నారంగ కాలేయవ్యాధి

కాలేయములో కాలేయ కణాల విధ్వంసం, కొత్త కణాల పునరుత్పత్తి, కణాల విధ్వంసం పిదప తంతుకణాలు (ఫైబ్రోబ్లాస్ట్స్) కలిగించే తంతీకరణం ( పీచువంటి పదార్థం ఏర్పడుట ) జరుగుట వలన కాలేయంలో బుడిపెలు ఏర్పడి నారంగ కాలేయవ్యాధికి (సిర్రోసిస్ ఆఫ్ లివర్) వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి అంతిమ దశలలో కాలేయపు పనితీరు బాగా క్షీణించి పచ్చకామెరలు కలుగడం వలన దేహం, కాలేయం నారింజపండు రంగులో పచ్చగా మారుతాయి. అందు వలన ఈ వ్యాధి నారంగ కాలేయవ్యాధి [1] [2](సిర్రోసిస్ ఆఫ్ లివర్); Greek kirrh (ós) orange-tawny + - osis ) అని పేరు పొందింది. నారంగ కాలేయవ్యాధి ఇతర రోగాల పర్యవసానం వలన కలిగే దీర్ఘకాలపు వ్యాధి.

కాలేయము, నారంగ కాలేయవ్యాధి

ఆరంభదశలో లక్షణాలు కనిపించవు కాని వ్యాధి ముదిరిన పిదప కాలేయపు పనితనం మందగించడం వలన, ద్వారసిరలో (పోర్టల్ వీన్) రక్తపీడనం పెరగడం వలన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.ఈ వ్యాధిగ్రస్థులు జలోదరంతో ఎత్తైన బూర పొట్టతో, శరీరం నారింజపండు రంగుతో అంత్యదశలలో కనిపిస్తారు.

కారణాలు

మార్చు

కాలేయ కణాల విధ్వంసం కలిగించే వివిధ విష పదార్థాలు, వ్యాధులు, నారంగ కాలేయవ్యాధికి దారి తీయవచ్చు. [3][4]మద్యపానం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి విషజీవాంశాలు (వైరసులు) కలిగించే దీర్ఘకాల కాలేయ తాపాలు, కొవ్వు పదార్థాలు వలన కలిగే ‘వస కాలేయ తాపం ‘ ( నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ ) వలన హెచ్చు శాతపు నారంగ కాలేయ వ్యాధులు కలుగుతాయి.

మద్యపానం

మార్చు

మితం మించి మద్యం [5]దీర్ఘకాలం (పది సంవత్సరాలకు మించి) సేవించేవారిలో 15- 20 శాతం మందిలో నారంగ కాలేయవ్యాధి పొడచూపుతుంది. మద్యం కాలేయంలో ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అనే జీవోత్ప్రేరకం ([6]ఎంజైమ్) వలన ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. ఎసిటాల్డిహైడు వలన కాలేయ తాపం, కాలేయ కణాల విధ్వంసం, దీర్ఘకాలంలో నారంగ కాలేయవ్యాధి కలుగుతాయి. మద్యం కాలేయంలో పిండిపదార్థాల, కొవ్వుల, మాంసకృత్తుల పనితనాలపై ప్రభావం చూపిస్తుంది. మితమీరి మద్యపానం చేసేవారిలో కాలేయంలో కొవ్వు నిలువలు పెరిగి మద్య వసకాలేయ వ్యాధిని, మద్య వసకాలేయ తాపాన్ని (ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్) కలిగించగలవు. సుమారు 30 శాతపు నారంగ కాలేయవ్యాధులు మితిమీరిన మద్యపానం వలన కలుగుతాయి.

విషజీవాంశాలు కలిగించే కాలేయ తాపాలు (వైరల్ హెపటైటిస్)

మార్చు

పెక్కు విషజీవాంశాలు కాలేయ తాపం కలిగించగలవు. వీనిలో హెపటైటిస్ -బి, హెపటైటిస్ - సి వైరసులు కలిగించే కాలేయతాపం కొందరిలో దీర్ఘకాల కాలేయ తాపముగా కొనసాగి, ఆపై నారంగ కాలేయ వ్యాధిగా పరిణమిస్తుంది. ప్రపంచములో సుమారు 55 శాతపు నారంగ కాలేయ వ్యాధులు విషజీవాంశాల వలన కలుగుతాయి.

మద్యేతర వస కాలేయ తాపం (నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్)

మార్చు

మద్యపానం సలుపని వారిలో కూడా కాలేయ కణాలలో [7]కొవ్వు ఎక్కువగా చేరినపుడు దీర్ఘకాలిక కాలేయ తాపం కలిగి ఆపై అది నారంగ కాలేయవ్యాధిగా పరిణమించవచ్చు. స్థూలకాయం కలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, రక్తంలో కొవ్వుపదార్థాలు (కొలెస్ట్రాలు, ట్రైగ్లిసరైడులు) హెచ్చుగా ఉన్నవారిలోను, కాలేయ కణాల్లో కొవ్వు చేరి తాపం కలిగించింది. కణవిధ్వంసం తరువాత పీచుకణాల, కాలేయ నక్షత్రాకార కణాల (హెపాటిక్ స్టెల్లేట్ కణాలు) చైతన్యం వలన పీచుపదార్థం ఏర్పడి నారంగ కాలేయవ్యాధిగా రూపొందే అవకాశం ఉంది.

ప్రాథమిక పైత్య నారంగవ్యాధి

మార్చు

ఇది స్వయంప్రహరణ వ్యాధి (ఆటో ఇమ్యూన్). సాధారణంగా 50 సంవత్సరాల స్త్రీలలో ఈ వ్యాధి కలుగుతుంది. వీరిలో మైటోఖాండ్రియాలపై పనిచేసే ప్రతిరక్షకాలు ఉంటాయి.

