చర్చ:దళిత గోవిందం
దళిత గోవిందం
డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు.దళితులు,మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మాన మర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి.ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి.విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ ఏమీ అనలేక తమ వాళ్ళని తామే తిట్టుకోవడం అన్నిటికంటే తేలికైన పనిగా వీళ్ళు భావిస్తారు.
భారత ప్రభుత్వం లౌకికవాదాన్ని అతి చక్కగా కాపాడుతున్నది. అగ్రవర్ణ హిందువులు వర్గ విభేదాలు పాటించని లౌకికవాదులుగా మొత్తం ప్రపంచ దృష్టిలో పడేట్లుగాచేస్తుంది.దళితులు, మైనారిటీలు ఎలాంటి తిట్లైనా తినాలి, తన్నులు భరించాలి. వాళ్ళ దేవుళ్ళకి, ప్రవక్తలకి, మతాలకి ఎటువంటి అవమానం జరిగినా అంగీకరించాలి. అప్పుడే వాల్లని చాలా ఓర్చుకునే లౌకికవాదులుగా భుజం తడతారు. దళితులను,మైనారిటీలను ఎదిరిచటం చాల సులువైన పని ఎందుకంటే వారు సౌమ్యులు, దౌర్జన్యం చేయలేరు, అల్ప సంఖ్యాకులు. నిజమైన శత్రువుని ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, కాబట్టి దళితులు, మైనారిటీలు ఏం చేస్తారంటే తమ శత్రువుని గౌరవిస్తూ తమ సొంత ప్రజలనే వ్యతిరేకిస్తారు. అందుచేత తమలోని బాధితులను ఆదుకోలేక బాధితులదే తప్పంటారు. అయినా వాళ్ళనుతీవ్రవాదులు, పిడివాదులు అంటారు, దాడులకు కారకులంటారు. అగ్రవర్ణ హిందూ ఉగ్రవాదులు మన దేశ లౌకిక నాగరికతను, సమగ్రతను దెబ్బతీస్తున్నా వాళ్ళను విమర్శించే ధైర్యం లేదు.
సమస్యలను గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి. పిరికిపందలు, తప్పించుకునే స్వభావం కలవారు ఈ సమస్యలను గుర్తించటానికి తిరస్కరిస్తారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించరు. మనమంతాలౌకికవాదులం,శాంతినిప్రేమించేవాళ్ళం, అహింసావాదులం. కానీ మనకి ఏమి సరిపోతాయో వాటినే స్వీకరిస్తూ చేస్తాం. కానీ లేఖనాలు చెప్పిన విషయాల్ని పాటించాల్సి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తాం. అధర్మాన్ని ఎదుర్కోవాలని- ఉపదేశాలు చేసే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర మత గ్రంధాలను మనం మర్చిపోయాం. కులవివక్ష అనేది తప్పు మరియు క్రూరమయినది. మన అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి ఓర్పు, లౌకికవాదం అనే ముసుగును వాడుతున్నాం. అహింసావాదులమని చెప్పుకుంటాము. అధర్మాన్ని ఎదిరించకపోవటం మరింత అధర్మాన్ని ప్రొత్సహించడమే అవుతుంది. అది మరీ పాపకార్యం. నిప్పుకోడి మనస్తత్వం మనకు ఉపయోగపడదు. మన సమస్యలను పట్టించుకోకుండా గుడ్డి చూపుతో చూస్తే సమస్యలు పరిష్కారం కావు, పైగా సమస్యలు పెరుగుతాయి. గుడ్డివాడిలాగా బూకరిస్తే మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి.
హిందువులు ద్వైతీయులు, అద్వైతీయులు, విశిష్టద్వైతీయులు, నాస్తికులు, జైన్లు, బుద్దులుగా ఉండవచ్చు.అలాగే వారికిష్టమైన ఏ దేవుడైనా, దేవతనైనా పూజించవచ్చు. హిందువులు ఎక్కువగా పూజలద్వారా, యాగాలుద్వారా, భాగవతమార్గంద్వారా, స్వాములను, బాబాలను దర్శించటం ద్వారా సమయాన్ని, ధనాన్ని మరియు శ్రమను ఖర్చు చేస్తారు. వాళ్ళు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గౌరవిస్తారు. ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే, కొట్టినవాడికి రెండవ చెంప చూపించు అన్నాడు క్రీస్తు. క్రైస్తవ మతం హింసను బోధించడంలేదు.
