస్త్రి నెల్లూరుజిల్లా కావలికి సమీపంలో లక్ష్మీపురంలో 1820 ప్రాంతంలో పండిత కుటుంబంలో జన్మించాడు. తండ్రి పద్మనాభశాస్త్రి వద్ద బాల్యంలో సంస్కృతం, తెలుగు అభ్యసించి కవిత్వరచనకు పూనుకొన్నాడు. అతని తొలి రచన మారుతీశతకం. తొలి యవ్వనంలోనే రామాయణం అనువాదానికి పూనుకొని 1859 ప్రాంతాలకు పూర్తిచేసి, తన గ్రంథాన్ని పండిత సభలలో పరిచయం చేయగల సహృదయుడికోసం ఎదురుచూడగా, యాదృచ్చికంగా వెంకటగిరి జమీందారు వెలుగోటి సర్వజ్గ కుమారకృష్ణ యాచెంద్ర పరిచయం అయింది. ఆయన వెంకయ్య శాస్త్రి అనువాదంలోని కొన్ని ఘట్టాలువిని, వెంకటగిరి పిలిపించుకొని, శాస్త్రిగారి రామాయణం సమగ్రంగావిని, వెంకయ్య శాస్త్రిని 1859లొ ఆస్థానకవిగా నియమించుకొన్నాడు.

రామాయణ ఆంధ్రీకరణ వెంకయ్య శాస్త్రి చేసినదికాదు అని వెంకటగిరిలో ఒక అపప్రథ పుట్టడంతో, పోషకుడు తనకు ఇష్టమైన బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత శ్రీకృష్ణ జన్మఖండాన్ని అనువదించమని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే వెంకయ్యశాస్త్రి వెంకటగిరిలో, ఆస్థాన పండితుల సమక్షంలో కొంతభాగం అనువదించడంతో రాజు తృప్తిచెంది, మిగతాభాగం కవిని స్వగ్రామం లక్ష్మిపురంవెళ్లి చేయమని అనుజ్ఞ ఇచ్చాడు. ఈ సమయంలోనే సర్వజ్ఞ కుమార యాచేంద్ర తన శృంగార అనుభావాలను వెంకయ్యశాస్త్రిచేత బ్రహ్మానంద శతకంగా రాయించాడు. సమకాలికులు ఈ రచనను వెంకయ్యశాస్త్రికి అంటగట్టి ఆయనను అశ్లీల రచన చేసినందుకు దూషించారు. 1879లొ వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్ర కోరిన ప్రకారం, వృద్ధాప్యంలో మాఘ శిశుపాలవధ కావ్యాన్ని అనువదించాడు.

వెంకయ్య శాస్త్రి 1992 జూన్ 8 వ తేదీన వెంకటగిరిలో మరణించాడు.

రచనలు

మార్చు

సర్వజ్ఞ కుమార యాచేంద్ర వెంకయ్య శాస్త్రి రామాయణాన్ని1887లొ, శ్రీకృష్ణ జన్మఖండాన్ని 1889 లో అచ్చువేయించాడు. అతని కుమారుడు వెలుగోటి రాజగోపాలకృష్ణ వెంకయ్య శాస్త్రి శిశుపాలవధ తెలుగు పద్యానువాదాన్ని అచ్చువేయించాడు. కవి జీవితకాలంలోనే షుమారు రెండువేల పుటల గ్రంథాలు ముద్రణ భాగ్యం పొందాయి. 1923లో బ్రహ్మానంద శతకం అచ్చయింది. 1968లొ మారుతీశతకం అచ్చుఅయింది. వెంకయ్యశాస్త్రి రచించిన తిరునాళ్ళదండకం ఇటీవల తిరుపతి శ్రీవెంకటేశ్వర ఓరియంటల్ పరిశోధనసంస్థ ముద్రించింది.

మూలాలు

మార్చు
  1. వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం, డాక్టర్ కాళిదాసు పురుషొత్తం, ఎమెస్కొ ప్రచురణ, 2017.
  2. గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం, డాక్టర్ కాళిదాసు పురుషొత్తం,
  3. గొపినాథ వెంకటకవి, శ్రీమద్ రామాయణం ఆదిసరస్వతి నిలయ ముద్రాక్షరశ్హాల, మద్రాసు, 1887.
  4. గొపినాథ వెంకటకవి,కృష్ణజన్మ ఖండము, శారదాంబా విలాస ముద్రాక్షరశాల, మద్రాసు, 1889.
  5. గొపీనాథ వెంకటకవి, గొపీనాథ రామాయణం,ప్రథమ ముద్రణ, వావిళ్ళ రామస్వామి అండ్ సంస్స్, మద్రాసు, 1987.
  6. గొపీనాథ వెంకటకవి, శిశుపాలవథము అను నీ అంధ్ర కావ్యము, ఆదిసరస్వతి నిలయ ముద్రాక్షరశ్హాల, మద్రాసు,1887.
  7. గోపినాథుని వెంకయ్యశాస్త్రి మారుతీ శతకం, లలితా ప్రెస్స్, హైదరాబాదు, 1968.
  8. బ్రహ్మానందం, (బ్రహ్మానంద శతకం), కామగ్రంథమాల, పుదుచ్చేరి, 1923.9. Sri Venkateswara University Oriental Journal, Volume XLIII :2055.తిరునాళ్ళదండకము.ఫొటో:ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక, 1929.