తిరుమల సహస్రనామార్చన
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ప్రతి రోజూ మూడుపూటలా ఈ అర్చనసేవ జరుగుతుంది. ఉదయాత్పూర్యం జరిగే మొదటి అర్చనలో శ్రీవారు సహస్రనామావళితోను, మధ్యాహ్నం, సాయంత్రం జరిగే అర్చనలలో, అష్టోత్తరశత నామాల తోను అర్చింపబడతారు. ఆనందనిలయంలో, ఉదయం 4 నుండి 5 గంటల మధ్య జరిగే సహస్రనామార్చనకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు, వైకుంఠం క్యూ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ భక్తులు కులశేఖరపడి నుండి గరుడాళ్వార్ సన్నిధి వరకు బారులుతీరి కూర్చొని, సహస్రనామార్చనలో పాల్గొంటారు. శ్రీవారి పాద పద్మాల వద్ద వైఖానసార్చకస్వాములు ఒక మేడికర్రతో చేయబడిన కూర్మాసనం మీద కూర్చొని, లోక కల్యాణార్ధం శ్రీవారి సహస్రనామార్చనను ప్రారంభిస్తారు.
పవిత్రమైన బ్రాహ్మీముహుర్తంలో శ్రీవారి సహస్రనామావళి, ఆలయంలోనే గాక, తిరుమల పుణ్యక్షేత్ర మంతటా వినిపిస్తూ, భక్తుల హృదయాలలో దివ్య ప్రశాంతిని ప్రసాదిస్తుంది. ఆ తరువాత ఆర్చకులు శ్రీవారి పాదాలను అర్చించిన తులసీదళాలతో, శ్రీస్వామి వారి వక్ష:స్థలంలో వెలసియున్న మహాలక్ష్మీ అమ్మవారిని అర్చిస్తారు. అనంతరం శ్రీవారికి నక్షత్రహారతిని ఇస్తారు. నారికేళం, అరటి పండ్లను నివేదించి కర్పూరహారతిని సమర్పిస్తారు. దీనితో సహస్రనామార్చన పూర్తవుతుంది.
శ్రీవారి ఎదురుగా కూర్చుని శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని కరువుదీరా దర్శిస్తూ, ఆనంద డోలికల్లో తేలుతున్న భక్తులు దివ్యానుభూతితో స్వామివారి సమీపానికి వారుసగా వెళ్లి కర్పూర హారతి వెలుగుల్లో శ్రీస్వామిని దర్శించి, మైమరచి మరలలేక, మరల, మరల స్వామివారిని తిరిగి తిరిగి చూస్తూ పరమానందభరితులౌతారు.
ఆ తర్వాత స్వామివారికి చక్కెర పొంగలి, పులిహోర, పొంగలి మున్నగు అన్నప్రసాదాలతోను, లడ్లు, వడలు వంటి పిండి వంటలతో నిండిన గంగాళాలను స్వామివారి ముందు వుంచి వివేదన జరుపుతారు. అంతకుముందుగానే, ఒక పరిచారకుడు శ్రావారి వంటశాల నుండి ప్రసాదాలను ఛత్రచామర మంగళవాద్యపురస్సరంగా వరాహస్వామి ఆలయానికి బయల్దేరతాడు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామి వారికి తొలి నివేదన జరుగుతుంది. అక్కడ నివేదన జరిగిన తర్వాత, ఇక్కడ ఆనందనిలయంలో శ్రీవారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. ఆనంతరం అర్చకులు సుగంధ ద్రవ్య పూరితమైన తాంబూలాన్ని భక్తిగా శ్రీవారికి సమర్పిస్తారు.
తిరుమల క్షేత్రంలో ఎంతో ప్రాచీనతను, ఔన్నత్యాన్ని సంతరించుకున్న ఈ సహస్రనామార్చన నేటికీ భక్తలోకంలో విశేషమైన ప్రాముఖ్యాన్ని పొందింది. ఈ అర్చన చేసినా, చూచినా, విన్నా, పాపవిముక్తులౌతారని, సర్వదోషాలు హరిస్తాయని ఈ నామావళి మహాత్యాన్ని నారదమహర్షి కీర్తించాడు.