తెలుగు నాటక వికాసము


తెలుగు నాటక వికాసము 1960లో పి.ఎస్.ఆర్. అప్పారావు తెలుగు నాటకరంగం గురించి రాసిన పరిశోధన పుస్తకం.[1] ఈ పుస్తకానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్ట లభించింది.

తెలుగు నాటక వికాసము
Telugu Nataka Vikasamu Book Cover Page.png
తెలుగు నాటక వికాసము పుస్తక ముఖచిత్రం
కృతికర్త: పి.ఎస్.ఆర్. అప్పారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు నాటకరంగ పరిశోధన పుస్తకం
ప్రచురణ: శివాజీ ప్రెస్, సికింద్రాబాద్
విడుదల: 1960
పేజీలు: 846

తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి. సుమారు వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నారు. అయితే, వాటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం 1960 వరకు జరగలేదు. తొలినాళ్లలో వెలువడిన కొన్ని నాటకముల ప్రతులు దొరకలేదు. కొందరు నాటక రచయితల గురించిగానీ, ఆధునిక నాటకరంగ ప్రారంభమెప్పుడో, ఎవరుముందో, ఎవరు వెనుకో, నాటకరంగ వికాసం ఎలా జరిగిందో తెలుసుకొనుటకు తగిన ఆధారాలు సంపూర్ణంగా లభించలేదు.

అలాంటి పరిస్థితుల్లో పి.ఎస్.ఆర్. అప్పారావు చాలా ప్రాంతాల్లో తిరిగి, ఎందరో వృద్ధ నటులను, నాటకకర్తలను, కళాభిమానులను కలిసి, తెలుగు నాటకరంగ చరిత్ర సమగ్ర నిర్మాణంకోసం చాలా సమాచారాన్ని సేకరించి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.

రచనా ప్రణాళికసవరించు

తెలుగు నాటక వికాసము ఐదు భాగాలుగా విభజించబడింది.

  1. ప్రథమభాగం: ఇది తెలుగు నాటక చరిత్రకు పూర్వరంగప్రాయం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యయంలో నాట్యకళ యొక్క స్వరూప నిరూపణాత్మకము, రెండవ అధ్యాయంలో ప్రాచ్య-పాశ్చాత్య రూపక నిరూపణాత్మకము, మూడవ అధ్యాయంలో ప్రాచీనకాలంలో తెలుగు రాష్ట్రాలలో సంగీత-నృత్య-నాట్యములు పొందిన వికాసం, నాలుగవ అధ్యాయంలో ప్రాచీనాంధ్రదేశములోని దృశ్య కళా స్వరూపములును ఇందులో వివరించబడింది.
  2. ద్వితీయభాగం: ఆధునిక తెలుగు నాటకరంగ ఆరంభ వికాసాలకు సంబంధిచిన భాగం. ఈ పుస్తకం మొత్తంలో ఈ ద్వితీయభాగమే ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. మొదటి అధ్యయం (1860-1886) లో ఆధునిక తెలుగు నాటక రచనా-ప్రదర్శనల ప్రారంభం, రెండవ అధ్యాయం (1886-1900) లో తెలుగు నాటక రచన బహుముఖములుగా వికసించడం, మూడవ అధ్యాయం (1900-1920) లో ఆధునిక తెలుగు నాటక రచనా-ప్రయోగాల విస్తృతి, నాలుగవ అధ్యాయం (1920-44) లో నాటక రచనకు సంబంధించిన నూతన ప్రయోగాలు, ఐదవ అధ్యాయం (1920-44) లో నాటికల ఏకాంకిల వికాసం, ఆరవ అధ్యాయంలో సమకాలీన రచనలు (1944 తరువాతి రూపక చరిత్ర) వివరించడం జరిగింది.
  3. తృతీయభాగం: ఈ భాగంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ భాగం తెలుగు నాటక చరిత్రకు సింహావలోకన భాగం. మొదటి అధ్యాయంలో ఇతివృత్త-రచనా స్వరూపాలనుబట్టి నాటకరచన సమీక్ష, రెండవ అధ్యాయంలో ఆధునిక నాటక ప్రయోగాల వివిధ దశలు, మూడవ అధ్యాయంలో తెలుగులోని నాటక విమర్శ యొక్క చరిత్ర, ఇతర అంశాల సమీక్షలు ఉన్నాయి.
  4. చతుర్థభాగం: ఇందులో ఐదు అనుబంధాలు ఉన్నాయి. మొదటి అనుబంధంలో నాటక-నాటిక-ప్రహసనాలు ఆకారాదిక్రమంలో, రెండవ అనుబంధంలో రచయితులు ఆకారాదిక్రమంలో, మూడవ అనుబంధంలో కొందరు ప్రసిద్ధనటుల, కొన్ని ప్రసిద్ధ నాటక సమాజాల పేర్లు జిల్లాల క్రమంలో, నాలుగవ అనుబంధంలో ఉపయుక్తగ్రంథసూచి, ఐదవ అనుబంధంలో ముఖ్యపదానుక్రమణిక ఆకారాదిక్రమంలో ఉన్నాయి.
  5. పంచమభాగం: ఈ భాగంలో కొందరు ప్రసిద్ధ రచయితల, విమర్శకుల, పోషకుల, నటీనటుల ఛాయాచిత్రాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967).

ఇతర లంకెలుసవరించు