జయంతి గంగన్న శ్రీకాకుళంలో 1884లో సూర్యనారాయణ, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు మెట్రిక్యులేషన్ శ్రీకాకుళంలో ముగించి రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. ఇతడు తన 11వ యేట 5యేళ్ల వయసు వున్న సత్యనారాయణమ్మను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఎం.ఎ. చేయాలని కోరిక ఉండేది. కానీ ఇతని జాతీయ భావాల కారణంగా కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ ఇతని దరఖాస్తును తిరస్కరించాడు. దానితో రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. నవల రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు ఇతని శిష్యుడు. బొబ్బిలిరాజా తన సంస్థానంలో ఒక పాఠశాలను నడపవలసిందిగా ఇతడిని కోరగా తిరస్కరించాడు. అలాగే ఆంగ్లేయ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను ఎరచూపినా వాటిని తిరస్కరించాడు. ఇతడు ఎన్నో రచనలు, కావ్యాలు వ్రాశాడు. వాటిలో హరిశ్చంద్రోపాఖ్యానము, సుమబాల అను చాళుక్య చోళ సమ్మేళనోదంతము, కంఠమాల, నీతి సూచనలు, ఎన్నో పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఇతనికి జానపద సాహిత్యం అంటే ఎంతో మక్కువ. ఎన్నో జానపద గేయాలు వ్రాశాడు. వాటిలో ప్రాచుర్యం పొందిన "అయ్యో కొయ్యోడా", "విలాపము" మొదలైనవి ఉన్నాయి. ఇతడు భలే పెళ్లి అనే సినిమాలో నటించాడు. 1903లో ఒక లిఖిత పత్రికను నడిపాడు. ఇతడు 1962లో మరణించాడు.

మూలాలు మార్చు