హైందవేతర మత ప్రచారకుల యొక్క అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో మతమార్పిడి నిషేధచట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు తి.తి.దే. దళితుల్ని హిందూమతంలోనే ఉంచే ఉద్దేశంతో "దళిత గోవిందం" అనే కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.దీనిని భారతీయ ముస్లిములకు వర్తింపచేస్తే ఎంతో బాగుంటుంది, ఎందుకంటే వారి పూర్వీకులు కూడా హిందువులే కదా! హిందూ సమాజం క్రమేణా దానిలోని వైరుధ్యాలను నియంత్రించుకుంటుంది. ఇప్పుదు వారు కులవ్యవస్ధను రద్దు చేసుకొని హిందువులందరూ సాంఘికంగా సమానులే అని చెప్పడానికి సిద్దపడుతున్నారు. కాబట్టి మనమంతా ఈ "దళిత గోవిందం"ని సాదరంగా ఆహ్వానిద్దాం.
ఈ దళిత గోవిందాన్ని దళిత ముస్లిములకు కూడా పొడిగిస్తే బాగుంటుంది. వారి తాత ముత్తాతలు కూడా హిందువులే... షేక్ శ్రీనివాసరావు, ఇబ్రహీం రాజు, మక్బూల్ నాయుడు, అహ్మద్ రెడ్డీ, గనీఖాన్ చౌదరి, సులేమాన్ మాదిగ.... మొదలగు వారు ఈ దళిత గోవిందాన్ని గురించి ఆలోచిస్తారు. హిందూత్వాన్ని ఒక మతంలా చూడకుండా ఒక జాతిగా చూడాలని హిందూనాయకులు కొందరు కోరుతున్నారు. తి.తి.దే.మత పెద్దలు కులవివక్ష నిర్మూలించటానికి ఈ పధకాన్ని రూపొందించారు. అందరు హిందువులు సాంఘికంగా ఆధ్యాత్మికంగా సమానులేనని చెప్పటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మన భారతీయ ముస్లిములు, క్రైస్తవుల పూర్వీకులు అరబ్ దేశాలనుండి రాలేదు. వారికీ పాకిస్ధానీయులకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ గౌరవంకోసం, సాంఘిక సమానత్వం కోసం తపిస్తూ ఈ కులవివక్షను తట్టుకోలేక విసుగు చెంది ఇస్లామునీ,క్రైస్తవాన్నీ అంగీకరించి స్వీకరించి వుంటారు. ఒకవేళ తి.తి.దే. ఇలాంటి వాళ్ళందర్నీ హిందూత్వంలోకి తిరిగి మార్చటానికి మార్గాన్ని తెరిస్తే అది మంచి పరిణామమే. ఇది ఎలా సాధ్యం అంటారా? కొంచెం సేపు ఆలోచించండి. హిందువులు అంత తేలికగా ముస్లిములుగా లేదా క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు? ధనం కోసమా? లేక సాంఘిక ఐక్యతతో కూడిన ఎగువస్దానం కోసమా? లేక రెండింటి కోసమా? విశ్వాసం మీద, సిద్ధాంతాల మీద ఆధారపడిన ఆధ్యాత్మిక తౄప్తి కూడా వారి మీద ప్రభావం చూపుతుంది. కాని దానివల్ల భౌతికంగానో, ఆధ్యాత్మికంగానో ఉపయోగం ఉండాలి. ఇన్నాళ్ళూ దళితులను దేవాలయాల్ని దర్శించటానికి, పూజారులవటానికి, వేదాలు నేర్చుకోవడానికి అనుమతించలేదు, కాని ముస్లిములు, క్రైస్తవులు వారిని సోదరులుగా మనస్పూర్తిగా ఆదరించి పాస్టర్లుగా, ముల్లాలుగా చేశారు. హిందూ పెద్దలు ఇప్పటికైనా వారి తప్పుని తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో అణగదొక్కబడిన కులస్దులకు హిందూత్వంలో ఏ మాత్రం సమాన హక్కులు ఇచ్చి సంఘంలో గౌరవంగా చూస్తారో మనమంతా వేచి చూడాలి. నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ఎందుకంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు ఏ కులం నుంచి ఇస్లాంలోకి మారారో, నాకు తెలియదు.అలా మార్చటం కుదరదంటే హిందువులకు ఒకే ఒక మార్గం మిగిలింది: అదేంటంటే నాలుగు వర్ణాలను వందలాది కులాలను నిర్మూలించటం, అందర్నీ హిందువులని పిలవటం. దేవుడు ఒక్కడే కాని వేలపేర్లుతో పిలుస్తున్నారు. అతను ఎవరో తెలియదు, ఎవరికీ కనిపించడు కాని ఆయన సౄష్టించిన దళితులు, ముస్లిములు మన తోటి సహోదరులు. వారు మనకు మనలాగే మనంత సమానంగా కనిపిస్తారు. కులవివక్ష వర్ణవివక్ష అనేది మనిషి సృష్టించిన ఘోర పాపం. ఈ దళిత గోవిందం ద్వారా ఆ పాపకార్యానికి ప్రాయశ్చిత్తం జరుగుతోంది. మన తప్పులేకపోయినా మతవాదులు మానవత్వాన్ని మరచి మనపై ఆధిక్యాన్ని సంపాదించటానికి మనల్ని అనేక కులాలుగా విభజించారు.మా మామ గారి ఇద్దరు అక్కలు ఒకరు చౌదరిని,ఒకరు మాదిగను ప్రేమ వివాహాలు చెసుకొని నేటికీ సజీవ ఉదాహరణలుగాఉన్నారు.వారి పిల్లలది ఏ కులం ఏ మతం అవుతుంది? అప్పుడే పుట్టిన బిడ్డకు కులం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము, ఎంత నీచమైన పద్దతి? ఎవరైనా తప్పు చేస్తే దాని ఆధారంగా కొన్ని తరాల తరువాత వారి వారసులను శిక్షించొచ్చా? అది ఎంత వరకు న్యాయం? గొర్రెపిల్ల, తోడేలు కధ మనకు గుర్తు రావడంలేదా?
