తెలంగాణ విశిష్ట దేవాలయాలు

జాబితాలు మార్చు

కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం మార్చు

 
కీసరగుట్ట రామలింగేశ్వరాలయ ప్రధాన గోపురము
స్థలపురాణం

త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వన విహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

 
కీసరగుట్టపై వరుసలుగా స్థాపించిన శివలింగాలు

అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.

 
కీసరగుట్టపై వున్న ఆంజనేయ స్వామి విగ్రహము

తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.

చారిత్రిక ప్రాముఖ్యత

చారిత్రక పరిశోధకుల అభిప్రాయము ప్రకారం సా.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరి రాజముద్రిక లంఘించు సింహం (కేసరి).

 
కీసరలో పురావస్తు శాఖవారి ఫలకము

విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండినులు తెలుగుభాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.

 
కీసరలో తామర కొలను

ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు.

సా.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం ఉంది. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ గుట్టపైన బండ రాతి పై అనేక శివ లింగాలు ఉన్నాయి. ఉత్సవ సమయంలో వీటి నన్నిటిని నూనెతో అభిషేకిస్తారు.

 
కీసరలో బయల్పడిన శతాబ్దాల నాటి కట్టడాల పునాదులు

చరిత్రకెక్కని మరొక విసేషము ఇక్కడున్నది. అదేమనగా ఈ గుట్ట పైన, ప్రక్కనున్న గుట్టపైన వృత్తాకారంలో అతి పెద్ద ఇటుకలతో కట్టిన బౌద్ధ స్తూపాల వంటి కట్టడాలు కనిపిస్తాయి. అవి చాల వరకు శిథిలమై పోతున్నాయి. అదే విధంగా కీసర గుట్ట ప్రక్కన వున్న మరొ గుట్టపై ఒక పెద్ద ద్వారము కట్టబడి ఉంది. అది ముస్లిం వాస్తును ప్రతిబింబిస్తున్నది. దీనిని నిజాం ప్రభువుల ఉద్యోగులైన అక్కన్న మాదన్నలు కట్టించినట్టుగా తెలియు చున్నది. ఈ ప్రాంగణంలో అక్కన్న మాదన్నలు కట్టిన మరో రామాలయము కూడా ఉంది.

క్షేత్ర విశిష్టత

కీసర గుట్టలో వేద సంస్కృత పాఠశాల : దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది. ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబదుచున్నవి. గురుకుల విద్యాలయము : ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

పూజలు

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉంది. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు. ఈక్షేత్రము జంటనగరాలకు చాల దగ్గరగా వున్నందున భక్తులు విశేషంగా నిత్యము వస్తుంటారు.

వసతులు

తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం, వసతి సదుపాయం ఉంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాంహణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది. 'రవాణ సౌకర్యాలు.: ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో వున్నందున జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజి నుండి చాల బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి.

చిలుకూరు బాలాజీ దేవాలయం మార్చు

 
చిలుకూరి బాలాజి మూల విరాట్టు
ఈ క్షేత్రం ఎక్కడుంది?

చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. నగర విస్తరీకరణలో ప్రస్తుతం ఈ క్షేత్రము హైదరాబాదు నగరంలో ఒక భాగమైపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సులు నడుస్తుంటాయి.

ఆలయ విశిష్టత

బాలాజీ వేంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి, ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది. దీనిని ప్రభుత్వం వారు యాదగిరి గుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రస్టీలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. దేవాలయం మరీ చిన్నదిగా ఉండి, కేవలం లోపల నలుగురైదుగురు మాత్రమే పట్టే వీలు కలిగి ఉంటుంది. కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం ఇప్పుడు ప్రత్యేక బస్సులు నడిపించే పరిస్థితికి చేరుకొన్నది. తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన, హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన, చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర".

చారిత్రికత

సా.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలతో సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 2005 మార్చి 25న అప్పటి శాసన సభ సభాపతి కె.ఆర్. సురేశ్ రెడ్డి విడుదల చేశారు.

అనంత పద్మనాభుడు, నిజామాబాద్ జిల్లా మార్చు

ఎక్కడ ఉన్నది ఈ క్షేత్రం?

