చైనా అంతర్యుద్ధం
చైనా అంతర్యుద్ధం ఆగస్టు 1, 1927 నుంచి డిసెంబరు 7, 1949 మధ్యలో కొంత విరామంతో క్యోమింటాంగ్ (KMT) నేతృత్వంలోని చైనీస్ రిపబ్లిక్ ప్రభుత్వానికీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) దళాలకు మధ్య జరిగిన సాయుధ పోరాటం. ఈ పోరాటంలో CCP విజయం సాధించి చైనా కమ్యూనిస్ట్ విప్లవంలో భాగంగా మెయిన్‌ల్యాండ్ చైనా మీద పట్టు సాధించింది.
ఈ యుద్ధం మొదటి దశ 1927 నుంచి 1937 మధ్య జరిగింది. 1926-27 మధ్యలో క్యోమింటాంగ్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఫస్ట్ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో చైనాలోని వార్‌లార్డ్ లను అణిచివేయడానికి ఉత్తర దండయాత్ర పేరుతో యుద్ధం చేశారు. కానీ ఈ దండయాత్రలో వీరిద్దరికీ సయోధ్య కుదరలేదు. KMT నాయకుడైన చియాంగ్ కైషెక్ తమ కూటమిలో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోతుందని వారిని నిర్మూలించడానికి ప్రయత్నించాడు. ఫలితంగా ఫస్ట్ యునైటెడ్ ఫ్రంట్ కుప్పకూలింది. చైనాలో చాలా భాగాన్ని క్యోమింటాంగ్ నేతృత్వంలోని నేషనలిస్టులు నియంత్రించారు.