ప్రాథమిక పైత్యనాళిక కాఠిన్య తాపం

మార్చు

ఈ అరుదైన వ్యాధి ఎక్కువగా ఐరోపాఖండ ఉత్తరభాగంలో నివసించేవారిలోను, వారి వంశీకులలో 20 - 40 సంవత్సరాల ప్రాయంలో కనిపిస్తుంది. వీరి పైత్య నాళికలలో తాపం, తంతీకరణం, కాఠిన్యతలు కలిగి పైత్య ప్రవాహానికి అవరోధం కలుగడం వలన నారంగ కాలేయవ్యాధి కలుగుతుంది. వీరి ఆంత్రాలలో తాప వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్) కూడా తరచూ కలుగుతాయి.

అయ (ఇనుము) వర్ణక వ్యాధి ( హీమోక్రొమటోసిస్ )

మార్చు

వంశపారంపర్యంగా సంక్రమించే ఈ వ్యాధిగ్రస్థులలో చిన్నప్రేవులు ఆహారంలో ఇనుమును ఎక్కువగా గ్రహించడం వలన కాలేయంలో ఇనుము నిల్వలు పెరుగుతాయి. హృదయం, క్లోమం, చర్మం, ఇతర అవయవాలలో కూడా ఇనుము నిల్వగా చేరడం వలన వీరిలో నారంగ కాలేయవ్యాధి, మధుమేహం, చర్మంలో కంచువర్ణం, హృదయవైఫల్యం పొడచూపుతాయి.

తామ్ర కాలేయవ్యాధి (విల్సన్స్ డిసీజ్)

మార్చు

జన్యుపరంగా కలిగే ఈ వ్యాధిగ్రస్థులలో [8]ATP7B అనే మాంసకృత్తి లోపం వలన కాలేయ కణాలు రాగిని పైత్యరసంలోనికి తగినంతగా విసర్జింపజాలవు. అందువలన కాలేయంలో రాగి నిల్వలు పెరిగి కాలేయ కణాల విధ్వంసంకి, నారంగ కాలేయవ్యాధికి దారితీస్తాయి. ఆపై [8]రాగి కంటి స్వచ్ఛపటలంలోను, మెదడులోను, మూత్రపిండాలలోను కూడా నిక్షిప్తం అవుతుంది. వీరి రక్తద్రవంలో రాగి విలువలు తక్కువగా ఉంటాయి. రక్తద్రవంలో తామ్రవాహకము సెరులోప్లాస్మిన్ విలువలు తగ్గిఉంటాయి. వీరి మూత్రంలో రాగి విలువలు హెచ్చుగా ఉంటాయి.

ఆల్ఫా 1 ఏంటిట్రిప్సిన్ లోపం

మార్చు

ఆల్ఫా 1 ఏంటి ట్రిప్సిన్ అనే జీవోత్ప్రేరకం లోపించిన వారిలో కూడా నారంగ కాలేయవ్యాధి కలుగ గలదు.

భారతీయ శిశు నారంగ కాలేయవ్యాధి

మార్చు

ఇండియన్ చైల్డ్ హుడ్ సిర్రోసిస్ గా వ్యవహరించబడే ఈ వ్యాధి జన్యుపరంగా 1-3 సంవత్సరాల శిశువులలో కాలేయంలో రాగినిల్వలు పెరుగడం వలన వలన కలిగే వ్యాధి. రాగి, కంచుపాత్రల వాడకం ఈ రోగం కలుగుటకు దోహదపడుతుంది[9][10]రాగి, కంచుపాత్రల వాడకం తగ్గుట వలన, వ్యాధిని త్వరితంగా నిర్ణయించి చికిత్సలు చేయడం వలన ఈ వ్యాధి, దీని వలన కలిగే శిశు మరణాలు తగ్గాయి[9][10].

తెలియని కారణాలు

మార్చు

మరికొన్ని ఇతర కారణాల వలన, తెలియని కారణాల వలన నారంగ కాలేయవ్యాధి కలుగవచ్చు.

వ్యాధి లక్షణాలు

మార్చు
 
 
ఉదరకుడ్యంలో ఉబ్బుసిరలు

నారంగ కాలేయ వ్యాధిలో కాలేయ కణాల విధ్వంసం జరిగి కాలేయం పనిచేయటం మందగించడం వలన కొన్ని వ్యాధి లక్షణాలు కలుగుతాయి. వ్యాధి ముదరక మునుపు ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి అంచెలంచెలుగా ముదిరాక వ్యాధి లక్షణాలు పొడచూపుతాయి. [4] నీరసం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, వికారం వంటి లక్షణాలు తొలిగా పొడచూపవచ్చు. కాలేయములో తంతీకరణం జరిగి ద్వారసిర (పోర్టల్ వీన్) దాని శాఖలు నొక్కుకుపోవడం వలన, ద్వారసిరలో రక్తపీడనం పెరిగి, మరికొన్ని లక్షణాలు కలుగుతాయి. ద్వారసిర జీర్ణాశయం, చిన్నప్రేవులు, క్లోమం, ప్లీహం, పిత్తాశయాల నుంచి రక్తాన్ని కాలేయానికి చేర్చుతుంది. ద్వారసిర కాలేయంలో సూక్ష్మ రక్తకేశనాళికలుగా చీలి రక్తాన్ని కాలేయ కణాలకు అందజేస్తుంది. ఈ రక్తం ద్వారా జీర్ణమండలం నుంచి గ్రహించిన పోషకపదార్థాలు, విషపదార్థాలు కాలేయ కణాలకు చేరుతాయి. కాలేయ ధమని కూడా కాలేయానికి రక్తం కొనిపోతుంది. కాలేయధమని శాఖలు, సూక్ష్మరక్తకేశనాళికలుగా చీలి కాలేయకణాలకు రక్తాన్ని అందజేస్తుంది. సూక్ష్మరక్తకేశనాళికలన్నీ కలయడం వలన కాలేయసిర ఏర్పడుతుంది. కాలేయసిర అధోబృహత్సిరతో కలసి రక్తాన్ని హృదయానికి చేరుస్తుంది. కాలేయంలో తంతీకరణం జరిగినపుడు ద్వారసిర, దానిశాఖలలో రక్తప్రవాహానికి అవరోధం కలుగుతుంది. అందుచే ద్వారసిరలో రక్తపీడనం పెరుగుతుంది. ఆ పీడనం వెనుకనున్న సిరలకు మరలి జీర్ణమండలపు సిరలలో పీడనం, సాంద్రత పెరుగుతాయి. ద్వారసిరలో అధికపీడనం వలన క్రింది లక్షణాలు కలుగుతాయి.