మనలో ఉన్న శక్తిని అంతఃకరణ శుద్ధికి వెచ్చిద్దాం. మన నమ్మకాలని మనం తేలికగా విడిచిపెట్టలేము. ఎవరు ఎలా పని చేయాలి? ఏ క్రమంలో, ఏ పద్ధతిలో చెయ్యాలో మన మతాల పెద్దలు నిర్ణయించారు. అవి ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాయో విశ్లేషిద్దాం. లోపాలుంటే సరిచేద్దాం. అప్పుడే ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందగలుగుతాము. మన ధ్యాసంతా తప్పుడు పనులమీద ఉంది. మరో పక్క ప్రపంచం మంచిగా మారుతూ ఉంది. మంచి మార్పుల్ని మనమూ స్వీకరించాలి, మారాలి.
ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి కులవ్యవస్థను స్థాపించారని రొమిల్లా తాపర్ చెప్పారు.సెల్యులార్ అండ్ మోలికులర్ బయోలజీ హైదరాబాద్ డైరెక్టర్ లాల్జిసింగ్ ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 తర్వాత నుండే భారతదేశానికి వచ్చారనీ, కుల వ్యవస్థ అనేది 8000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందనీ అంటే మనిషి వేటాడడం నుండి వ్యవసాయానికి మారిననాటి నుండే ఏర్పడిందనీ చెప్పారు.
మన ఆలోచనలు ఇతరులకు శక్తినివ్వాలి. అవి ఇతరుల్ని మానసికంగా అణచివెయకూడదు. అవి తిరోగమనంగా, వక్రంగా ఉండకూడదు. అవి ఇతరుల బుద్దిని హరించి అశక్తుల్నిగా చేయకూడదు. అనుత్పాదకంగా ఉండకూడదు. కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయి చిన్నాభిన్నమై నిరాశతో ఉన్న దేశంలోకి ఒక కొత్త ఊపిరిని ఆశను తెద్దాం. వివేకవంతమైన ఉత్పాదకమైన ఆలోచన అశక్తులకు సరైన దారిని చూపిస్తుంది, నడిపిస్తుంది. అవివేకులను ఉత్తేజ పరుస్తుంది. అణగారిన వర్గాలను లేపుతుంది. ప్రతి మనిషికీ అంతులేని తెలివి ఉంటుంది. మనం బలంగా తయారవటానికి ఇతరులపై పడి దోచుకోవడం మానుకుందాం. మరొకరి చాకిరినీ, మేధాశక్తినీ ఉపయోగించుకొని బలంగా, మందంగా, కావరంగా తయారవ్వకూడదు. ఇతరుల శక్తియుక్తులను పిండుకుని బలంగా అహంకారులుగా తయారవ్వటం అభివృద్ధి యొక్క ప్రామాణిక న్యాయ సూత్రాలను అతిక్రమించినట్లే. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఒక్కరికీ తెలిసుండాలి. తన కడుపూ తన స్వార్ధమే పరమార్ధమనే భావన జాతి నాశనానికి దారి తీస్తుంది. "మీరు పెరగాలంటే ఇంకొకరు తగ్గాలా? మీరు ఇష్టులుకావాలంటే, ఇతరులు అంటరానివాళ్ళు కావాలా? ఇతరులు మాత్రం అల్పులుగా, స్వల్పులుగా ఉండాలా?" ఇదే మీలో ఉన్న వినాశకర శక్తి. మర్యాదస్తుడు మరొకరికి మర్యాదనిస్తాడు తనతో సమానగౌరవం ఇస్తాడు. నిరంకుశుడు ఇతరులకు స్వేచ్చను ఇవ్వడు. ఎల్లప్పుడు ఏది మంచో ఏది చెడో చెబుతూనే ఉండాలి. స్వేచ్చ కోసం సమానత్వం కోసం, సోదరభావం కోసం పోరాటం చేయాలి. మిగతా ప్రజల్ని కూడా ఆలోచించి స్వేచ్చగా మాట్లాడనివ్వండి. స్వతంత్రంగా ఆలోచించటానికి సాహసం చేయండి, ఇతరులు కూడా స్వతంత్రంగా ఆలోచించేలా చేయండి. అభివృద్ది పెరుగుదల అందరి హక్కు అనే ప్రాధమిక న్యాయసూత్రాన్ని గౌరవించండి. ఓ వ్యక్తి అభివ్రుద్ది చెందడం, సమర్ధత ద్వారా సాధించడం అనేవి అపారమైన అవకాశాలు, అతనిలో దాగి ఉన్న నిపుణత మీద ఆధారపడి ఉన్నాయి. అతన్ని శత్రువుగా భావించి అణగదొక్కకూడదు.ఇతరులని పీడించి నాశనం చేయటానికి సమయాన్ని, ఆలోచనని, శక్తిని వృదాచేయవద్దు.ఉపయోగకరమైన గొప్ప పనులకోసం శక్తిని వెచ్చించండి. ప్రజలను నిరంకుశులై పీడించకండి.
