చింగ్ షి
చింగ్ షి 19వ శతాబ్ది తొలినాళ్ళలో దక్షిణ చైనా సముద్రంలో భారీ సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు. ఆమె ఉచ్ఛదశలో ఉన్నప్పుడు 18 వందలకు పైగా సముద్ర దొంగల నౌకలున్న ముఠాకు నేతృత్వం వహించింది. ఆమెకు జాంగ్ యి సావ్, జాయి చావో, చింగ్ షి, షి యాంగ్ వంటి పేర్లు ఉన్నాయి.
తొలినాళ్ళ జీవితం
మార్చుదక్షిణ చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రాంతంలోని షిన్‌హుయ్ నగరంలో 1775లో జన్మించింది.[1] ఆమె బహుశా టాంకా జాతికి చెందినదని భావిస్తారు. ఈ టాంకా జాతివారు యాంగ్జీ నదిలో నౌకల్లో నివసించే ఒక జాతి. అయితే, వీటికి ఆధారాలేమీ లేవు. చరిత్రకారులు ఆమె తల్లిదండ్రులు, నేపథ్యం వంటివాటిలో ఖచ్చితమైన వివరాలు చరిత్రకారులకు లభించలేదు. 18వ శతాబ్దిలోని నౌకలు, పడవల్లో వ్యభిచారం బాగా విస్తరించి ఉండేది. ఈ వ్యభిచార వృత్తితో చింగ్ షికి ఆరేళ్ళ వయసులోనే పరిచయమైందని చరిత్రకారులు పేర్కొన్నారు.[2]
సముద్రపు దొంగల దళంలోకి
మార్చుజాంగ్ యితో వివాహం
మార్చు1801లో జాంగ్ యి అనే సముద్రపు దొంగ అప్పటికి సెక్స్ వర్కర్‌గా ఉన్న చింగ్ షిని చూసి ఇష్టపడ్డాడు. జాంగ్ యి దోచుకున్న డబ్బులో సగం వాటా ఇస్తూ ఉంటానన్న మాటకు అంగీకరించి చింగ్ షి అతన్ని పెళ్ళచేసుకుంది. వీళ్ళ పెళ్ళికి మూడేళ్ళ క్రితమే 1798లో జాంగ్ యి ఒక జాలరి కుటుంబానికి చెందిన జాంగ్ బావో అనే పదిహేనేళ్ళ కుర్రాడిని ఎత్తుకొచ్చి, దత్తత తీసుకుని పెంచుకుంటూ, సముద్రపు దొంగతనంలోకి దింపాడు.[2]
జాంగ్ యి సముద్రపు దొంగ. అంతే కాదు, వాళ్ళ వంశమే అంతకు కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిపాలించిన మింగ్ సామ్రాజ్య కాలం నుంచి తరతరాలుగా సముద్రపు దొంగల వంశం.[3] టాయ్ షోన్ యుద్ధాలన్న పేరిట జరిగిన వియత్నామీస్ అంతర్యుద్ధంలో ఈ సముద్రపు దొంగ ప్రైవేటీర్‌గా పాల్గొనేవాడు. తన కజిన్ జాంగ్ కీ ముఠాలో ఇతనొక సముద్రపు దొంగగా ఉండేవాడు. ఈ ముఠాకి అంతర్యుద్ధంలో టాయ్ షోన్ రాజవంశం డబ్బిచ్చేది, వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు దాడులు చేసేవారు.[4]
చింగ్ షి - జాంగ్ యిల పెళ్ళి జరిగిన ఏడాదిలోపే 1802 ఫిబ్రవరిలో జాంగ్ యి కజిన్, నాయకుడు అయిన జాంగ్ కీని టాయ్ షోన్ వంశపు శత్రువులైన గుయెన్ రాజవంశపు దళాలు చైనాకీ, వియత్నాంకీ సరిహద్దుల్లో ఉండే జియాంగ్‌పింగ్ నగరంలో (ఈనాటి డాంగ్‌షింగ్ నగరం దగ్గరలో) పట్టుకుని మరణశిక్ష వేసి చంపాయి. అదే ఏడాది జులై 20న గుయెన్ దళాలు రాజధాని థాంగ్ లాంగ్ నగరాన్ని చేజిక్కించుకోవడంతో టాయ్ షోన్ రాజవంశ పరిపాలన అంతమైపోయింది.[5] జాంగ్ యి తన కజిన్ జాంగ్ కీ మరణంతో అతని స్థానాన్ని తీసుకుని అంతవరకూ టాయ్ షోన్ రాజవంశపు పోషణలో ఉన్న చైనీస్ సముద్రపు దొంగల ముఠాలను తీసుకుని చైనీస్ సముద్రతీరానికి వచ్చేశాడు.[6] ఈ దశలోనే చింగ్ షి - జాంగ్ యి దంపతులకు 1803లో పెద్ద కొడుకు జంగ్ యింగ్జీ పుట్టాడు.[7]
సముద్రపు దొంగల సమాఖ్య ఏర్పాటు
మార్చుగ్వాంగ్డంగ్ సముద్రపు తీరం వెంబడి సముద్రపు దొంగల ముఠాల్లో అంతర్గత కలహాలు, పోరాటం పొడసూపింది. ఈ వివాదాలను కొలిక్కితీసుకువచ్చి సముద్రపుదొంగల సమాఖ్యను ఏర్పాటుచేయడానికి జాంగ్ యి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాల్లో చింగ్ షి పాత్ర కీలకంగా నిలిచింది. చర్చలు, ఒప్పందాలు, సర్దుబాట్లు వంటివి ఆమె చాకచక్యంగా నిర్వహించింది. ఇందుకు సెక్స్ వర్కర్‌గా పనిచేసినప్పుడు తనకున్న పరిచయాలు పనికివచ్చాయి.[2]