ఉరుప్లీహం (స్ప్లీనోమెగలీ )

ద్వారసిర అధికపీడనం వలన ప్లీహంలో సాంద్రత పెరిగి ప్లీహ పరిమాణం పెరుగుతుంది. పెరిగిన ప్లీహములో తెల్లరక్తకణాలు, రక్తఫలకాలు ( ప్లేట్ లెట్స్ ) అధికంగా విధ్వంసం కావడం వలన వీరి రక్తంలో తెల్లకణాల సంఖ్య, రక్తఫలకాల సంఖ్య తగ్గుతుంది

అన్ననాళంలో ఉబ్బుసిరలు

జీర్ణాశయ సిరలలో పీడనము పెరిగి వాటిలోని రక్తం అన్ననాళపు సిరలకు మరలింపబడుట వలన అన్ననాళపు సిరలు ఉబ్బుతాయి. ఈ ఉబ్బిన సిరలు చిట్లి రక్తస్రావం జరిగితే రక్తపు వాంతులు కలుగుతాయి. అన్ననాళంలోనికి రక్తం స్రవించి జీర్ణాశయంలో ఆమ్లంతోను, ప్రేవులలో క్షారంతోను కలియడంచే నల్ల విరేచనాల విసర్జన జరుగుతుంది. అన్నవాహిక ఉబ్బుసిరల నుంచి రక్తస్రావం అధికమయితే ప్రాణాపాయము కాగలదు.

ఉదరకుడ్యంలో ఉబ్బు సిరలు

జీర్ణమండలపు సిరలలో పీడనం పెరిగి రక్తం ఉదరకుడ్యపు సిరలకు మళ్ళుట వలన కడుపులో చర్మం క్రింద సిరలు పెద్దవయి బొడ్డు చుట్టూ నీలవర్ణములో కనిపిస్తాయి. వీటిని కేపట్ మెడుసే గా వర్ణిస్తారు. ( గ్రీకు పురాణాలలో మెడుసా అనే రక్కసికి తలపై వెంట్రుకలకు బదులు పాములు ఉండేవిట )

జలోదరం

ద్వారసిరలో రక్తపీడనం పెరుగడం వలనను, కాలేయకణ పనిచేయటం మందగించి ఆల్బుమిన్ అనే మాంసకృత్తి ఉత్పత్తి తగ్గి రక్తపు రసాకర్షణ పీడనం (ఆస్మోటిక్ ప్రెషర్ ) తగ్గుట వలనను ఉదరకుహరంలో నీరుపట్టవచ్చు. అపుడు వీరి ఉదర పరిమాణం పెరిగి కడుపులో నిండుతనము ( బరువుగా ) కలుగుతుంది. వీళ్ళ కాళ్ళలో పొంగులు కూడా పొడచూపుతాయి. దేహంలో లవణ ప్రమాణం, జల ప్రమాణం పెరుగుట వలన వీరి బరువు పెరుగుతుంది. జలోదరం బాగా ఎక్కువయినపుడు ఆయాసం కలుగుతుంది. జలోదరము ఒక లక్షణము. హృదయ వైఫల్యంలోను, ఇతర వ్యాధుల్లోను జలోదరం కలుగవచ్చు.

కాలేయం పనిచేయటం మందగించడం వలన కలిగే లక్షణాలు

కాలేయకణ నష్టం వలన కాలేయం పనిచేయటం మందగిస్తుంది. ప్రారంభంలో వీరికి నీరసం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం కనిపించవచ్చు. కాలేయంలో ఎష్ట్రెడియాల్ అనే స్త్రీ సంబంధ వినాళగ్రంథి స్రావకపు విచ్ఛేదన తగ్గి రక్తంలో దాని పరిమాణం పెరుగుతుంది. పెరిగిన ఎష్ట్రడియాల్ వలన అరచేతులలో ఎఱ్ఱదనం కనబడుతుంది. చర్మముపై సాలీడు మచ్చలు ([11] స్పైడర్ నీవై ) ఏర్పడుతాయి. ఈ మచ్చలమధ్యలో సూక్ష్మధమని ఉండి దాని చుట్టూ ఉబ్బిన కేశనాళికలు సాలీడు ఆకారంలో ఉంటాయి. [12]ఎష్ట్రడియాల్ ప్రభావం వలన పురుషులలో స్తనాలు ఉబ్బుతాయి. పురుషులలో వృషణాల క్షీణత, నపుంసకత్వం కలుగుతాయి.

నారంగవ్యాధి తీవ్రత పెరిగినపుడు పచ్చకామెరలు పొడచూపుతాయి. బిలిరుబిన్ వర్ణకపు విసర్జన తగ్గడం వలనను, కాలేయంలో పైత్య నాళాలలో పైత్యపు నిశ్చలత వలనను రక్తంలో బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరలు కలుగుతాయి. వీరి చర్మంమీద, కళ్ళలో శ్వేతపటలాలలో పచ్చదనం కనిపిస్తుంది. చర్మంలో పైత్య లవణాలు చేరడం వలన వీరికి దురద కలుగుతుంది.

