నాలుగు రాళ్ల ఆట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆడుకునే ఆరుబయలు ఆట. 1980 1990 ల వరకు పిల్లలు ఆడుకున్న పురాతన సాంప్రదాయిక ఆట ఇది. దీన్ని పప్పుచారు అని, చార్ పప్పుచార్ అని కూడా అంటారు. [1]ఈ ఆటకు మూలం, పుట్టుక తెలియదు. పట్టణీకరణ, ఆధునిక ఆటల కారణంగా ఈ ఆట ఆదరణ కోల్పోయింది.

నాలుగు రాళ్ల ఆట

ఐదుగురు ఆడే ఈ ఆటను ఆరుబయట ఆడతారు. ఒక దొంగ, నలుగురు ఆటగాళ్ళు ఉంటారు. బొమ్మలో చూపిన విధంగా నేలపై నాలుగు పెట్టెలను గీస్తారు. నీలిరంగు గీత దొంగ కదిలే మార్గం. నారింజ రంగు గీతలు ఆటగాళ్ళు కదిలే మార్గాలు. ఐదుగురు ఆటగాళ్ళు పంటలు వేసుకుని దొంగ ఎవరో తేల్చుకుని ఆట మొదలు పెడతారు.

ఆడే విధానం

మార్చు

నాలుగు చతురస్రాల్లో ఒక్కోదానిలో ఒక్కో ఆటగాడి చొప్పున నిలబడతారు. మధ్యలో ఉన్న ఎర్రటి చుక్క వద్ద నాలుగు రాళ్ళను ఒకదానిపై ఒకటి పెడతారు. ఆ రాళ్ళ లోంచి ఒక్కో ఆటగాడు ఒక్కో రాయిని తీసుకుని తన పెట్టె లోకి తీసుకుపోవాలి. దొంగ తన గీతలపై అటూ ఇటూ నడుస్తూ రాయిని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్న ఆటగాళ్ళను అంటుకోవాలి. మొదటగా అంటుకున్న ఆటగాడు దొంగ అవుతాడు, ఆట అయిపోతుంది. తిరిగి ఈ కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది.

ఆట మొదలవగానే, రాళ్లను తీయడానికి ప్రయత్నించే ఆటగాళ్లను పట్టుకోవడానికి దొంగ తన గీతపై అటూ ఇటూ నడుస్తూండాలి. అతను ఒకచోట ఆగి నిలబడ కూడదు. పెట్టెల్లోకి వెళ్ళకూడదు. ఆటగాళ్ళు దొంగకు చిక్కకుండా రాళ్లను తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కో ఆటగాడూ ఎన్ని రాళ్ళనైనా తీసుకోవచ్చు. కానీ ఒక్కో గడిలో ఒక్క రాయే ఉండేలా వాటిని సర్దాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ రాళ్లను తీసుకుంటే ఇతర ఆటగాళ్లకు పంచుతాడు. అయితే అన్ని రాళ్లను ఒక్క ఆటగాడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కో ఆటగాడు ఒక్కోరాయిని తీసుకుంటే ఇక పంచాల్సిన అవసరం ఉండదు. రాయిని వేరే గడిలోకి ఇవ్వడానికి, విసర కూడదు, ఆటగాడు ఆ గడిలోకి వెళ్ళి అక్కడ పెట్టాలి. అలా రాయిని తీసుకునేటపుడు గాని, గడిని దాటేటపుడు గానీ ఆటగాణ్ణి దొంగ అంటుకుంటే ఆట అయిపోతుంది. కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది.

ఆటగాళ్లందరికీ ఒక్కో రాయీ వచ్చాక, వాళ్ళు దొంగను "గుంపు" కావాలా "చుట్టు" కావాల అని అడుగుతారు. దొంగ గుంపును, ఒక పెట్టెను ఎంచుకుంటే, ఆటగాళ్ళంతా చేతిలో తమ రాయిని పట్టుకుని దొంగ చూపిన పెట్టె లోకి చేరాలి. దొంగ, "చుట్టు" ను ఎంచుకుంటే ప్రతి ఆటగాళ్ళు తమ పెట్టె నుండి బయల్దేరి అన్ని పెట్టెలనూ 6 సార్లు చుట్టు తిరిగి తమ తమ పెట్టెల్లోకి చేరుకోవాలి. ఇలా పెట్టెనుండి పెట్టెకు మారేటపుడు దొంగ వాళ్ళను అంటుల్కునే ప్రయత్నం చేస్తాడు. ఏ ఆటగాడినైనా దొంగ పట్టుకుంటే అతను దొంగ అవుతాడు. ఈ కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది. లేదంటే అదే దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది.

మూలాలు

మార్చు
  1. "అల‌నాటి ఆట‌లు ఇక జ్ఞాప‌కాలేనా? | కవర్ స్టోరీ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.