జాంసింగ్ వేంకటేశ్వర దేవాలయం

జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో ఉన్న దేవాలయం. నిజాం నవాబు సికిందర్ జా అశ్వదళాధిపతిగా పనిచేసిన జాంసింగ్‌, 1810లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు.[1]

జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం
జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం ముఖద్వారం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:గుడిమల్కాపూర్‌, హైదరాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:మొగల్ - రాజ్‌పుట్ -కుతుబ్ షాహి
చరిత్ర
నిర్మాత:జాంసింగ్‌

చరిత్ర

మార్చు

రాజపుత్ర వంశానికి చెందిన జాంసింగ్‌ 1803-1829 మధ్యకాలంలో నిజాం సికిందర్ జా వద్ద అశ్వదళాధిపతిగా పనిచేస్తూ, నిజాం కుటుంబ సభ్యులకు, ప్రభుత్వ అధికారుల కోసం అవసరమైన అశ్వాలను అందజేసేవాడు. గుర్రాలు కొనటానికి వెల్తూ అడవిలో ఒకచోట పడుకోగా వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, అదే స్థలంలో గుడిని కట్టమని చెప్పడంతో తన దగ్గరున్న ప్రభుత్వ ఖజానాతో 1810లో గుడి కట్టించాడు.[2]

నిర్మాణం

మార్చు

చుట్టూ ఎత్తైన ప్రాకారం, తూర్పువైపున ప్రధాన సింహద్వారం, పన్నెండు మంది ఆళ్వార్లకు గుర్తుగా ఆలయంలో 12 పిల్లర్లతో సభామండపం నిర్మించబడి ఉన్నాయి. గుడిలోపల నల్లటి గ్రానైటు రాయితో తయూరుచేసిన ఏకశిలా స్తంభంపై ఆనాటి శిల్పాలు చెక్కబడ్డాయి. దేవాలయం ఎదుట ఎత్తై రాజగోపురం, దానికి ఇరువైపులా అశ్వాల రాతి శిల్పాలు ఉన్నాయి. సుమారు రెండొందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి చెక్కడాలు కంచి-కామాక్షి, తిరుమల వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ రీతిని పోలి ఉంటాయి.

గుడిలోనూ, చుట్టుపక్కలా బోలెడన్ని సత్రపు గదులను యాత్రికుల కోసం నిర్మించాడు. ఆలయానికి దగ్గరలో బావిని తవ్వించాడు. అక్కడ పర్షియన్ బాషలో ఉన్న శిలాఫలకంలో యాత్రికులు ఆ బావిలోని మంచి తీర్థాన్ని సేవించి కాసేపు విశ్రమించమని ఆహ్వానిస్తూ రాసి ఉంది. దేవాలయం ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉండి ప్రవేశించగానే గుడిలో ఒక మూలన తోలు ఢంకా అతిపెద్ద ఆకారంలో కనబడుతుంది. గుడి ముందు రెండంతస్థుల నక్కర్‌ఖానాను కూడా నిర్మించారు. పూజా సమయంలో అందులో కూచుని వాయిద్యాలను మోగించేవారు. ఈ సంగతి నవాబుకి తెలిసి జాంసింగుపై ఆగ్రహించాడు. దివాన్ చందూలాల్ జోక్యం చేసుకుని దాని ఎదురుగా మసీదును నిర్మించటంతో నేలకు రాలవలసిన జాంసింగు తల రక్షింపబడింది. నిజాం సైన్యానికి అవసరమైన అశ్వాల కొనుగోలుకు సమకూర్చిన నిధులతో జాంసింగ్ దేవాలయాన్ని నిర్మించాడని నవాబు సికిందర్ జా కోపోద్రిక్తుడై జాంసింగ్‌ను జైలుపాలు చేయాలని ఆదేశించాడని చరిత్రకారులు పేర్కొంటారు. అయితే నాటి నిజాం సంస్థాన ప్రధానమంత్రి చందూలాల్ అడ్డుపడి శిక్ష తగ్గించి, దేవాలయానికి సమీపంలోనే మసీదు నిర్మాణం కూడా చేయించాల్సిందిగా ఆదేశించారని, అందులో భాగంగానే బాలాజీ దేవాలయం పక్కనే కుతుబ్‌షాహీ శైలిలో మసీదు నిర్మాణం చేపట్టార నీ చెబుతారు. ఈ మసీదునే జాంసింగ్ మసీదుగా పిలుస్తారు. ఈ అరుదైన నిర్మాణాలు మతసామరస్యానికి ప్రతీకలు. ఈ రెండు నిర్మాణాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఇతర వివరాలు

మార్చు

బాలాజీ దేవాలయ ప్రాంగణంలోనే శివుని గుడి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతి ఏటా మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. ధ్వజస్తంభానికి సమీపంలో భగవంతుడిని ఆరాధిస్తున్నట్లు జాంసింగ్ ఆయన భార్య రాతి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఉత్సవ సమయంలో భజంత్రీలు మోగించేందుకు ఏర్పాటు చేసిన ‘నఖర్‌ఖానా’ నిర్మాణశైలి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడిది శిథిలావస్తకు చేరుకుంది.

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఫీచర్స్ (6 February 2015). "మతసామరస్య ప్రతీక". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 2 July 2015. Retrieved 28 May 2019.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (3 April 2016). "కార్వాన్: అంగళ్ల రతనాలు అమ్మినారిచట!". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 28 May 2019. Retrieved 28 May 2019.