రక్తంలోని అమ్మోనియా కాలేయంలో యూరియా గా విచ్ఛిన్నం అవుతుంది. కాలేయం పనిచేయటం తగ్గినపుడు అమ్మోనియా విచ్ఛేదన తగ్గి అమ్మోనియా విలువలు పెరుగుతాయి. రక్తంలో అమ్మోనియా విలువలు, ఇతర వ్యర్థ పదార్థములు పెరుగడం వలన మతిభ్రంశం కలుగగలదు.

రక్తములో డైమిథైల్ సల్ఫైడ్ అనే రసాయనం విలువలు పెరుగుతే శ్వాసలో దుర్వాసన ( ఫీటర్ హిపాటికస్ ) ఉంటుంది.

రక్తం గడ్డకట్టడానికి కావలసిన అంశాలు కాలేయంలో ఉత్పత్తి అవుతాయి. కాలేయం పనిచేయటం బాగా మందగించినపుడు రక్తఘనీభవన అంశాల లోపం కలిగి రక్తము గడ్డకట్టడం మందగిస్తుంది. వీరిలో రక్తస్రావాలు జరుగవచ్చు. చర్మంలోను చర్మము క్రింద సూక్ష్మరక్తనాళికల నుంచి రక్తం స్రవించి కమలవచ్చు. వీరిలో రక్తం గడ్డకట్టడానికి చేసే పరీక్ష ప్రోథ్రాంబిన్ టైమ్ (PT) ఎక్కువగా ఉంటుంది.

కాలేయ మతిభ్రంశం

అంత్యదశలో రక్తంలో అమ్మోనియా, ఇతర విష పదార్థాలు పెరుగడం వలన, శరీర సంరక్షణ తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లేకపోవడం, తత్తరపాటు, గజిబిజి, అపస్మారకాలు కలుగుతాయి. కాలేయ వైఫల్యపు అంత్యదశలో అరచేతులు మణికట్టుకీళ్ళ వద్ద గబ్బిలం రెక్కల లాగ కొట్టుకోవచ్చును.

కాలేయ మూత్రాంగవ్యాధి ( హెపటో రీనల్ సిండ్రోమ్ )

నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో జలోదరం ఎక్కువగా ఉన్నపుడు మూత్రాంగాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాలేయ వైఫల్యం తీవ్రమయినపుడు మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగ వైఫల్యం కూడా కలిగే అవకాశం ఉంది.

ఇతర లక్షణాలు

నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో తెల్లని గోళ్ళు, డోలుకఱ్ఱలవేళ్ళు, బాహుమూలాలలో వెండ్రుకల నష్టం, శ్రవణమూల లాలాజలగ్రంథుల ( పెరాటిడ్ సెలైవరీ గ్లాండ్స్ ) వాపులు, అరచేతి కండర ఆచ్ఛాదనాలలో ( పామారా ఫేషియా ) బొడిపెలు, సంకోచాలు ( డ్యుపెట్రిన్స్ కంట్రాక్చర్స్ ) వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

పరీక్షలు

మార్చు

రక్త పరీక్షలు

నారంగకాలేయ వ్యాధి ప్రారంభదశలో రక్తపరీక్షలు వ్యాధిని పసిగట్టడానికి తోడ్పడుతాయి. వీరిలో ప్లీహపు ఉధృతి ( హైపర్ స్ప్లీనిజమ్ ) వలన రక్తఫలకాల సంఖ్య, రక్తంలో తెల్లకణాల సంఖ్య తగ్గి ఉంటాయి.

రక్తద్రవంలో కాలేయ జీవోత్ప్రేరకాల ( ఎంజైమ్స్ ) విలువలు పెరుగుతాయి. ఏస్పర్టేట్ ట్రాన్సెమినేజ్ ( AST ), విలువలు ఏలనైన్ ట్రాన్సెమినేజ్ ( ALT ) విలువలు కంటె ఎక్కువగా ఉంటాయి. ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ ( AP ), గామా గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ ( GGTP ) విలువలు పెరిగి ఉండవచ్చు. పెరిగిన ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ , గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ విలువలు ( AP & GGTP ) పైత్యనాళాలకు అవరోధాన్ని సూచిస్తాయి.

వ్యాధి ముదరక మునుపు రక్తద్రవంలో బిలిరుబిన్ విలువలు పెరుగకపోవచ్చు. వ్యాధితీవ్రత పెరిగాక బిలిరుబిన్ విలువలు పెరుగుతాయి.

కాలేయంలో ఆల్బుమిన్ ( ఒక మాంసకృత్తి ) ఉత్పత్తి తగ్గడం వలన రక్తంలో ఆల్బుమిన్ విలువలు తగ్గుతాయి.

సూక్ష్మజీవుల ప్రతిజనకాలు ( ఏంటిజెన్స్ ) కాలేయంలో విచ్ఛిన్నం అవకుండా రక్షణవ్యవస్థకు చేరడం వలన వాటికి ప్రతిరక్షకాల ఉత్పత్తయి గ్లాబ్యులిన్ల విలువలు పెరుగుతాయి.

కాలేయంలో రక్తఘనీభవన అంశాల ఉత్పత్తి తగ్గడం వలన రక్తం నెమ్మదిగా గడ్డకడుతుంది. వ్యాధి తీవ్రత పెరిగినపుడు రక్తఘనీభవన వేగం సూచించే ప్రోథ్రాంబిన్ కాలము ( PT ) ఎక్కువగా ఉంటుంది.

ఆల్డోష్టిరోన్ , మూత్ర పరిమాణం తగ్గించే ఏంటి డైయూరెటిక్ హార్మోనుల ప్రభావం వలన మూత్రంలో ఉప్పు కంటె నీరు తక్కువగా విసర్జింపబడి రక్తద్రవంలో సోడియమ్ సాంద్రత తగ్గి సోడియం ప్రమాణాలు తక్కువగా (హైపోనెట్రీమియా ) ఉండవచ్చు.

