దిగంబరరావు బిందూ

దిగంబరరావు గోవిందరావు బిందూ, మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన రాజకీయనాయకుడు. బూర్గుల రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో హోంశాఖామంత్రిగా పనిచేశాడు. హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేసు అధ్యక్షుడిగా పనిచేశాడు. హైదరాబాదు రాష్ట్రంలో మరాఠీ ప్రజల సంఘీభావానికి ఏర్పడిన మహారాష్ట్ర పరిషద్లలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. 1945లో శైలూలో జరిగిన ఆరవ మహారాష్ట్ర పరిషద్‌కు అధ్యక్షత వహించాడు.[1]

బూర్గుల రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో హోంశాఖామంత్రిగా దిగంబరరావు గోవిందరావు బిందూ

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

దిగంబరరావు బిందూ, 1896 జూలై 12న అప్పటి హైదరాబాదు రాజ్యంలోని భోకర్ గ్రామంలో దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భోకర్, అదిలాబాదు - పూణే రైలుమార్గంపై ఉన్న చిన్న ఊరు. ఈయన తండ్రి గోవిందరావు, తల్లి సుందరీబాయి. దిగంబరరావు రెండవ సంతానం. ఈయన ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి గోవిందరావు నాందేడ్లో చిన్న చిన్న ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులు చేపడుతూ జీవితాన్ని ప్రారంభించాడు. భోకర్లో స్థిరపడిన తర్వాత గ్రామంలో పోలీసు పటేలుగాను, ఆయుర్వేద వైద్యునిగానూ పనిచేసేవాడు. గ్రామంలో వైద్యునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ కుటుంబావసరాలు తీరటానికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. కుటుంబానికి బిందు-మాధవ్ కాకుండా చౌధరీ అని కూడా పేరుండేది (కుటుంబంలో ఒకరు చౌధరిగా పనిచేసేవారు).

దిగంబరరావు పన్నెండేళ్లు వచ్చేవరకు భోకర్లోనే పెరిగాడు. ప్రాథమికవిద్య అంతా అక్కడే మరాఠీ మాధ్యమంలో సాగింది. పాఠశాలలో అంకగణితం, చరిత్ర, భౌగోలికశాస్త్రం, మరాఠీ చదువుకున్నాడు. ఆ తరువాత మాధ్యమిక పాఠశాలకు నాందేడ్ చేరుకున్నాడు. నాందేడ్లో ఆంగ్లమాధ్యమం పాఠశాలలో చేరి ఉర్దూ, పర్షియన్ కూడా నేర్చుకున్నాడు. 1914లో తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నత చదువులకు పూణే వెళ్లి, 1918లో పూణే విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి హైదరాబాదులో న్యాయవిద్య అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. పగలు వివేకవర్ధిని ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు చదువుచెబుతూ, రాత్రులు హైకోర్టులో న్యాయవిద్యా తరగతులకు హాజరయ్యేవాడు. 1924లో సనద్ పట్టా పొందాడు. 1934 వరకు హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

రాజకీయ చైతన్యం

మార్చు

విద్యార్థిగా ఉన్న రోజులలో రాజకీయ పరిస్థితులు దిగంబరరావును ఎంతో ప్రభావితం చేశాయి. ఈయన మేనమామ నారాయణరావు దేశపాండే నాందేడ్లో గొప్ప దేశభక్తుడు. ఈయన దిగంబరావును అమితంగా ప్రభావితం చేసి ఈయన రాజకీయ జీవితానికి బీజం వేశాడు. దేశపాండే సూచనలపై కేసరి, భలా, హిందూ పాంచ్, కల్, హిందూ ప్రకాశ్, జ్ఞానప్రకాశ్, మనోరంజన్ మొదలైన పత్రికలను చదవటం ప్రారంభించాడు. పూణేలో ఈయనపై గోఖలే, మాలవ్యా, చింతామణి, శ్రీనివాసశాస్త్రి, సరోజిని దేవిల ప్రభావం పడి, ఆయన్ను ఇంకా రాజకీయాల వైపు ఆకర్శితున్ని చేసింది.

దిగంబరరావుకు పదహారేళ్ల వయసులో వివాహం జరిగింది. ఈయన మొదటి భార్య ద్వారా ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు. 1928లో మొదటి భార్య మరణించిన కారణంగా ద్వితీయవివాహం చేసుకొన్నాడు. రెండవ భార్య దిగంబరరావు రాజకీయ జీవితానికి ఎంతో దోహదం చేసింది. ఈమె ద్వారా దింగబరరావుకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కుమారులు కలిగారు.

హైదరాబాదు రాష్ట్రంలో మరాఠీ ప్రజల సంఘీభావానికి ఏర్పడిన మహారాష్ట్ర పరిషద్లలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. రెండవ మహారాష్ట్ర పరిషద్లో ఆమోదించిన తీర్మానాల ప్రకారం 1937 నుండి 1945 వరకు మరాఠా ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించి, శిబిరాలు నిర్వహించి, బహిరంగ సభల్లో ఉపన్యాసాలిచ్చి, స్వఛ్ఛందసేవకులను కూడగట్టే ప్రయత్నం చేశాడు. రాజకీయ సమైక్యత యొక్క ఆవశ్యకతను చాటిచెప్పడానికి అనేక వ్యాసాలు వ్రాశాడు. 1945లో తన ఆలోచనలను గ్రంథస్తం చేస్తూ "ఆమ్చే రాజకీయ ధేయ" (మన రాజకీయ లక్ష్యం) అన్న పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించాడు. 1945లో పర్భణీ జిల్లా, సెలూలో జరిగిన ఆరవ మహారాష్ట్ర పరిషద్‌కు అధ్యక్షత వహించాడు.

దిగంబరరావు బిందూ హైదరాబాదు విమోచనోద్యమంలో కీలకపాత్ర పోషించాడు. పోలీసు చర్యకు ముందు తోడ్పాటుగా, భారత జాతీయ కాంగ్రేసు అండతో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు నాయకులు పెద్ద ఎత్తున సత్యాగ్రహ ఉద్యమాన్ని కదిలించారు. రాష్ట్ర కాంగ్రేసు ఇందుకుగాను బిందూ ఆధ్వర్యంలో ఒక కార్యచరణ సంఘాన్ని నెలకొల్పింది. బిందూ నిజాం పోలీసులచే అరెస్టు కాకుండా రాష్ట్రం బయటినుండి కార్యకలాపాలు నిర్వహించాడు. ముఖ్యకేంద్రం బొంబాయిలో, దానికి అనుబంధంగా షోలాపూరు, విజయవాడ, గదగ్ లో స్థానిక కార్యాలయాలు స్థాపించాడు. వీరికి మద్దతుగా జయప్రకాశ్ నారాయణ్ నిధులు సేకరించాడు.[2]

1957లో నాందేడ్ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజకీయజీవితంనుండి విరమించుకొని గాంధీభవన్ ట్రస్టు ఛైర్మనుగా, తుల్జాభవన్ ట్రస్టు అధ్యక్షుడిగా, మరాఠ్వాడా ఖాదీ సమితి అధ్యక్షుడిగా ప్రజాసేవ కొనసాగించాడు.

మూలాలు

మార్చు
  1. Pathak, Arunchandra S. "Aurangabad Gazetteer - Chaper 2". maharashtra.gov.in. Retrieved 27 December 2014.
  2. Chandra, Bipin (1989). India's Struggle for Independence, 1857-1947. Penguin Books India. p. 371. ISBN 9780140107814. Retrieved 27 December 2014.