చపాతీ ఉద్యమం

భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన ఒక ఉద్యమం

ఎన్నో ఏళ్లు బ్రిటీష్‌ పాలనలో నలిగిపోయిన భారతదేశంలో సమర యోధుల పోరాటాల ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ పోరాటంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్‌ ఇండియా ఇలా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇలాంటి తరహాలోదే చపాతి ఉద్యమం[1] ఒకటి. దీని ఉద్దేశం ఏంటో, దానిని నడిపిన నాయకుడు ఎవరో తెలియకపోయినా బ్రిటీష్‌ పాలకులకు మాత్రం వణుకు పుట్టించింది.

ఆంగ్లేయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ..

మార్చు

బ్రిటీష్‌ పాలకులపై 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన ఏడాది ప్రారంభంలోనే చపాతీ ఉద్యమం ఊపందుకుంది.[2] ఎవరు ప్రారంభించారో, ఎందుకు ప్రారంభించారో తెలియకుండానే దేశంలోని ప్రతి గ్రామంలో చపాతీ (రొట్టె)ల పంపిణీ ఒక ఉద్యమంలా కొనసాగింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి గ్రామంలోని కాపలాదారుడికి కొన్ని చపాతీలు ఇచ్చి, వాటిని ఆ ఊర్లో, మరికొన్ని చపాతీలు చేసి మరొక ఊర్లో పంచమని చెప్పడం, ఆ కాపలాదారుడు అలాగే చేయడంతో ఉత్తర భారతదేశంలో మొదలైన ఈ చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటీష్‌ అధీనంలో ఉండే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి చపాతీలు చేరాయి.

అప్పటికే తమ పాలనపై భారతీయుల్లో అసంతృప్తి ఉందన్న సంగతి బ్రిటిషర్లకు తెలుసు. చపాతీలు దేన్నో మోసుకెళ్తున్నాయని వారు విశ్వసించారు. కొందరు అధికారులు ఇవి తూర్పున ఉన్న కలకత్తా నుంచి వస్తున్నాయని, మరికొందరు ఉత్తర భారతదేశంలోని అవధ్ నుంచి బయలుదేరుతున్నాయని, ఇంకొందరేమో మధ్య భారతదేశానికి చెందిన ఇండోర్ నగరమే వీటికి జన్మస్థలమని ఇలా రకరకాలుగా భావించారు. ఒకవేళ స్వతంత్ర సాధన కోసమే చపాతీల సాయంతో భారతదేశం నలుమూలలా బ్రిటిష్ వ్యతిరేక భావజాలం పాకితే 25 కోట్ల మంది భారతీయులను తమ లక్షమంది సైన్యం నిలువరించలేదు. ఇది ఒక రకంగా మానసిక యుద్ధంలా మారిపోయింది.

1857 ఫిబ్రవరిలో తొలిసారి ఈ చపాతీ ఉద్యమం మథురలోని బ్రిటీష్‌ అధికారి థోర్న్‌హిల్‌కి దృష్టికి వచ్చింది. తన కార్యాలయంలో ఓ పోలీస్‌కి ఆ ఊరి కాపలాదారుడు రొట్టెలు తెచ్చి ఇచ్చాడు.[3] దీనిపై విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాత్రుళ్లు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచుతున్నారని, ఆ చపాతీలు రాత్రికిరాత్రే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిసింది. దీంతో బ్రిటీష్‌ పాలకులకు కాస్త వణుకు పుట్టింది. వీటితో ఏదో ఉద్యమం మొదలవుతోందని భావించారు. చపాతీల్లో ఏవైనా సందేశాలు ఉన్నాయేమోనని అనుమానించారు. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది.[4]

శ్రీరాంపూర్‌లో ప్రచురించబడిన ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ వార్తాపత్రిక, 1857 మార్చి 5 ఎడిషన్‌లో బ్రిటిష్ అధికారులు ఆ ప్రాంతంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు చపాతీలు వచ్చినప్పుడు గందరగోళానికి గురయ్యారని ప్రచురించింది. వేల కొలది చపాతీల పంపిణీ బ్రిటిష్ వారికి భంగం కలిగించేలా బ్రిటిష్ మెయిల్ కంటే చాలా వేగంగా ఉండేది. ఫరూఖాబాద్ నుండి గుర్గావ్ వరకు, అవధ్ నుండి రోహిల్‌ఖండ్ మీదుగా ఢిల్లీకి చేరుకునేవి.[5]

మూలాలు

మార్చు
  1. "ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం.. చపాతీ!". Sakshi. 2016-06-24. Retrieved 2021-09-21.
  2. Rubi (8 July 2016). "Chapati Movement, the mysterious chain that psyched up British officials during 1857 Mutiny Rising". The Voice of Nation. Archived from the original on 29 August 2016. Retrieved 3 November 2016.
  3. "Food items that played a pivotal role in historical events". The Economic Times. 29 June 2013. Retrieved 3 November 2016.
  4. Dash, Mike (24 May 2012). "Pass it on: The Secret that Preceded the Indian Rebellion of 1857". Smithsonian (magazine). Retrieved 3 November 2016.
  5. Pal, Sanchari (23 June 2016). "Chapati Movement: How the Ubiquitous and Harmless Chapati Had Terrified the British in 1857". The Better India. Retrieved 13 October 2018.