వైద్యులు రక్తద్రవంలో విద్యుద్వాహక లవణాల విలువలు, యూరియా విలువలు, క్రియటినిన్ విలువలను గమనిస్తూ ఉండాలి.

వీరికి కాలేయ తాపాలు బి & సి వ్యాధుల పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చెయ్యాలి.

అయవర్ణక ( ఇనుము ) వ్యాధి (హీమోక్రొమటోసిస్ )కి రక్తద్రవంలో ఫెరిటిన్, ట్రాన్స్ఫెరిన్ సంతృప్తతలు పరీక్షించాలి.

తామ్ర కాలేయవ్యాధిని గుర్తించడానికి రక్తద్రవంలో రాగి సాంద్రతకు, సెరులోప్లాస్మిన్ ప్రమాణాలకు, మూత్రంలో రాగి విలువలకు పరీక్షలు చెయ్యాలి. కంటి పరీక్షలు కూడా సలపాలి.

ఆల్ఫా-1 ఏంటిట్రిప్సిన్ లోపం కనిపెట్టడానికి దాని విలువలకు పరీక్షించాలి.

స్వయంప్రహరణ వ్యాధులను గుర్తించడానికి, ఏంటి న్యూక్లియర్ ఏంటిబాడీస్, ఏంటి మైటోఖాండ్రియల్ ఏంటిబాడీస్, ఏంటి స్మూత్ మసిల్ ఏంటిబాడీస్, ఏంటి ఎల్ కె ఎమ్ ఏంటిబాడీస్ లకు పరీక్షలు చెయ్యాలి.

శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణ (అల్ట్రాసోనోగ్రఫీ )

శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణంతో కాలేయపు ఆకారాన్ని, కాలేయంలో బుడిపిలు, కనుగొనగలం. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో కాలేయం నుండి ప్రతిధ్వనిత్వము హెచ్చుగా ఉంటుంది. ప్లీహ పరిమాణం పెరిగి ఉంటుంది. ద్వారసిరలో రక్తప్రవాహం వలన కలిగే వ్యాకోచ సంకోచాలు కనిపిస్తాయి. ఉదరకుహరంలో ద్రవాన్ని ( జలోదరం ) కూడా కనిపెట్టగలము. పైత్యనాళాలలో అసాధారణాలను కూడా గ్రహింపగలం.

అన్నవాహిక జఠరాంత్ర దర్శనం

నారంగ కాలేయవ్యాధిగ్రస్థులలో అన్నవాహిక, జఠరం, ప్రథమాంత్రాలను అంతర దర్శినితో (ఎండోస్కొపీ ) పరీక్షించి అన్నవాహికలో ఉబ్బుసిరలను కనుగొని తగిన చికిత్స చెయ్యాలి.

కాలేయ స్తితిస్థాపకత చిత్రీకరణ

కాలేయ స్థితిస్థాపకతను వివిధ పరీక్షలతో చిత్రీకరించి నారంగ కాలేయవ్యాధిని నిర్ధారించవచ్చు.

పైత్యనాళాల, క్లోమనాళంల చిత్రీకరణ
మార్చు

పైత్య నాళాలను, క్లోమ నాళాన్ని అంతర దర్శినులతో కాని అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణాలతో కాని ( ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ ఖొలాంజియో పాంక్రియాటోగ్రఫీ ERCP; మేగ్నెటిక్ రెజొనెన్స్ ఖొలాంజియో పాంక్రియాటోగ్రఫీ MRCP ) చిత్రీకరించి వాటిలో అసాధారణాలను కనుగొనవచ్చు.

కణపరీక్ష

కణపరీక్షతో నారంగ కాలేయవ్యాధిని నిర్ణయించవచ్చు. కాలేయ కణజాలాన్ని చర్మం ద్వారా కాని, కంఠసిర మార్గంతో కాని, ఉదరాంతర దర్శనం (లేపరోస్కొపీ ) ద్వారా గాని గ్రహించవచ్చు. ఈ ప్రక్రియలతో ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంది. అందువలన రోగిని పరీక్షించడం వలన, ఇతర పరీక్షల వలన వ్యాధిని నిర్ణయించగలిగితే వైద్యులు కణపరీక్షలు చేయరు.

కణ పరీక్షలలో తంతీకరణం, కాలేయ కణాలలో కొవ్వు చేరడం, వస తాపం, కాలేయకణ విధ్వంసం, తామ్ర కాలేయ, అయ వర్ణకవ్యాధి వంటి వ్యాధుల లక్షణాలు కనిపిస్తాయి.

జలోదర జలపరీక్ష

జలోదరం ఉన్న వారిలో ఉదర కుహరం నుంచి సూదితో ద్రవం సేకరించి, ఆ ద్రవాన్ని తెల్లరక్తకణాలకు, మాంసకృత్తులకు, కర్కటవ్రణకణాలకు పరీక్షించాలి.

చికిత్స

మార్చు

నారంగ కాలేయవ్యాధి ఇతర వ్యాధులకు పర్యవసానంగా వచ్చే జబ్బు. ఇది కలిగిన పిదప పోదు. వ్యాధి మూలకారణాలకు చికిత్సచేయుట, వ్యాధి పురోగతిని అరికట్టడం, వ్యాధి వలన కలిగే ఉపద్రవాలు అరికట్టడం, ఉపద్రవాలకు చికిత్స చేయడం, కాలేయ మార్పిడికి పరిశీలించడం వైద్యుల లక్ష్యాలు .

నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులు మద్యం త్రాగడం మానివేయాలి. ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ మందుల వాడకం తగ్గించాలి. కాలేయం ద్వారా విసర్జింపబడే ఇతర ఔషధాలను , కాలేయ కణాలపై విషప్రభావం గల ఔషధాలను మానివేయాలి. వాటి వాడుక తప్పనిసరి అయితే తగ్గించిన మోతాదులలో జాగ్రత్తతో వాడాలి.

