సా.శ.పూ. 771 నుంచి 476 వరకూ వివిధ రాజ్యాలు, సా.శ.పూ 475 నుంచి 221 శతాబ్ది వరకూ పోరాటాల్లోని రాజ్యాలు నిర్మించిన వివిధ రక్షణ కుడ్యాల్లాంటి నిర్మాణాలను కలుపుతూ మంగోలియా ప్రాంతాల నుంచి వచ్చే సంచార జాతుల దండయాత్రికులను ఎదుర్కోవడానికి క్విన్ వంశానికి చెందిన తొలి చైనా చక్రవర్తి క్విన్ షి హుయాంగ్ ఒక మహా కుడ్యాన్ని నిర్మించడం ప్రారంభించడంతో చైనా గోడ చరిత్ర ప్రారంభమైంది.[1]

చరిత్రగతిలో చైనా గోడ

చదునుచేసిన భూమ్మీద ఈ గోడలు నిర్మించారు. వీటిని కూలీలను బలవంతంగా వెట్టి చాకిరీ చేయించి నిర్మించారు. సా.శ.పూ. 212 నాటికి గన్సు నుంచి దక్షిణ మంచూరియా తీరప్రాంతం వరకూ నిర్మితమయ్యాయి.

తర్వాతి కాలపు రాజవంశాలు ఉత్తర సరిహద్దులను రక్షించుకోవడానికి వేర్వేరు విధానాలు అనుసరించాయి. హాన్ (సా.శ.పూ 202 - సా.శ. 220), ఉత్తర క్వి (550-574), సుయ్ (589-618), మరీ ముఖ్యంగా మింగ్ (1369-1644) వంశాల వారు ఈ గోడలని పునర్నిర్మించి, విస్తరించినవారిలో ఉన్నారు. అయితే వీరు చాలా అరుదుగా క్విన్ వంశపు పద్ధతులను, వారు నిర్మించిన మార్గాన్ని అనుసరించారు.

హాన్ వంశీకులు ఈ గోడలను పశ్చిమ దిశగా మరింత విస్తరిస్తూ పోయారు, క్వి వంశం 1600 కిలోమీటర్ల మేరకు కొత్త గోడలు కట్టారు. సుయ్ వంశీకులు పదిలక్షల మందికి పైచిలుకు జనాన్ని గోడ నిర్మాణపు పనుల్లో వినియోగించారు. టాంగ్ (618-907), సుంగ్ (960-1279), క్వింగ్ (1644-1911) రాజవంశాలు గోడల నిర్మాణానికి పెద్దగా సమకట్టలేదు. దానికి బదులుగా యుద్ధ ప్రయత్నాలు, దౌత్యనీతి ద్వారా మంగోలియా, తదితర లోపలి ఆసియా ప్రాంతాల నుంచి రాగల ముప్పును కట్టడిచేశారు.

దండయాత్ర ప్రయత్నాలను నిరుత్సాహపరిచే సాధనంగా ఉపయోగపడ్డా చైనాగోడ చరిత్ర పొడవునా యుద్ధాల్లో శత్రువులను అడ్డుకోవడంలో విఫలం అయింది. అలాంటి వైఫల్యాల్లో గోడ నిర్మాణంలో అత్యంత ఉత్సాహపూరితంగా పనిచేసిన రాజవంశం మింగ్‌ను పతనం చేసి చైనా చక్రవర్తిత్వం హస్తగతం చేసుకున్న 1644లో షాన్‌హై కనుమల్లోని గోడ గేట్ల ద్వారా మంచూరియాకు చెందిన క్వింగ్ వంశీకుల దండయాత్ర ఒకటి.

ప్రస్తుతం కనిపిస్తున్న చైనా గోడలో చాలా భాగం మింగ్ రాజవంశం నాటిది, మింగ్ వంశస్థుల కాలంలో గోడను చాలాభాగం రాళ్ళతోనూ, ఇటుకలతోనూ పునర్నిర్మించడం, సమస్యాత్మకమైన ప్రాంతాలకు గోడను విస్తరించడం దీనికి ప్రధాన కారణం.[2] కొన్ని భాగాలు ఇంకా మంచి స్థితిలోనే ఉన్నా, మరికొన్ని భాగాలు దెబ్బతినడమో, నాశనం కావడమో జరిగింది. ఆయా భాగాలు దెబ్బతినడం వెనుక సైద్ధాంతిక కారణాలతోనో, ఇటుకలు, రాళ్ళ కోసమో పడగొట్టడమో, కాలం గడవడం వల్ల దెబ్బతినడం వంటి కారణాలున్నాయి.[3][4] సుదీర్ఘ కాలం పాటు విదేశీ యాత్రికులకు ఆకర్షణగా ఉన్న చైనా గోడ ప్రస్తుతం జాతీయ చిహ్నంగా, ప్రముఖ పర్యాటక ప్రదేశంగా నిలిచివుంది.[5]

భౌగోళిక నేపథ్యం

మార్చు
 
Topographical map of China's northern frontier area, with modern political boundaries. Manchuria, unmarked, is to the east of Inner Mongolia.

