తొడ్ల రాఘవయ్య

(టి.రాఘవయ్య నుండి దారిమార్పు చెందింది)

దీవాన్ బహాదుర్ తొడ్ల రాఘవయ్య పంతులు సి.ఎస్.ఐ భారతీయ పాలనాధికారి. 1920 నుండి 1925 వరకు ట్రావెన్కూరు రాజ్యానికి దీవానుగా పనిచేశాడు.[1] మహారాజా మూలం తిరునాళ్ కు అత్యంత ప్రీతిపాత్రమైన దీవాను. ఈయన హరిజనులకు హిందూ ఆలయాల్లో ప్రవేశం నిరాకరించడంతో వైకోం సత్యాగ్రహానికి దారితీసింది.

దీవాన్ బహాదుర్ తొడ్ల రాఘవయ్య సి.ఎస్.ఐ

పుదుక్కొట్టై రాజ్య పాలనా సంఘపు అధ్యక్షుడు
పదవీ కాలం
28 ఫిబ్రవరి 1929 – నవంబరు 1931
చక్రవర్తి రాజగోపాల తొండైమాన్
ముందు రఘునాథ పల్లవరయర్
తరువాత బి.జి.హోల్డ్స్‌వర్త్

ట్రావెన్కూరు దీవాన్
పదవీ కాలం
8 జూలై 1920[1] – 18 మే 1925
చక్రవర్తి మూలం తిరునాళ్

సేతులక్ష్మీ బాయి (చిత్తిరా తిరునాళ్ సంరక్షురాలుగా)

ముందు ఎం.కృష్ణన్ నాయర్
తరువాత ఎం.ఈ.వాట్ట్స్

మద్రాసు నగరపాలిక అధ్యక్షుడు
పదవీ కాలం
1911 – 1911
ముందు పి.ఎల్.మూర్
తరువాత ఏ.వై.జి.కాంప్‌బెల్

వ్యక్తిగత వివరాలు

ప్రారంభ జీవితం

మార్చు

రాఘవయ్య, మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర భాగంలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం మద్రాసు నగరంలో సాగింది. ఆ తర్వాత ప్రాంతీయ సివిల్ సర్వీసులో చేరి 1893లో డిప్యుటీ కలెక్టరుగా నియమించబడ్డాడు. 1904 నుండి 1906 వరకు ప్రత్యేక అటవీ ఆవాసాల అధికారిగా, 1906 నుండి మద్రాసులో రెవెన్యూ అధికారిగా కూడా పనిచేశాడు. 1911లో మద్రాసు మహానగరపాలికకు అధ్యక్షుడిగా (నగర మేయరు) గా పనిచేశాడు.

ట్రావెంకూరు దీవాన్

మార్చు

1920లో రాఘవయ్య, ఎం.కృష్ణన్ నాయర్ స్థానంలో ట్రావెంకూరు దీవానుగా నియమించబడ్డాడు. రాఘవయ్య పాలన, అభివృద్ధి, అసంతృప్తులతో కూడుకొన్నదిగా భావించబడింది. ట్రావెంకూరు ఎన్నికల వ్యవస్థను సంస్కరించిన ఘనత రాఘవయ్యకే దక్కింది. కానీ రాఘవయ్య దీవాను పాలన, అసంతృప్తి, అలజడులు రేకెత్తిన సమయంగా స్మృతిపథంలో నిలచిపోయింది. 1920లో రాఘవయ్య ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల ఫీజులు పెంచాడు. దీని పర్యవసానంగా రాష్ట్రమంతా నిరసనప్రదర్శనలు మొదలయ్యాయి.

వైకోం ఆలయంలో అనాదిగా హరిజనులకు ప్రవేశం నిషిద్ధమైనది. 1920ల తొలినాళ్ళలో జాతీయవాద భారత జాతీయ కాంగ్రేసు, టి.కె.మాధవన్ నాయర్ వంటి నాయకుల కృషితో, ఆ పద్ధతిని రూపుమాపాలని నిశ్చయించుకున్నది. మాధవన్ 1924లో వైకోం ఆలయంలోనే కాక, రాజ్యమంతటా ఉన్న హిందూ ఆలయాల్లో హరిజనులు ప్రవేశించడానికి అనుమతించే విధంగా చట్టం చేయాలని రాఘవయ్యకు విజ్ఞాపన సమర్పించాడు. కానీ, సదాచార బ్రాహ్మణుడు, కఠోర సాంప్రదాయవాది అయిన రాఘవయ్య అందుకు నిరాకరించాడు. దీంతో విస్తృత ఆందోళన చెలరేగి, ప్రభుత్వం అత్యంత అప్రసిద్ధమైనది. హరిజనుల ప్రవేశాన్ని నిరాకరించడాన్ని, రాఘవయ్యతో పాటు, మహారాజు మూలం తిరునాళ్ కూడా సమర్ధించాడు. వీరిరువురూ సత్యాగ్రహాన్ని ఆపటానికి కృషిచేశారు. కానీ, 1924లో మూలం తిరునాళ్ మరణించడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. చిత్తిరా తిరునాళ్ సంరక్షురాలిగా రాజమాత సేతులక్ష్మీబాయి పాలనను చేపట్టింది. ఆ తర్వాత కూడా కొంతకాలం రాఘవయ్య దీవానుగా కొనసాగాడు. వైకోం సత్యాగ్రహం తదనంతర పరిస్థితులు, రాఘవయ్య పరపతికి పెద్దగా భంగంకలిగించలేదు. సమర్ధ పరిపాలనధక్షుడిగా పేరుతెచ్చుకొన్న రాఘవయ్యను పుదుక్కొట్టై సంస్థానంలో రాజ సంరక్షుడిగా నియమించబడ్డాడు. మహారాణి సేతులక్ష్మీబాయి, రాఘవయ్యను చిత్తిరా తిరునాళ్‌కు శిక్షకుడిగా నియమించాలని అనుకున్నది కానీ, బ్రిటీషు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కాలంలో కూడా చిత్తిరా తిరునాళ్, రాఘవయ్య సలహాలను తీసుకొనేవాడు.

పుదుక్కొట్టై సంస్థానం

మార్చు

రాఘవయ్య 1929 ఫిబ్రవరి 28 నుండి 1931 నవంబరు వరకు పుదుక్కొట్టై రాజసంరక్షుడిగా పనిచేశాడు.[1] 1931లో రాఘవయ్య మద్రాసు సంస్థానాల తరఫున లండన్లో రౌండు టేబులు సమావేశానికి హాజరయ్యాడు.

సత్కారాలు

మార్చు

రాఘవయ్య 1921లో దీవాన్ బహాదురు బిరుదు పొందాడు. 1924లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఈయన పేరు మీద మద్రాసు పట్టణంలో టి.నగర్ లో రాఘవయ్య వీధికి నామకరణం చేశారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Indian Princely States K-Z". Retrieved 15 July 2020.