పోషక పదార్థాలు

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో శరీరం పనితనం పెరుగుతుంది. వారికి తగిన పోషక పదార్థాలు అందించాలి. తగినన్ని మాంసకృత్తులు, కాలరీలను అందించాలి. మద్యపానం సలిపేవారిలో ఫోలికామ్లం, థయమిన్ లోపాలు ఉంటాయి. వారికి వాటిని అందించి ఆ లోపాలు సరిదిద్దాలి.

జలోదరం కలవారు సోడియమ్ వాడకాన్ని దినంకి 2 గ్రాములకు ( 5 గ్రాముల ఉప్పుకు సమానం ) పరిమితి చేసుకోవాలి.

టీకాలు

కాలేయతాపం కలిగించే విషజీవాంశాలు ఎ, బి లకు టీకాలు వేయాలి. ఇన్ఫ్లుయెంజా జ్వరము , శ్వాసకోశతాపాలు (న్యుమోనియా ) అరికట్టడానికి కూడా టీకాలు అవసరం. కోవిడ్ కు టీకాలు కూడా వేయాలి.

అన్నవాహికలోని ఉబ్బుసిరలకు చికిత్స

అన్నవాహికలో ఉబ్బుసిరలు నుంచి రక్తస్రావము అరికట్టడానికి [13]బీటా ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకాలు - ప్రొప్రనలాల్ గాని, నెడొలాల్ గాని, [14]కార్వెడిలాల్ గాని వాడుతారు. విశ్రాంత హృదయవేగం 25 % తగ్గే వఱకు మోతాదును సరిచేయాలి. బీటా అవరోధకాలు వాడలేనివారిలోను, వాటిని సహింపలేనివారిలోను, అంతర్దర్శిని ద్వారా ఆ ఉబ్బుసిరలకు పట్టీలు బంధించాలి, లేక వాటిని తంతీకరణ రసాయనాలతో మూయించాలి. ఈ చర్యలకు ఫలితాలు లేక రక్తస్రావం మరల మరల సాగే వారిలో కంఠసిర ద్వారా కాలేయంలో ద్వారసిర - కాలేయసిరల సంధానం ( ట్రాన్స్ జుగులార్ ఇంట్రాహిపాటిక్ పోర్టో సిస్టెమిక్ షంట్ ) సలుపుట వంటి ప్రక్రియలు ఉపయోగపడగలవు. రక్తాన్ని ద్వారసిర నుంచి కాలేయ సిరకు మఱలించినపుడు ద్వారసిరలో పీడనం తగ్గి అన్ననాళంలోని ఉబ్బు సిరలు సామాన్యస్థితికి వస్తాయి.

జలోదరం చికిత్స

జలోదరం కలిగిన వారిలో [15]ఉప్పు ( సోడియమ్ క్లోరైడు ) వాడకాన్ని దినానికి 5 గ్రాములకు ( సోడియమ్ 2 గ్రాములకు ) పరిమితము చెయ్యాలి. వీరికి మూత్రకారకాలు ఇచ్చి జలోదరం తగ్గించవచ్చు. స్పైరనోలాక్టోన్ వంటి ఆల్డోష్టిరోన్ అవరోధకాలను, ఫ్యురొసిమైడ్ వంటి మూత్రనాళికల మెలిక పై పనిచేసే మూత్రకారకాలతో కలిపి వాడితే సత్ఫలితాలు కలుగుతాయి. మూత్రకారకాలు వాడేటప్పుడు తఱచు రక్తపరీక్షలతో విద్యుద్వాహక లవణాలను, యూరియాను, క్రియటినిన్ ను పరిశీలిస్తూ ఉండాలి.

జలోదరం ఎక్కువగా ఉండి మూత్రకారకాల చికిత్సకు లొంగనప్పుడు ఉదరకుహరం లోనికి పెద్ద సూది ద్వారా నాళిక చొప్పించి ఆ నాళిక ద్వారా జలోదర ద్రవాన్ని తొలగించవచ్చు. 5 లీటర్లకు మించి ద్రవం తొలగించేటపుడు సిరల ద్వారా ఆల్బుమిన్ ఎక్కించి రక్తప్రసరణ అస్థిరతను, సోడియం హీనతను ( హైపోనెట్రీమియా ), మూత్రాంగాల పనితనం క్షీణతను నిరోధించవచ్చు.

జలోదరం ఎక్కువగా ఉన్నపుడు, అధిక ప్రమాణాలలో ద్రవాన్ని తొలగించడం సాధ్యం కానప్పుడు, [15]కంఠసిర ద్వారా కాలేయంలో ద్వారసిర , కాలేయసిరల సంధానం ( ట్రాన్స్ జుగులార్ ఇంట్రాహిపాటిక్ పోర్టో సిస్టెమిక్ షంట్ ) అవసరం కావచ్చు. ఈ ప్రక్రియ చేయడం వలన కాలేయ మతిభ్రంశం కలిగే అవకాశం ఉన్నది.

ఉదరవేష్టన తాపం - చికిత్స

జలోదరము గలవారిలో సూక్ష్మజీవుల వలన ఉదరవేష్టన తాపం ( స్పాంటేనియస్ బాక్టీరియల్ పెరిటొనైటిస్ ) కలిగే అవకాశం ఉంది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, ఎంటెరోబేక్టీరియేషియా, ఎంటెరోకోక్సై అనే సూక్ష్మజీవులు ఈ తాపాన్ని సాధారణంగా కలుగజేస్తాయి. జలోదర ద్రవంలో మాంసకృత్తులు 1 గ్రాము / డెసిలీటరు కంటె తక్కువైన వారిలోను, అన్ననాళంలోని ఉబ్బుసిరల నుంచి రక్తస్రావం కలిగేవారిలోను, అదివరకు సూక్ష్మజీవ ఉదరాంత్ర వేష్టన తాపం కలిగినవారిలోను ఈ తాపం కలిగే అవకాశం హెచ్చు.

