చావలి బంగారమ్మ, (1897 - 1970) తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో జన్మించిన కవయిత్రి. ఈమె ప్రముఖ కవి కొంపెల్ల జనార్ధనరావు సహోదరి.[1] 1910 నుంచి తెలుగులో చెదురుమదురుగా వస్తున్న ఈ కవితలన్నీ 1930లో ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ద్వారా వెలుగులోకొచ్చాయి. అలా సాహితీ లోకానికి పరిచయమైన భావకవితా యుగానికి చెందిన కవయిత్రి చావలి బంగారమ్మ. ‘కాంచన విపంచి’గా వెలువడిన ఈవిడ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త చూపునీ, సరికొత్త భావవ్యక్తీకరణని తీసుకొచ్చాయి.

ఆమె గేయాలను 1930లలో భారతి, ఉదయిని, జ్వాల, ఆంధ్రపత్రిక ఉగాదిసంచికలలో ప్రచురించారు. "కాంచన విపంచి" అనే పేరుతో పుస్తకంగా 1958లో ప్రచురించారు. [2]

జీవిత విశేషాలుసవరించు

ఆమె తూర్పుగోదావరి జిల్లా కోనసీమకి సమీపంలో ఉన్న మోడేకుర్రులో 1897లో జన్మించింది. 1932-37 మధ్య బంగారమ్మ రాసిన కవితలని ‘భారతి, ఉదయిని’ తదితర పత్రికలు ప్రచురించాయి. అలతి అలతి పదాల్లో అనంతార్థాలను పొదగడం, గాఢమైన అనుభవాలను తేలికైన పదాలతో కవిత్వీకరించడం బంగారమ్మ కవితాగుణం. చిన్నవి, సున్నితమైనవి, భావదృష్టికి అందలేనివాటిని సైతం లలితమైన పదాల్లో పొదిగి కవితలల్లడంలోని విలక్షణత ఆమె కవితల్లో కనిపిస్తుంది. [3]

జానపద గేయాల్లో కనిపించే సరళత, స్పష్టత, లయాత్మకత బంగారమ్మ కవితల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. కేవలం చదవడం మాత్రమే కాక పాడుకోవడానికి అనువైన ఓ తూగు, పదాల ఒడుపు ఉంటాయి. ‘తుమ్మెదా!’ కవితలో కనిపించేది ఈ లక్షణమే.

‘కాంచన విపంచి’లోని అత్యధికం కవితలను ఆమె తన సోదరుడితో కలిసి మద్రాసులోని మల్లంపల్లి సోమశేఖరశర్మ వారింట్లో ఉంటున్నప్పుడు రచించింది. సొదరుణ్ని స్మరిస్తూ బంగారమ్మ రాసిన స్మృతికవిత ఇది. భావకవిత్వంలో స్మృతికవిత్వం అనేది ఒక ప్రత్యేకమైన శాఖ. ఆత్మీయులను స్మరిస్తూ వారితో ముడిపడిన జ్ఞాపకాలను ప్రస్తుతిస్తూ రాసే గాఢమైన భావతరంగమది.

కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది; సాధనవల్ల వచ్చింది కాదు. కొంపెల్లవారి కుటుంబమే పండితుల, కవుల కుటుంబం. ఆమె సోదరుడు జనార్దనరావు చిన్నవయసులోనే అకాలమృత్యువు వాతబడినా అప్పటికే అంత చిన్నతనంలోనే గొప్ప సాహిత్యవేత్త అనీ, గొప్ప కవీ రచయితా అనే పేరు సంపాదించుకొన్నాడు.[4]

రచనలుసవరించు

  1. ఆ కొండ (1932)
  2. కప్పతల్లి పెళ్లి (1933)
  3. తపస్సు (1933)
  4. కార్తిక పూర్ణిమ (1934)
  5. కాంచన విపంచి (1958)

ఆ కొండసవరించు

మంచులో మునిగింది
మాయమై పోయింది
ఆకాశమున గలసెనో
ఆ కొండ
అక్కడే పడియుండెనో !

జరజరా నడిచింది
గిరగిరా తిరిగింది
ఒలు తిరిగి తాను పడెనో
ఆ కొండ
తల తిరిగి బారుమనెనో !

మూలాలుసవరించు

  1. బంగారమ్మ, చావలి (1897 - 1970), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 370.
  2. "ఆంధ్రభారతి - కవితలు - కాంచన విపంచి - చావలి బంగారమ్మ - తెలుగు గేయములు - తెలుగు పాటలు - తెలుగు కవితలు". andhrabharati.com. Archived from the original on 2019-12-15. Retrieved 2020-07-19.
  3. "భావకవితా మదువనిలో ఓ కోయిల". www.teluguvelugu.in. Archived from the original on 2020-07-19. Retrieved 2020-07-19.
  4. "ఆంధ్రభారతి - కవితలు - కాంచన విపంచి - చావలి బంగారమ్మ - గేయములు గేయాలు వక్తవ్యము - శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ - గేయాలు గేయాలు పాతలు పాటలు - తెలుగు కవితలు". andhrabharati.com. Archived from the original on 2014-08-02. Retrieved 2020-07-19.

వనరులుసవరించు