దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం

(దేవుని కడప నుండి దారిమార్పు చెందింది)

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్, వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలోగల చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం కడప నగర పరిధిలోని "దేవుని కడప" అనే ప్రాంతంలో ఉంది. 2004లో కడప కార్పొరేషన్లో కలవక ముందు "దేవుని కడప" అనేది ఒక చిన్న గ్రామం. అది "పాత కడప" అనే రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండేది. ప్రస్తుతం దేవుని కడపతో సహా పాత కడప రెవెన్యూ గ్రామం మొత్తం నగరపాలకసంస్థ పరిధిలో ఉంది.

దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాలయం
దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాలయం
దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు14°29′29″N 78°50′9″E / 14.49139°N 78.83583°E / 14.49139; 78.83583
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్‌ఆర్ జిల్లా
ప్రదేశంకడప

పేరు వ్యుత్పత్తి మార్చు

ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. సా.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ఇతర క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది.

చరిత్ర మార్చు

విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి గురించి 12 కీర్తనలు చెప్పాడు.

కాదనకు నామాట కడపరాయా నీకు
గాదెవోసే వలపులు కడపరాయా
కలదాననే నీకు గడపరాయా వో
కలికి శ్రీ వేంకటాద్రి కడపరాయ

దేవాలయ వాస్తు శిల్పం మార్చు

ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. గర్భగుడి వెనుకవైపు ఇక్కడి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.

ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం చూడదగినవి.

ఉత్సవాలు మార్చు

దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు.

ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. ముస్లిం సోదరులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలిపూజలు నిర్వహిస్తారు. బీబీనాంచారమ్మను  వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. కారణంగా స్వామివారికి సారె ఇచ్చి ఉగాదిపండగకి వారి ఇంటికి ఆహ్వానిస్తారు.[1] ముస్లింలతోపాటు జైనులు కూడా పూజచేస్తారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని లాగడంలో అందరూ పాల్గొంటారు.

మూలాలు మార్చు

  1. "దేవుని కడప ఆలయంలో ముస్లిం భక్తుల తొలిపూజలు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-02. Archived from the original on 2022-04-02. Retrieved 2022-04-02.

ఆధార గ్రంథాలు మార్చు

  • వై.ఎస్.ఆర్, జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు

వెలుపలి లింకులు మార్చు