ఇతర కారణాలు లేక జలోదరం కల వారిలో సూక్ష్మజీవుల వలన ఉదరవేష్టన తాపం కలిగినప్పుడు వారిలో [16]ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరిలో జ్వరము, చలితో కుదుపు , కడుపునొప్పి, గందరగోళం కనిపించవచ్చు.

జలోదర ద్రవంలో తెల్లకణాల సంఖ్య 250 / మైక్రోలీటరు కంటె ఎక్కువ ఉన్నవారిలో ఈ తాపం ఉందని నిర్ణయించి వారికి సూక్ష్మజీవ నాశకాలు ఇవ్వాలి. మూడవ తరం సెఫలోస్పోరిన్స్ లో సెఫ్ ట్రయాక్సోన్ ను కాని సెఫొటేక్సిమ్ ని కాని సిర ద్వారా వాడుతారు. వ్యాధి తీవ్రముగా లేనివారిలో, నోటి ద్వారా సిప్రోఫ్లోక్ససిన్ ,లేక నార్ఫోక్ససిన్ లలో ఏదైనా వాడవచ్చు.

కాలేయ మూత్రాంగ వైఫల్యం - చికిత్స

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో ద్వారసిర పీడనం హెచ్చయినవారిలోను, తీవ్ర కాలేయ వైఫల్యం గలవారిలోను, జీర్ణమండలంలో రక్తస్రావం కలిగినవారిలోను, సూక్ష్మజీవుల వలన ఉదరాంత్ర వేష్టన తాపం వంటి సూక్ష్మాంగజీవుల దాడులు కలిగినపుడు, జలోదరం గలవారిలో రక్తప్రమాణంని భర్తీచేయకుండా ( ఆల్బుమిన్ తో ) అధిక ప్రమాణాలలో జలోదర ద్రవాన్ని తొలగించినపుడు, ఎక్కువగా మూత్రకారకాలను వాడినపుడు, మూత్రాంగ ధమనులు సంకోచించడం వలన మూత్రాంగాలకు రక్తప్రసరణ తగ్గి మూత్రాంగ వైఫల్యం కలుగగలదు. [15]కాలేయ - మూత్రాంగవైఫల్యం సిరల ద్వారా ఆల్బుమిన్ ను, నారెడ్రినలిన్ లు ఇచ్చినపుడు కొంత మెరుగు కనిపించవచ్చు. కొందఱికి రక్తశుద్ధి ( డయాలిసిస్ ) అవసరం. కాలేయ మూత్రాంగ వైఫల్యం తీవ్రమైన ఉపద్రవం. ప్రాణాపాయం తొలగించుటకు చాలా మందికి కాలేయమార్పిడి చికిత్స అవసరం.

కాలేయ మతిభ్రంశం - చికిత్స

కాలేయ మతిభ్రంశం కలిగినవారిలో శరీరపు ద్రవప్రమాణ లోపాలు, రక్తంలో విద్యుద్వాహక లవణాల అసాధారణాలు, ఆమ్ల క్షార అసాధారణాలు ఉంటే వాటికి చికిత్స చేసి సరిదిద్దాలి. వీరిలో అమోనియా ప్రమాణాలు పెరిగి ఉంటాయి. వీరికి [3]లాక్టులోజ్ దినానికి మూడు నుంచి ఐదు విరేచనాలు కలిగేటట్లు మోతాదును సరిచేస్తూ ఇవ్వాలి. లాక్టులోజ్ తో పరిస్థితి మెరుగు కానివారికి జీర్ణమండలం నుంచి రక్తంలోకి గ్రహింపబడక, పెద్దప్రేవులలో సూక్ష్మజీవులను నశింపజేసే నియోమైసిన్, రిఫాక్సిమిన్ వంటి సూక్ష్మజీవి నాశకాలను కూడా నోటి ద్వారా ఇస్తారు. పెద్దప్రేవులలో సూక్ష్మజీవుల సాంద్రత తగ్గించుట వలన అమ్మోనియా ఉత్పత్తి తగ్గుతుంది.

కాలేయకణ కర్కటవ్రణాలు

దీర్ఘకాల కాలేయతాప వ్యాధులు బి, సి కలవారిలో కాలేయకణ కర్కట వ్రణాలు ( హెపాటిక్ సెల్ కార్సినోమా ) కలిగే అవకాశాలు హెచ్చు. వాటిని త్వరగా కనిపెట్టడానికి వీరికి ప్రతి ఆరు మాసాలకు శ్రవణాతీతధ్వని పరీక్షతో కాలేయాన్ని పరీక్షిస్తూ ఉండాలి. త్వరగా కనుక్కొంటే వాటి చికిత్సకు అవకాశం ఉంటుంది.

పరకాలేయ దానం

నారంగ కాలేయవ్యాధి అంత్యదశలో ఉండి, [15]జలోదరం అధికమై ఉపద్రవాలకు దారితీస్తున్నవారికి, అన్నవాహిక ఉబ్బుసిరల నుంచి రక్తస్రావాలు పదే పదే కలుగుతున్నవారికి, కాలేయ మతిభ్రంశం కలిగేవారికి, నారంగ కాలేయవ్యాధితో పాటు కాలేయకణ కర్కటవ్రణం ఉన్నవారికి పరకాలేయ దాన చికిత్స అవసరం. కాలేయమార్పిడితో వ్యాధి నయమవుతుంది.

రక్తంలో బిలిరుబిన్ విలువ, రక్తంలో క్రియటినిన్ విలువ, రక్తపు ప్రోథ్రాంబిన్ కాలములతో ( PT / INR ) [17]అంత్యదశ కాలేయవ్యాధి నిర్ణయ సంఖ్య ( మోడెల్ ఫర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ స్కోర్ ) గణించి కాలేయ మార్పిడి చికిత్సకు అర్హులైనవారిని క్రమబద్ధీకరిస్తారు.