మీలోని శక్తిని ప్రజావ్యతిరేకంగా వాడకండి. సంఘాన్ని విచ్చిన్నం చేయకండి. అందరి ఐక్యత కోసం అంటరాని తలంపుల్ని వదులుకోండి. అందర్నీ రానివ్వండి.అందరితో కలవండి.అదే పనిగా పడిన దెబ్బలు శతాబ్దాల తరబడి దళితుల్లో సృజనాత్మకతను, సకారాత్మక స్పందనను చంపేసాయి.అవమానాన్ని, పేదరికాన్ని తలరాతగా భావిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. పరాజితులై అవమానంతో నిరాశ చెందడం వల్ల వారిలో ఇక పైకి లేవాలి అనే చైతన్యం, శక్తి నశించింది. నకారాత్మక శక్తి ఆవరించింది. నిరాశావాది తన నైరాశ్యాన్ని తలరాతగా భావిస్తూ తననుతానే శిక్షించుకుంటాదు. తాను ఎవరో, ఎందుకు పుట్టాడో, తానెలా ఉండాలో అన్నీ సోదాహరణంగా తెలుసుకుని నోరు మూసుకుని బ్రతుకుతాడు. నోరు విప్పినా, కాలు కదిలినా ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే అతను తనపైతానే జాలి పడతాడు. తన మీద తనకే రోత కలుగుతుంది కాబట్టి తనను తాను తిరస్కరించుకుంటాడు. బాధే సౌఖ్యమనే భావనతో నాకెందుకింత పెద్ద పదవి అంటాడు. మిగతావాళ్ళతో నేను సమానుణ్ణి కాదనుకుంటాడు. కాబట్టి పోటీపడే శక్తులన్నీ పోగొట్టుకుని అడుక్కు తినే స్వభావాన్ని పెంచుకుంటాడు. మరొకరి అదుపాజ్ఞల్లో బ్రతకడంలోనే ఆనందిస్తాడు. ఆధ్యాత్మికమైన స్వేచ్చ సృజనాత్మక శక్తికి జీవాన్నిస్తుంది. ఆధ్యాత్మికమైన స్వేచ్చ మనిషి ఎదుగుదలకు అపార అవకాశాలనిస్తుంది. దళిత గోవిందం ఈ ఆధ్యాత్మికమైన స్వేచ్చను ఇచ్చే ఒక ఆశాకిరణం. మారిన వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. తనకు తాను సంపాదించుకుంటాడు. అతని మనసు ఉత్తేజితమై వెలుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు చీకటి గుహకు సూర్యుని కాంతి, చంద్రుని కాంతి ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు. కాని చిన్న దివిటీ కాంతి రెప్పపాటు కాలంలో చీకటిని చీల్చి వెలుగు తెస్తుంది. అలాగే ఈ వెలుగు చీకటి గుహలో ఉన్న దళితులు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక అంధకారాన్ని చెదరగొడుతుంది. చీకటి చెరలో ఉన్న అతని ఆలోచనా శక్తులకు వెలుగునిస్తుంది. వందల సంవత్సరాల తరబడి రాజ్యమేలిన హిందూ చీకటి తనంపై ఈ దళిత గోవిందం తన వెలుగును ప్రసరించింది. సాంఘిక, ఆధ్యాత్మిక సమానత్వం వైపు దారి చూపింది. దైర్యమిచ్చింది. అడుగులు వేయించింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి. అన్ని దేవాలయాల వాళ్ళూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను, అర్చకులను అభినందిద్దాం.
దళిత గోవిందం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. దళిత గోవిందం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.