చునంగత్ కుంజికావమ్మ

భారతీయ మహిళా రాజకీయవేత్త

చునంగత్ కుంజికావమ్మ (1894-1974) కేరళకు చెందిన రాజకీయవేత్త. 1938లో ఆమె కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. అప్పుడు EMS నంబూద్రిపాద్ (తరువాతి కాలంలో కేరళ రాష్ట్రానికి మొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు) కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు

మార్చు

చునంగత్ కుంజికావమ్మ పాలక్కాడ్ జిల్లా, ఒట్టపాలెంలోని చునంగత్‌లో ప్రముఖ నాయర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. కుంజికావమ్మ 1894 మార్చిలో చునంగత్ అమ్ముణ్ణి అమ్మ, ధర్మోత్ పణిక్కర్ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించింది. చునంగత్ యూపీ స్కూల్ నుంచి 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. 1911లో ఆమె ప్రగతిశీల ఆలోచనాపరుడైన మతిలకత్ వెల్లితోడియిల్ మాధవ మీనన్‌ను పెళ్ళి చేసుకుంది. తరువాత మహాత్మా గాంధీకి అనుచరురాలు అయింది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆమె బాగా చదివేది. జాతీయ ఉద్యమం లోని గొప్ప నాయకుల రచనలు చదివి భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించవడం గురించి చాలా అర్థం చేసుకుంది. తన మాతృభూమి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో తలదూర్చడానికి ఆమె తన కుటుంబ వారసత్వంగా వచ్చిన అన్ని భౌతిక సౌకర్యాలను వదులుకోవాలని నిర్ణయించుకుంది.

ఆమె 1930 ల చివరలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ నాయకురాలిగా పావు శతాబ్దం పాటు ఆమె ముందుండి పోరాడింది.

కుంజికావమ్మ స్వాతంత్ర్యోద్యమానికి విరాళాలు అందించింది. ఒకసారి మహాత్మా గాంధీ కేరళ సందర్శించినప్పుడు ఆమె తన కొడుకు మెడలో ఉన్న బంగారు గొలుసును అతడి చేత మహాత్ముడి మెడలో వేయించింది. మరో సందర్భంలో గాంధీజీ జాతీయ మేల్కొలుపుపై ప్రసంగించినప్పుడు, ఆమె తన బంగారు ఆభరణాలను జాతీయ నిధికి విరాళంగా ఇచ్చింది. గాంధీజీ వెంటనే వాటిని హరిజన సంక్షేమ నిధి కోసం వేలం వేశాడు. గాంధీజీ సలహా మేరకు ఆమె కూడా ఆ రోజు నుంచి ఖాదీ ధరించడం ప్రారంభించింది.

మలబార్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి రాజకీయ సమావేశం 1921లో ఒట్టపాలెంలో జరిగినప్పుడు, కాంగ్రెస్ మహిళా విభాగాన్ని సమీకరించడం ద్వారా ఆమె తన ఆర్గనైజింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇది ఆమె క్రియాశీల రాజకీయ జీవితానికి నాంది. తరువాత ఆమె కాంగ్రెసు పార్టీకి పూర్తికాల కార్యకర్తగా మారింది. కాంగ్రెస్ ఆదర్శాల గురించి ప్రజలకు తెలిపేందుకు అనేక సమావేశాలను నిర్వహించింది. రాష్ట్ర సదస్సులతో పాటు కాంగ్రెస్ అఖిల భారత సదస్సులలో పాల్గొని తన ప్రాంతంలోని మహిళలను స్వాతంత్ర్య ఉద్యమంలో చేరేలా ప్రోత్సహించింది.

1930, 1932 లలో ఆమె జైలు శిక్ష అనుభవించింది. 1932లో, ఆమె విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఒక గొప్ప ప్రదర్శనకు నాయకత్వం వహించింది. ఆమెను అరెస్టు చేసి మూడేళ్లపాటు కన్నూర్ జైలులో ఉంచారు. విడుదలైన తర్వాత ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా కొనసాగింది. మళ్లీ అరెస్టై, కుట్టిమాలు అమ్మ, సమువాల్ ఆరోన్, ఆషెర్ వంటి ఇతర గొప్ప మహిళా నాయకులతో పాటు వెల్లూరు జైలులో తదుపరి రెండు సంవత్సరాలు గడిపింది.

1940లో ఆమె భర్త మాధవ మీనన్ మరణించాడు. ఇది కుంజికావమ్మను ఛిన్నాభిన్నం చేసింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు తగ్గిన సామర్థ్యంతో కొనసాగినప్పటికీ, ఆమె కాంగ్రెసు కార్యకలాపాల నుండి నెమ్మదిగా వైదొలగడం ప్రారంభించింది. తరువాత ఆమె హరిజనుల సంక్షేమం, ఖాదీ వ్యాప్తి కోసం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంది. కుంజికావమ్మ తన స్వగ్రామమైన చునంగత్‌లో ఉన్నత పాఠశాల, కస్తూర్బా స్మారక కేంద్రం నిర్మాణానికి సహాయం చేసింది. ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమానికి తన 8 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది.

స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పోషించిన పాత్రకు గుర్తింపుగా 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు తామ్ర పత్ర పురస్కారాన్ని అందించింది. జాతీయ ఉద్యమంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆనాటి కేరళ ప్రభుత్వం వైనాడ్ జిల్లాలో ఆమెకు భూమిని కేటాయించబోగా ఆమె తిరస్కరించింది. తన జీవితంలో చివరి సంవత్సరాలను కుమార్తె వద్ద గడిపింది. 80 ఏళ్ల వయసులో 1974 ఆగస్టు 21న కుంజికావమ్మ మరణించింది.

మూలాలు

మార్చు

(వీక్షణంలో 1975 ఆగస్టు 4న, కేరళభూషణంలో 1975 ఆగస్టు 3న, వనితలోనూ ప్రచురించబడిన శ్రీ పిరప్పన్‌కోడ్ సుశీలన్ కథనాల ఆధారంగా).