దున్నుట

(దుక్కి నుండి దారిమార్పు చెందింది)

దున్నుట అనగా మానవులు నాగలి ద్వారా నేలను తిరగవేసి లేదా కలదిప్పి లేదా విప్పారేలా చేసి నేల పైభాగాన్ని ధ్రువువుగా చేసే ప్రక్రియ. నాగలి ద్వారా దున్నబడిన నేల పైభాగం విచ్ఛిన్నమై, తద్వారా గాలి, సూర్యరశ్మి మట్టిలోకి ప్రవేశిస్తాయి. ఇది మట్టిని మరింత సారవంతం చేస్తుంది. పూర్వం మానవులు ఎక్కువగా నాగలిని ఎద్దులకు లేదా దున్నపోతులకు కట్టి లాగించి నేలను దున్నేవారు. నేడు దున్నటానికి ఎక్కువగా ట్రాక్టర్, ట్రిల్లర్ వంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. పంటలు సాగు చేయుటకు ముందుగా నేలను బాగా దున్నాలి. దీని వలన పొలంలో ఉన్న కలుపుమొక్కలు చనిపోతాయి, నేల విప్పారడం వలన సారవంతమవుతుంది, తద్వారా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొక్కలు ఎదగటానికి నేల వదులుగా ఉండటం అవసరం, నేలను దున్నినప్పుడు నేల వదులుగా తయారై మొక్కల వేర్లు నేలలోకి చొచ్చుకుపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నేల దున్నటం వలన నేలలోని పోషకాలు మొక్కలకు బాగా అందుతాయి. దున్నటం వలన నేల నీరును బాగా పీల్చుకొని మొక్కలకు, చెట్లకు నీటిని అందిస్తాయి. విత్తనం మొలకెత్తాలంటే నేల పైభాగం మృదువుగా వుండాలి, అందుకనే విత్తనాలు నాటేటప్పుడు నేలను ఎక్కువసార్లు దున్నుతారు. నేలను దున్నటం వలన నేలలో దాగివున్న చీడపీడలు, పురుగులు నశిస్తాయి. విత్తనాలు మొలకెత్తిన తరువాత కూడా కలుపును తొలగించుటకు, నేలను వదులుగా చేయుటకు సాళ్లలో నాటిన మొక్కలకు ఇరువైపులా దున్నుతారు. పంట నాటు మొదలు పంట కోత వరకు దున్నకం అనేది చాలా ప్రముఖమైనది. దున్నకం అనేది పంట దిగుబడిని పెంచుతుంది. భూమిలో భూసారం తగ్గినప్పుడు పశువుల ఎరువులను లేదా రసాయన ఎరువులను వేసి దున్నుతారు, తద్వారా భూసారం పెరుగుతుంది. పాత పంటను తొలగించి మళ్ళీ కొత్త పంటను పండించుటకు పాత పంటను నేలలో కలిసిపోయేలా దున్నుతారు, మరికొన్ని సార్లు బాగా దున్ని మళ్ళీ కొత్త పంటను ప్రారంభిస్తారు. నేలలో కొంత తేమ ఉంటే దున్నకం బాగా వస్తుంది, అందువలన తొలకరి వర్షాల తరువాత ట్రాక్టర్‌లతో దున్నకం చేస్తారు. నీటి సౌకర్యం ఉంటే నేల నెమ్ముబారేలా చేసి తడి మీద నేలను దున్నుతారు. వరి పంట కోసం నేలలో నీరును నిల్వ ఉంచి నీళ్లలో దున్నుతారు, బురదగా ఉన్న నేలలోనే వరి నారును నాటుతారు.

దస్త్రం:Ploughtilling the field.jpg
ట్రాక్టర్‌తో పొలం దున్నడం
గుర్రాల ద్వారా దుక్కి దున్నుతున్న రైతు
నేలలో కొంత తేమ ఉంటే దున్నకం బాగా వస్తుంది, అందువలన తొలకరి వర్షాల తరువాత ట్రాక్టర్‌తో చేస్తున్న దున్నకం

దున్నకాన్ని దుక్కి చేయడం అని కూడా అంటారు, నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని వెలి దుక్కి అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి.

దున్నుట రకాలు

మార్చు

ప్రాథమిక , ద్వితీయ దున్నకం

మార్చు

ప్రాథమిక దున్నకం సాధారణంగా గత పంట కోసిన తర్వాత నేలను దున్నటం. ఈ దున్నకం నేల పదునుగా ఉన్నప్పుడు అనగా నేల కొద్దిగా తేమతో ఉన్నప్పుడు బాగా దున్నకం వస్తుంది. మునుపు పంట అవశేషాలను నేలలో కలపడం, కలుపు మొక్కలను చంపడం, మట్టి గాలిపారేలా చేయడం వంటివి ప్రాథమిక దున్నకం యొక్క లక్ష్యం. ఎరువులు వేయడం, విత్తనాలు నాటడం, నేల ఉపరితలాన్ని సమం చేయడం, కలుపును నియంత్రించడం వంటివి ద్వితీయ దున్నకం యొక్క లక్ష్యం.[1]

మూలాలు

మార్చు
  1. "Types of tillage". Knowledge Bank. Retrieved 24 February 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=దున్నుట&oldid=4075986" నుండి వెలికితీశారు