దాట్ల పద్మజ పెంటపాడు ప్రభుత్వ పోస్ట్‌ బేసిక్‌ పాఠశాలలోని బధిరులకు సమగ్ర విద్యావిధానం (ఐఈడీసీ) కేంద్రంలో రిసోర్స్‌ టీచరు. తన కుమార్తె గొంతు మూగబోవడం ఆ తల్లిని కలిచివేసింది. తన కూతురే కాదు వందలాది బాధిత విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆమె కంకణం కట్టుకుంది. అందుకు సంబంధించిన శిక్షణను హైదరాబాదులో పూర్తి చేసుకుంది. మూగ విద్యార్థులకు స్పీచ్‌ థెరపీ, ఆడిటర్‌ ట్రయినింగ్‌ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో వచ్చే ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు. సొంత ఖర్చుతో బోధనా పరికరణ సామగ్రిని తయారు చేసుకుని బధిరుల కోసం కృషి చేస్తున్నారు. పుట్టిన తర్వాత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తే వారు సాధారణ విద్యార్థులుగా మారతారు. 70 శాతం రికవరీ కనిపిస్తుంది. సైగలను ప్రోత్సహించకుండా పెదాల కదలికల ద్వారా మొదలుపెట్టి క్రమం తప్పకుండా హియరింగ్‌ ఎయిడ్స్‌ దరించేలా చేసి వారిని అభివృద్ధి చేస్తున్నారు. స్పీచ్‌ ట్రయినర్‌, ఆడియోమీటరు, బోధించే గదికి సౌండ్‌ప్రూఫ్‌ ఏర్పాటు చేయగలిగితే విద్యార్థులు వేగంగా అభివృద్ధి చెందుతారని ఈమె సలహా.