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కా పూర్ గ్రామమంలో ఈ ఆలయమున్నది. ఇది స్వయంభూదేవాలయము. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్నందున రవాణా సౌకర్యాలు బాగా ఉన్నాయి.

చారిత్రక ప్రాముఖ్యత

మూడున్నర శతాబ్ధాల పైగా చరిత్ర కలిగినది ఈ ఆలయము. స్వయంభువుగా వెలసిన పద్మనాభ ఆలయాలు మన రాష్ట్రంలో రెండే ఉన్నాయి. రంగా రెడ్డి జిల్లా వికారాబాదు లోని అనంత గిరి మొదటిది. రెండోది నిజామాబాది జిల్లాలోని మల్కాపూరు లోని ఈ క్షేత్రము. చారిత్రక ఆధారాలను బట్టి......... వికారాబాదు లోని అనంత పద్మనాభస్వామి ఆలయ పూజారుల కుటుంబానికి చెందిన కోనమాచార్యులనే బ్రాహ్మణుడు నిజామాబాదు జిల్లాలోని మల్కాపూరు ప్రాంతంలో ఉండేవాడు. ఒకసారి విష్ణుమూర్తి ఆయనకు కలలో కనిపించి ఈ క్షేత్ర పాలకులు ఇక్కడికి వచ్చినపుడు తాను తెల్లని గుర్రం రూపంలో కనిపిస్తానని, ఆ గుర్రం పరుగులు తీస్తూ ఎక్కడ అంతర్థానం అవుతుందో అక్కడ తాను స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడు. ఒక రోజున ఆ ప్రాంత పాలకులైన గాంధారీ సంస్థానాధీశులు మల్కాపురము..... గుండారం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు గట్టు పై ప్రయాణిస్తున్నపుడు తాము ప్రయాణిస్తున్న ఎడ్లబండి ఇరుసు విరిగి పోయింది. దాన్ని సరిచేసుకునే సమయానికి అక్కడికొచ్చిన కోనమాచార్యులు తనకు కలలో విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని చెప్పగా ..... అదే సమయంలో ఒక తెల్లని గుర్రం తమ ముందు పరుగులు తీయడం మొదలు పెట్టింది. కోనమాచార్యులు, సంస్థానాధీశులు..... ఆ గుర్రాన్ని వెంబడించారు. ఆ గుర్రం మల్కాపూరు శివార్లలోని ఒక గుట్టల్లో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అంతర్థానమై పోయింది. గుర్రాన్ని వెంబడించిన వారు ఆ గుహలో పరీక్షించి చూడగా ..... రాళ్లమధ్యలో ఒక సన్నని కాంతి ప్రసరిస్తున్నది. దానినే లక్ష్నీ అనంత పద్మనాభ స్వామి రూపంగా భావించి పూజలు చేయ నారంభించారు. కొన్నాళ్లకు సన్నని కాంతి రూపంలో ఉన్న ఆవెలుగు అమ్మవారి సహితంగా శంఖు చక్రాలతో భక్తులకు అనంత పద్మనాభ స్వామి దర్శనమిచ్చాడు. అది ఎత్తైన ప్రదేశం అయినందున స్వామి వారిని దర్శించుకోడానికి నిచ్చెనపైకి ఎక్కి చూడాలి. స్వామి వారికి పూజలు చేయడానికి పూజారులకు, దర్శనంకొరకు వచ్చిన భక్తులకు ఇది కొంత కష్టంగా ఉన్నందున ఆ గుహలోనే మరో ఆనంత శయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు పాలకులు. ప్రస్తుతం వారు ఏర్పాటు చేసిన స్వామి వారి విగ్రహానికే పూజలు జరుగుతున్నాయి.

పూజలు ఇతర ఉత్సవాలు

ఈ అనంత పద్మనాభునికి ఏటా మాఘ బహుళ తదియ నుండి అష్టమి వరకు వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా .... పంచమి రోజున స్వామి వారి కల్యాణం, సప్తమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను నాలుగు గ్రామాల వాళ్లు నిర్వహించడం విశేషం. ఒక ఏడాది ధర్మారం గ్రామవాసులు నిర్వహిస్తే తదుపరి ఏడాది లక్ష్మాపూరు, మల్కాపూరు, గ్రామస్థులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు పరిసర జిల్లాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం, అన్నదానం నిర్వహిస్తారు. (మూలం. గట్టోళ్ల శ్రీనివాస రెడ్డి వ్రాసిన వ్యాసం. ఈనాడు 2012 ఫిబ్రవరి 12)

