తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు

తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అనేది తమ్మిలేరు నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రంపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన ఒక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు. కృష్ణా (చాట్రాయి మండలం) , పశ్చిమ గోదావరి జిల్లా (చింతలపూడి, లింగపాలెం మండలం) లలోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ప్రధానంగా సాగునీటి వసతి కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. 1980 లో నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టులో భాగంగా తమ్మిలేరు నదిపై ఒక రిజర్వాయరు, రెండు ప్రధాన కాలువలను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 9,169 ఎకరాలు (3,711 హెక్టార్లు). ముఖ్యంగా చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఖరీఫ్, రబీ కాలాలలో ఈ తమ్మిలేరు రిజర్వాయర్ ప్రధాన సాగునీటి వనరుగా వుంది.

కొల్లేరు సరస్సులో తమ్మిలేరు కాలువ కలయక

తమ్మిలేరు నది మార్చు

 
తమ్మిలేరు కాలువ ఏలూరు వద్ద

తమ్మిలేరు నది ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి చెరువు వద్ద పుట్టి ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో సుమారు 100 కి. మీ. దూరం పైగా ప్రవహించి చివరకు కొల్లేరు సరస్సులో కలుస్తుంది.[1] మిత్రా కమిటీ సిఫారసు అనుసరించి ఈ నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామానికి 9 కి.మీ. దూరంలో ఎర్రంపల్లి గ్రామ సమీపంలో 9.82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1969 లో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణం 1980 లో పూర్తయ్యింది.

ప్రాజెక్టు స్వరూపం మార్చు

తమ్మిలేరు రిజర్వాయరు నీటి నిలువ సామర్ధ్యం 3 టి.ఎం.సి. లు. రిజర్వాయరు విస్తీర్ణం సుమారు 2,000 ఎకరాలు పైబడి వుంది. కుడి కాలువ పొడవు 6.5 కి.మీ. ఎడమ కాలువ పొడవు 10.85 కి.మీ. ఈ ప్రాజెక్టు లో భాగంగా ప్రధాన కుడి కాలువ క్రింద 3,830 ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ క్రింద 4,244 ఎకరాలు, మంకొల్లు కాలువ క్రింద 1,095 ఎకరాలు చొప్పున మొత్తం 9,169 ఎకరాలు (3,711 హెక్టార్లు) సాగు అవుతున్నాయి.

ప్రాజెక్టు సమస్యలు మార్చు

  • రిజర్వాయరు లో ప్రవేశించే జలాల లభ్యత క్రమేణా తగ్గిపోతుండడం అనేది ఈ ప్రాజెక్ట్ కు తీవ్ర సమస్యగా వుంది. ఖమ్మం జిల్లాలో బేతుపల్లి చెరువుకు ఎగువున వున్న అటవీ ప్రాంతాలలో కురిసే భారీ వర్షాలు వరద నీరుగా బేతుపల్లి చెరువులోకి చేరతాయి. ఆ చెరువు నుండి ఈ వరద నీరు తమ్మిలేరు నదిగా ప్రవహించి రిజర్వాయర్ లో చేరుకొని ప్రాజెక్టుకు సాగునీటి లభ్యతను పెంచుతుంది. అయితే ప్రాజెక్టుకు ప్రధానంగా సాగునీరు అందించే ఈ బేతుపల్లి చెరువుకు, త్రాగునీటి ప్రాజెక్టులలో భాగంగా ఆనకట్టలు కట్టేస్తుండడంతో వరద నీరు క్రిందకు ప్రవహించే సామర్ధ్యం తగ్గిపోతున్నది. దానితో రిజర్వాయర్ లోపలికి ప్రవహించే తమ్మిలేరు నదీ జలాల లభ్యత ఏటా క్రమంగా తగ్గిపోతుంది.
  • ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల కొరత సమస్య ఎదురవుతున్నది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మరమ్మత్తులకు కూడా ఈ ప్రాజెక్టు నోచుకోలేదు. లాకుల మరమ్మత్తులు, బలహీనమైన రిజర్వాయరు గట్లను దృఢ పరచడానికి, ప్రధాన కాలువల మరమ్మత్తులకు నిధుల కొరత తీవ్రంగా వుంది.

మూలాలు మార్చు

  1. Hydrology Project (January 2003). Operation Manual – Data Processing and Analysis (SW) (PDF). DHV CONSULTANTS & DELFT HYDRAULICS with HALCROW, TAHAL, CES, ORG & JPS. p. 164. Retrieved 29 June 2019.

వెలుపలి లంకెలు మార్చు