చైనా గోడ నిర్మాణానికి మూలమైన చైనీయులు, సంచార జాతుల మధ్య ఘర్షణ మూలాలు భౌగోళిక స్థితిగతుల్లో ఉన్నాయి. దక్షిణాన చైనాలో సారవంతమైన భూములకు భిన్నంగా ఉత్తరాన ఇన్నర్ ఆసియాగా పిలిచే మంగోలియా, మంచూరియా, గ్జింజియాంగ్, టిబెట్ వంటి ప్రాంతాల్లో పాక్షిక నిర్జలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి.[6] ఈ రెండు ప్రాంతాల్లోని వాతావరణాలు, భౌగోళిక స్థితిగతులు రెండు భిన్నమైన సమాజ అభివృద్ధికి కారణమయ్యాయి.[7]

మధ్య చైనాకు చెందిన షాంగ్జి ప్రావిన్సులోని ఒండ్రు మట్టి నేలలు చైనీయులు సాగునీటి వ్యవసాయం రూపొందించుకోవడానికి వీలిచ్చాయని సినాలజిస్టు కార్ల్ ఆగస్ట్ విట్‌ఫోగెల్ ఒక నమూనాలో ప్రతిపాదించాడు. ఈ వ్యవసాయ విధానాన్ని యెల్లో నదీ లోయలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు.[8] సాగునీటి వ్యవస్థలు అంత పెద్ద ఎత్తున, ఎప్పటికీ పెరుగుతూ పోయే స్థాయిలో రూపొందించడానికి కార్మికులు, వారిని నిర్వహించడానికి ఉద్యోగుల వ్యవస్థ అవసరమైంది.[9] ధాన్యాగారాల జమా ఖర్చుల లెక్క సరిజూసుకోవడం వంటి పనులు చూసుకోవడానికి పండిత అధికారుల వ్యవస్థ ఏర్పడింది. ధాన్యాగారాల చుట్టూ ప్రాకారాలు కలిగిన నగరాలు రక్షణ కోసం, తేలికగా నిర్వహించే వీలు కోసమూ పెరగసాగాయి. ఇవి దాడులు చేసేవారిని బయటే ఉంచడంతో పాటు పౌరులు లోపల రక్షణతో ఉండేలా చూసుకుంటాయి.[10] ఈ నగరాలు కలిసి రాజ్యాలుగా, రాజ్యాలు కలగలసి ఒక సామ్రాజ్యంగా ఏర్పడ్డాయి. ఈ నమూనా ప్రకారం గోడలు నగరాలను చుట్టుముట్టి ఉండడమే కాక క్రమేపీ రాజ్యాలకు హద్దులుగా కూడా అయ్యాయి. చివరకు మొత్తం చైనీస్ సామ్రాజ్యానికే ఉత్తరాదిలోని పచ్చిక భూముల్లోని సంచారుల దాడుల నుంచి రక్షణగా నిలిచింది.[9]

చైనీస్ శైలి అభివృద్ధికి పూర్తి భిన్నమైనది ఇన్నర్ ఆసియాలోని పచ్చిక బయళ్ళలోని వాతావరణం అక్కడి సమాజాలు సంచార జీవనానికే అనుకూలిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Great Wall of China even longer than previously thought: Survey measures the wall at 21,196 km long". CBC News. June 6, 2012.
  2. Lovell 2006, p. 8.
  3. Waldron 1990, p. 218.
  4. Owen, James (March 19, 2012). "'Lost' Great Wall of China Segment Found? Google Earth, carbon dating suggest wall network even bigger than thought". National Geographic Daily News. National Geographic Society. Retrieved March 17, 2014.
  5. "The Great Wall". World Heritage List. World Heritage Centre, United Nations Educational, Scientific and World Organization (UNESCO).
  6. Waldron 1990, p. 56.
  7. Lovell 2006, p. 31.
  8. Lattimore 1937, p. 533.
  9. 9.0 9.1 Lattimore 1937, p. 534.
  10. Lattimore 1937, p. 535.

మరింత చదవండి

మార్చు