మహబూబ్ నగర్ జిల్లాలో మరో ఏడు కొండల స్వామి మార్చు

ఆలయవిశిష్టత

తిరుమల కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి వలెనే మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి గ్రామంలో కూడా అన్ని విధాల తిరుమల ఏడు కొండల స్వామి వలె మరో స్వామి వెలిశాడు. తిరుమలలో శ్రీవారు వెలసిన కొండను అనంత గిరి అంటారు. ఇక్కడ కురుమూర్తిలో శ్రీవారు వెలసిన కొండను దేవతాద్రి అంటారు. తిరుమలలో లాగానే ఇక్కడా వినాయకునికి విగ్రహం లేదు. తిరుమలలో వలెనే ఇక్కడా వేంకటేశ్వరుడు ఏడు కొండల నడుమ వెలిశాదు. ఆ ఏడు కొండలు వరుసగా శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, గణాద్రి, భల్లూకాద్రి, పతకాద్రి, దేవతాద్రి. తిరుమలలో వలెనే ఇక్కడా స్వామి వారు వీరస్థానక భంగిమలో కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా తిరుమల మెట్ల దారిలో ఉన్నట్టు శ్రీవారి పాద చిహ్నాలున్నాయి. ఇలా తిరుమలతో అన్నివిధాల పోలికలున్న శ్రీవేంకటేశ్వరాలయం (పాలమూరు) మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి గ్రామంలో వెలసి ఉంది. అందుకే దీనిని పాలమూరు తిరుపతి అంటారు.

కేతకీ సంగమేశ్వరాలయం మార్చు

స్థలపురాణం

స్కాంద పురాణం ప్రకారం: పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనంగా అనగా మొగలి వనంగా మారిందట. ఒకసారి బ్రహ్మ .... కేతకీ వనంలో శివుని గూర్చి తపస్సు చేయగా, శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఆ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరు. ఈ ఆలయంలో సంగమేశ్వరుడు, కేతకి, పార్వతి సమేతంగా కొలువు దీరి ఉన్నాడు.

ఆలయ విశిష్టత

ఈ ఆలయ వెనక భాగములో ఒక కోనేరు (గుండం) ఉంది. కాశీలో ప్రవహించే గంగా నది యొక్క ఒక ధార భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మిక. మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనబడదు. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామి వారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో బాటు ఆ రంధ్రం గుండా వెళ్లి పోతుంది. అలా ఆ నీరు ఒక సొరంగం లోనికి వెడుతుందని భక్తుల నమ్మిక. నీటితో బాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళి పోతుంది. కాసేపటికి ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండి పోతుంది. ఇదంతా సంగమేశ్వరుని లీలగా భక్తులు భావిస్తారు. భక్తులు ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ రోగాలు, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుక్రింద ఒక శివ లింగం ఉంది. దానిని కేవలం చేతి వేళ్లతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. దీనిని కోరికల లింగం అని అంటారు.

పూజలు

మరే ఆలయంలో లేనివిధంగా ఇక్కడి శివునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతిరోజు మొగిలి పూలతో అభిషేకం నిర్వహిస్తారు. అన్నపూజ, తమలపాకుల పూజ చేస్తారు. భక్తులు చెరకు ముక్కలతో అర్చన చేస్తారు. మహా శివరాత్రికి, కార్తీక, శ్రావణ మాసాల్లోను, దేవీ నవరాత్రుల్లోను భక్తులు ఎక్కువగా వస్తుంటారు. శివరాత్రికి తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల జిల్లాలనుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల వసతి కొరకు దేవస్థానం వారి గదులు ఉన్నాయి.

ఎలా వెళ్లాలి?
... హైదరాబాదు.... బొంబాయి రహదారిలో జహీరాబాదుకు 15 కిలో మీటర్ల దూరంలో కేతకీ సంగమేశ్వరాలయము ఉంది. జహీరాబాదు బస్సు స్టాండు నుండి బస్సులు, ఆటోలు విరివిగానే ఉంటాయి. (మూలం: ఈనాడు, ఆదివారం. 2012 సెప్టెంబరు 2.)