తిరుమల హుండీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనాస్థలంగా తిరుమల ప్రసిద్ధి కలిగింది.
చరిత్ర
మార్చుతిరుమల ఆలయానికి ఉన్న ప్రాచీనమైన చరిత్రలో చాలాభాగం ఆయన హుండీకి కూడా ఉంది. దేవాలయవ్యవస్థ బలపడ్డాకా హుండీ, కానుకల చెల్లింపు వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. స్వామి వారి హుండీ ఆదాయం 18వ శతాబ్దం నుంచీ కూడా ఎక్కువగానే ఉండేది. 1830ల్లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్టిండియా కంపెనీకి దాదాపు రూ.లక్ష మిగులు ఉండేది. ఇది 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఒక ప్రార్థనామందిరం నుంచి ఊహించేందుకు వీలులేనంత భారీమొత్తమే.[1]
శ్రీ వారి సంపద
మార్చుస్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, గుజరాత్, హరియాణా, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా తదితర రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి భూములూ, భవనాలూ ఉన్నాయి. ఇవికాక విదేశాల్లోనూ కొన్ని ఆస్తులున్నాయి. శ్రీనివాసుడి పేరు మీద సుమారు నాలుగున్నరవేల ఎకరాల భూమి ఉంది. ఇక వేంకటేశ్వరుడి అకౌంటు కింద వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వాటి ద్వారా దేవస్థానానికి ఏడాదికి 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తోంది. ఇవికాక సేవలూ, అద్దెల ద్వారా వచ్చేది కొంత. అలా శ్రీనివాసుడికి 2016 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం 2,900 కోట్ల రూపాయలు.[2]
విశ్వాసాలు
మార్చుతిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవడాన్ని సూచిస్తాయి. పౌరాణిక గాథల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడు వేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.
ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మిక. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు. శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద 'శ్రీచక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి. 1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయంలో పూర్వం నేలపై వున్న రాళ్ళను (ప్లోరింగ్) తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీచక్రాన్ని అలానే వుంచి దానిపై రాళ్ళను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక "సప్తగిరి" పేర్కొంది.
మూలాలు
మార్చు- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-27. Retrieved 2017-09-27.