ఈ ప్రయత్నాలు ఫలించి 1805 జులైలో సముద్రపుదొంగల ముఠాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి సమాఖ్య ఏర్పాటుచేసుకునే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సమాఖ్యలోని వివిధ ముఠాలన్నీ కలసి 6 నౌకా దళాలుగా ఏర్పడ్డాయి. ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, పసుపు, ఊదా రంగుల్లో ఒక్కోదాన్ని ఒక్కో బృందానికి జెండా గుర్తుగా చేశారు. మొత్తంగా 6 నౌకాదళాల్లో 1200 సాయుధ నౌకలతో 70 వేలమంది సముద్రపు దొంగల సమాఖ్య ఏర్పడింది. ఈ మొత్తం సమాఖ్యకు జాంగ్ యి నాయకత్వం వహించగా చింగ్ షి అతన్ని వెనుకుండి నడిపించసాగింది.[2]
ఆమె భర్త జాంగ్ యి ఒక దళానికి, వారి దత్తపుత్రుడు జాంగ్ బో మరొక దళానికి నేతృత్వం వహించారు. 1807లో చింగ్ షి తన రెండవ కుమారుడు జంగ్ షియాంగ్జీకి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకు 1807 నవంబరు 16న సముద్రపు ప్రయాణంలో బలమైన గాలులు వీచడంతో ఓడ మీద పడిపోయిన జాంగ్ యి 42 ఏళ్ళ వయసులో చనిపోయాడు.[8]
సముద్రపు దొంగల సమాఖ్య నాయకత్వం
మార్చునాయకత్వాన్ని తీసుకోవడం
మార్చుతన భర్త మరణించగానే సమాఖ్య నాయకత్వాన్ని మరొకరికి అప్పగించేందుకు చింగ్ షి సుముఖత వ్యక్తం చేయలేదు. దత్త పుత్రుడు జాంగ్ బోతో పాటు ఆమె నాయకత్వ బాధ్యతల్ని తీసుకుంది. తన భర్త మేనల్లుడు జాంగ్ బావ్‌యాంగ్, జాంగ్ కీ కుమారుడైన జాంగ్ అన్‌బాంగ్‌ల సహకారంతో నాయకత్వాన్ని చేపట్టింది. చిన్నతనంలో తన భర్తను ఎత్తుకొచ్చి సముద్రపు దొంగగా మార్చిన గువో పొడాయ్‌తోనూ ఆమె సన్నిహితంగా ఉండేది, అతనూ ఆమెకు మద్దతునిచ్చాడు.[9] మొత్తానికి సమాఖ్యలోని వివిధ వర్గాలను సమన్వయం చేసి అందరి మద్దతూ కూడగట్టి నాయకత్వాన్ని తనచేతిలో ఉంచుకుంది.[10]
తమ ఎర్ర జెండా దళానికి నాయకత్వాన్ని జాంగ్ బో చేతిలో ఉంచినా సమాఖ్య మొత్తం మీద తన భర్త నెరపిన అనధికార నేతృత్వం మాత్రం చింగ్ షి చేతిలోకి వచ్చింది.[8] ఈ సముద్రపు దొంగల సమాఖ్యతో సంప్రదింపులు చేసిన ప్రభుత్వాధికారి వెన్ షెంగ్జీ ఒక నివేదికలో "చింగ్ షి ఆజ్ఞలను జాంగ్ బో పాటించేవాడు, ప్రతీ విషయంలోనూ ఆమెతో సంప్రదించాకే నిర్ణయం తీసుకునేవాడు" అని రాశాడు.[11]
ఈ సమాఖ్య నాయకత్వాన్ని స్వీకరించాకా జాంగ్ బో - చింగ్ షి లైంగిక సంబంధంలోకి దిగారు. అయితే జాంగ్ యి మరణానికి ముందు నుంచే వారిద్దరికీ సంబంధం ఉండేదన్న వదంతి కూడా ఉంది.[10][12]
సముద్రపు దొంగల నాయకురాలిగా
మార్చుచింగ్ షి నాయకత్వం స్వీకరించిన ఏడాది తర్వాత 1808లో సముద్రపు దొంగల సమాఖ్య బాగా చురుకుగా పనిచేయసాగింది. సెప్టెంబరులో జాంగ్ బావో కీలకమైన హుమెన్ ఓడరేవు పట్టణపు బ్రిగేడ్-జనరల్ అయిన లిన్ గువోలియాంగ్‌ని పారిపోతున్నట్టు నమ్మించి షెంజెన్ దగ్గరలో షిజ్‌యాంగ్ నదిలో ఉన్న మాఝౌ ద్వీపం దాకా వెంబడించనిచ్చి, మెరుపుదాడి చేశాడు.
మూలాలు
మార్చు- ↑ Ye 2012, p. 74.
- ↑ 2.0 2.1 2.2 2.3 "చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?". BBC News తెలుగు. Retrieved 2024-02-08.
- ↑ Murray 1987, p. 63-65.
- ↑ Murray 1987, p. 65.
- ↑ Buttinger 1970, p. 241.
- ↑ Siu & Puk 2007, p. 9, U2b.
- ↑ Murray 1987, p. 64.
- ↑ 8.0 8.1 Siu & Puk 2007, p. 10, U5a.
- ↑ Murray 1987, p. 67.
- ↑ 10.0 10.1 Murray 1987, p. 71.
- ↑ Wen 1850, p. 3.
- ↑ Wang 2019, p. 85.