హృదయ, శ్వాసకోశవ్యాధుల వలన శస్త్రచికిత్సకు అనుకూలత లేనివారు, చర్మంలో కాక ఇతర అంగాలలో నయం కాని కర్కటవ్రణాలు ( కేన్సర్ లు ) ఉన్నవారు, మద్యపానం, యితర మాదకద్రవ్యాల వ్యసనాలు కొనసాగిస్తున్నవారు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు అర్హులుగా పరిగణింపబడరు.

నివారణ

మార్చు

మద్యపానం సలుపకపోవుట, లేక పరిమితం చేసుకొనుటవలన, కాలేయతాపం కలిగించే హెపటైటిస్ - బి విషజీవాంశాలకు టీకాలు తీసుకొనడంవలన, హెపటైటిస్ - సి సోకకుండా జాగ్రత్తలు తీసుకొనుటవలన, వివిధ కాలేయ తాపాలకు చికిత్సలు చేయడం వలన, స్థూలకాయం రాకుండా అవసరమైన కాలరీల ఆహారమే తీసుకొని, వ్యాయామాలు సలుపుట వలన, వంశపారంపర్య కాలేయ వ్యాధులు కనుక్కోవడాని సకాలంలో పరీక్షలు సలిపి తగిన చికిత్సలు చేయడం వలన, పెక్కు శాతం నారంగ కాలేయ వ్యాధులను అరికట్టవచ్చు. రాగి, కంచు పాత్రలను వాడకపోవడం వలన భారతీయ శిశు నారంగ కాలేయవ్యాధిని నివారించగలము.

మూలాలు

మార్చు
  1. "Definition of cirrhosis | Dictionary.com". www.dictionary.com. Retrieved 2023-05-12.
  2. "cirrhosis | Search Online Etymology Dictionary". www.etymonline.com. Retrieved 2023-05-16.
  3. 3.0 3.1 The Washington manual of Medical Therapeutics, 37 th edition. Washington University in St Louis, School of Medicine. 2023. pp. 701 and 706. ISBN 978-1-975190-62-0.
  4. 4.0 4.1 "Symptoms & Causes of Cirrhosis - NIDDK". National Institute of Diabetes and Digestive and Kidney Diseases. Retrieved 2023-05-13.
  5. "Definition & Facts for Cirrhosis - NIDDK". National Institute of Diabetes and Digestive and Kidney Diseases. Retrieved 2023-05-13.
  6. "Definition of enzyme | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
  7. "Definition & Facts of NAFLD & NASH - NIDDK". National Institute of Diabetes and Digestive and Kidney Diseases. Retrieved 2023-05-13.
  8. 8.0 8.1 "Wilson Disease". web.archive.org. 2016-10-04. Archived from the original on 2016-10-04. Retrieved 2023-05-13.
  9. 9.0 9.1 "Indian Childhood Cirrhosis - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2024-04-14.
  10. 10.0 10.1 Water, National Research Council (US) Committee on Copper in Drinking (2000), "Disorders of Copper Homeostasis", Copper in Drinking Water (in ఇంగ్లీష్), National Academies Press (US), retrieved 2024-04-15
  11. Samant, Hrishikesh; Kothadia, Jiten P. (2023), "Spider Angioma", StatPearls, Treasure Island (FL): StatPearls Publishing, PMID 29939595, retrieved 2023-05-13
  12. Swerdloff, Ronald S.; Ng, Jason C. M. (2000), Feingold, Kenneth R.; Anawalt, Bradley; Blackman, Marc R.; Boyce, Alison (eds.), "Gynecomastia: Etiology, Diagnosis, and Treatment", Endotext, South Dartmouth (MA): MDText.com, Inc., PMID 25905330, retrieved 2023-05-13
  13. Baiges, Anna; Hernández-Gea, Virginia; Bosch, Jaime (February 2018). "Pharmacologic prevention of variceal bleeding and rebleeding". Hepatology International. 12 (Suppl 1): 68–80. doi:10.1007/s12072-017-9833-y. ISSN 1936-0541. PMID 29210030. S2CID 3684921.
  14. Reiberger, Thomas; Ulbrich, Gregor; Ferlitsch, Arnulf; Payer, Berit Anna; Schwabl, Philipp; Pinter, Matthias; Heinisch, Birgit B.; Trauner, Michael; Kramer, Ludwig; Peck-Radosavljevic, Markus; Vienna Hepatic Hemodynamic Lab (November 2013). "Carvedilol for primary prophylaxis of variceal bleeding in cirrhotic patients with haemodynamic non-response to propranolol". Gut. 62 (11): 1634–1641. doi:10.1136/gutjnl-2012-304038. ISSN 1468-3288. PMID 23250049. S2CID 2791451.
  15. 15.0 15.1 15.2 15.3 Piano, Salvatore; Tonon, Marta; Angeli, Paolo (2018-02-01). "Management of ascites and hepatorenal syndrome". Hepatology International. 12 (1): 122–134. doi:10.1007/s12072-017-9815-0. ISSN 1936-0541. PMID 28836115. S2CID 3708859.
  16. Zhang, Grace; Jazwinski Faust, Alison (2021-03-16). "Spontaneous Bacterial Peritonitis". JAMA. 325 (11): 1118. doi:10.1001/jama.2020.10292. ISSN 0098-7484. PMID 33724324. S2CID 232242377.
  17. Singal, Ashwani K.; Kamath, Patrick S. (2013-3). "Model for End-stage Liver Disease". Journal of Clinical and Experimental Hepatology. 3 (1): 50–60. doi:10.1016/j.jceh.2012.11.002. ISSN 0973-6883. PMC 3940492. PMID 25755471. {{cite journal}}: Check date values in: |date= (help)

వెలుపలి లంకెలు

మార్చు