జుక్తి తక్కో ఆర్ గప్పో ఋత్విక్ ఘటక్ సినిమా

జుక్తి తక్కో ఆర్ గప్పో ఋత్విక్ ఘటక్ సినిమా. బెంగాలీ చిత్ర దర్శకుడు ఋత్విక్ ఘటక్ సినిమాలలో అతితక్కువ ప్రజాదరణ పొందిన ఈ సినిమా 1971 లో బంగ్లాదేశ్ విడిపోయిన నాటి సంఘటనల నేపథ్యంలో వచ్చింది. ఈ చిత్ర దర్శకత్వంతో పాటు, రచన, ఫోటోగ్రఫి కూడా ఘటక్ చేశాడు. ఇది దర్శకుడి ఆత్మకథాత్మక మయిన సినిమాగా భావిస్తారు. ఈ సినిమాలో విద్యావంతుడయిన, మేధావి కుటుంబం నుంచి, సామాజిక బాధ్యతలనుంచి పారిపోతాడు. కథానాయకుడు నీలకంఠ బగాచి సమాజంపట్ల భ్రమలు తొలగి సత్యాన్వేషణకు బయలుదేరుతాడు. అది ఒక కళాత్మక యాత్ర కూడా. అప్పుడు బెంగాల్లో నక్సల్ ఉద్యమం కూడా ముమ్మరంగా సాగుతున్న సమయం. నీలకంఠ వెంట అతని కుమారుడు కూడా ఉంటాడు. వీరికి తోడుగా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి, బంగ్లాదేశ్ కాందిశీకురాలు తోడవుతారు. నీలకంఠ త్రాగుబోతు, ఈ చిత్రంలో ఘటక్ కుమారుడే నీలకంఠ కుమారుడి పాత్ర ధరిచాడు. ఆనాటి బెంగాల్ స్థితిగతులను సినిమాలో ప్రదర్శించాలని దర్శకుడు ప్రయత్నం చేశాడు. ముగ్గురూ బెంగాల్ పల్లెల్లోను, కలకత్తా అంతా తిరుగుతారు. పాత్రలు పేర్లు కూడా ప్రతీకాత్మకంగా పెట్టాడనిపిస్తుంది. నీలకంఠుడు శివుడు, గరళాన్ని కంఠంలో దాచుకొన్నవాడు. చివరకు పోలీసులకు, నక్సల్సుకు మధ్య జరిగిన కాల్పులలో స్వాప్నికుడు, మేధావి అయిన నీలకంఠ చనిపోతాడు. మరణిస్తూ "ఇప్పుడు ఈ విశ్వమంతా కాలిపోతోంది, నా శరీరం కాలిపోతోంది" అంటాడు. ఘటక్ వ్యక్తిత్వంలోని అరాచకత్వ భావాలు ఈ చిత్రంలో వ్యక్తమయ్యాయని అంటారు. 1974లో ఈ సినిమాకు ఉత్తమ కథకు జాతీయ పురస్కారం ఇచ్చారు.