దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే

ఆదిత్య చోప్రా చిత్రం (1995)

దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే ప్రముఖ భారతీయ రొమాంటిక్  చలనచిత్రం ఇది. ఈ సినిమాకు దర్శకుడు, రచయిత ఆదిత్య చోప్రా కాగా,  నిర్మాత యశ్ చోప్రా. 20 అక్టోబరు 1995లో విడుదలైన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కథానాయకునిగా, కాజోల్ కథానాయికగా నటించారు. రాజ్, సిమ్రన్ అనే యువ జంట చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. వీరిద్దరూ ప్రవాస భారతీయులు కాగా, ఐరోపా కు స్నేహితులతో వెళ్ళినప్పుడు కలుసుకుని ప్రేమించుకుంటారు. సిమ్రన్ పెళ్ళి కోసం  భారతదేశం వచ్చిన  ఆమె, ఆమె కుటుంబం మనసు గెలుచుకుని ఆ  పెళ్ళి తప్పించి రాజ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమా షూటింగ్ భారతదేశంలండన్, స్విట్జర్ ల్యాండ్ లలో సెప్టెంబర్1994 నుండి ఆగస్టు 1995 మధ్య జరిగింది.

సినిమా పోస్టరు

భారతదేశంలో రూ.1.06 బిలియన్లు, విదేశాల్లో రూ.160 మిలియన్లు సంపాదించింది ఈ సినిమా. ఆ సంవత్సరానికిగానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలవడమే కాక, బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచింది ఈ చిత్రం. వివిధ విభాగాల్లో 10 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఏకైక చిత్రం ఇదే కావడం మరో విశేషం. జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రం పురస్కారం కూడా పొందింది ఈ సినిమా. 1990ల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సినిమా పాటల్లో ఈ చిత్రంలోని పాటలే టాప్ లో నిలిచాయి. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దుస్తులు రూపొందించాడు.