తిరుమల ఏకాంత సేవ
ఏకాంత సేవ లేదా పవళింపు సేవ తిరుమల శ్రీనివాసునికి జరిగే పూజా కార్యక్రమం. ఈ సేవలో ఒక్క మార్గశిర మాసంలో తప్ప మిగిలిన మాసాలలో భోగ శ్రీనివాసమూర్తిని ఉయ్యాలలో పవళింపజేస్తారు. ధనుర్మాసంలో ఈ సేవ శ్రీకృష్ణునికి జరుపుతారు. ఈ ఊయలలను వెండి గొలుసులతో ముఖ మండపంలో దూలానికి వేలాడదీస్తారు. అందువలనే ఈ మండపానికి శయన మండపం అని పేరు వచ్చింది. ఈ సమయంలో పాలు, పండ్లు, బాదంపప్పు మొదలైనవి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధ్రువమూర్తి పాదపద్మాలపై తొడుగును కొద్దిగా తొలగించి సుగంధ వాసనలీనే రెండు చందన బిళ్ళలను ఉంచుతారు. వక్షస్థలంపై కూడా అర్ధ చందన బిళ్లను ఉంచుతారు. పావు చందన బిళ్ళను ధ్రువమూర్తి వక్షస్థలం మీదనున్న అలమేలు మంగకు అలంకరించి, మిగిలిన పావు బిళ్ళను రాత్రి బ్రహ్మ సలుపు పూజార్ధమై అక్కడ ఉంచుతారు.
ఏకాంత సేవ సమయంలో తరిగొండ వెంగమాంబ హారతి ఇవ్వబడుతుంది. ఇందులో ముందుగా పాలు, జీడిపప్పు నైవేద్యంగా సమర్పించి తరువాత దశావతారాలలో ఒక అవతారం నగిషీ చెక్కిన పళ్ళెంలో తరిగొండ వంశీయులు సమర్పించిన మంచి ముత్యాలను పోసి ముత్యాల హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో తాళ్ళపాక వంశస్థుడు ఒకడు అన్నమాచార్య కీర్తనలను పాడుతారు.
ఈ సేవ కోసం 374 తూకముల బరువుగల రెండు బంగారు గిన్నెలను కృష్ణదేవరాయల రాణులైన చిన్నాదేవి, తిరుమలదేవి బహుకరించినట్లు సా.శ. 1513 సంవత్సరంలో ఆలయంలో వేసిన శాసనం తెలుపుతోంది. సా.శ.1514లో వేసిన మరొక శాసనం రాయల సేనానాయకుడొకడు అర్ధయామ సేవార్ధం బాగా మరగకాసిన పాలు కోసం 200 గోవులను దానం ఇచ్చినట్లు తెలుపుతోంది.