నియోగులు
నియోగులు లేక నియోగి బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణుల్లో ఒక శాఖ. బ్రాహ్మణులై ఉండి రాజకీయ, కార్యనిర్వహణ, రెవెన్యూ వంటి రంగాల్లో వందల సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ సాగిన వారు నియోగులు. ఒక ఉద్యోగంలో నియోగింపబడినవారు కాబట్టి నియోగులు అని పిలవబడినారు.
ఉపశాఖలు
మార్చుఆరువేల నియోగులు
మార్చుపూర్వము మన తెలుగుదేశంకూడా ఏలిన ఒక నవాబు ఆస్థానంలో అక్కన్న, మాదన్న లనే ఇద్దరు తెలుగునాటి నియోగిశాఖకు చెందినవారు ఉండేవారు. వారు నవాబుకు పరిపాలనా విషయంలో చాలా సహాయంగా ఉండేవారు. ఒకనాడు నవాబు మనసుకు నచ్చే ఉపకారం వీరిద్దరూ చేసిన కారణంగా నవాబు వీరిని పిలిచి ఏమికావాలో నిరభ్యంతరంగా కోరుకొమ్మని కోరారు. వారు తమకవసరమువచ్చినప్పుడు కోరుకుంటామని నవాబుగారి వరాన్ని ఉత్తర కాలానికి పెట్టుకున్నారు. తరువాత కొన్నాళ్ళకి తెనుగుదేశంలోని గ్రామాలకు కరణాలును నియోగించవలసివచ్చింది. ఈసోదరులింతకు మునుపే తమశాఖవారి పేర్ల జాబితాను తమవద్ద సిద్ధంగా ఉంచికొనిఉండి నవాబు ఇంక రెండుమూడు రోజులలో ఉద్యోగాల నిస్తాడనగా నవాబును తమ వెనకటివరం ఇప్పించమని అడిగారు. ఏమి కోరుతారో కోరమని నవాబు కోరగా నవాబుగారి సీలు (ముద్ర) ను ఆరుఘడియల కాలం తమ కిప్పించమని వారు కోరారు. అందుకు నవాబు అంగీకరించాడు.
అక్కన్న, మాదన్నలు తమవద్ద అంతక్రితమే సిద్ధంగా ఉన్న జాబితాలో ఆరువేలమందికి మాత్రం ఆ అరుఘడియల కాలంలోనూ, గ్రామీకరణేకమును వ్రాసి వాటిపైన నవాబు గారి ముద్రను ఉంచగలిగినారు. నవాబు గారి ముద్రతో ఉన్నవి కనుక వారందరూ ఉద్యోగాల్లో ప్రవేశించారు. అప్పుడు ఉద్యోగాల్లో ప్రవేశించిన ఆరువేలమందికీ చెందినవారంతా నాటినుంచీ ఆరువేల నియోగులని వ్యవహరింపబడుతున్నారు.
ఈకథ చూడటానికి యధార్ధంగానూ, సమంజసంగానూ కనబడుతోంది. కాని ఇది ఎంతవరకు నిజమో కాదో చారిత్రిక పరిశోధకులే ప్రమాణం.
నన్నయ కాలము తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగిశాఖ లేర్పడెను. ఆ విభేదము నన్నయ కాలమందు కాని, అంతకు పూర్వమందుకాని లేకుండెను. నన్నయకు 100 ఏండ్లకు ముందు అమ్మరాజ విష్ణువర్ధనుడు రాజ్యము చేసెను. అప్పటివరకు తూర్పు చాళుక్యుల రాజధాని వేగీపురమై యుండెను. అమ్మరాజే రాజమహేంద్రవరమును రాజధానిగా చేసెను. కావున మన కీకాలమందు తూర్పుతీరమందలి (ఇప్పటి సర్కారులు) జిల్లాలలోని స్థితిగతులు కొంతవరకు తెలియవచ్చును.[1]
సాహిత్య రంగంలో
మార్చుతిక్కన నుంచి పలువురు నియోగి బ్రాహ్మణులు కవులుగా అనేక గ్రంథాలు రచించి, మార్గాలు ఏర్పరిచి సాహిత్య రంగాన్ని పెంపొందించారు. ప్రత్యేకించి ఆరువేల నియోగులు తెలుగు కవిత్వ శైలీ శిల్పాలను మెరుగుపరిచినవారుగా పేరొందారు. ఆంధ్రపత్రిక వారి తెలుగు వెలుగులు శీర్షికలో సంపాదకవర్గం కాటూరి వెంకటేశ్వరరావు గురించి రాస్తూ "ఆంధ్ర కవిత మొట్టమొదటి నుంచి ఆరువేల వారింట పెరిగి పెద్దదై చిక్కని ఒయ్యారాలొలికించింది. వారిలో శిల్పవేత్తలు కొందరు పద్యవిద్యకొక సొగసు, తూగు, అగరుసువాసనల గుబాళింపు కలిగించారు." అని ఈ విషయాన్నే ప్రస్తావించారు.[2]
మూలాలు
మార్చు- ↑ సురవరం, ప్రతాపరెడ్డి (1950). " 1 వ ప్రకరణము". ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వికీసోర్స్.
- ↑ ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు. హైదరాబాద్: మోనికా బుక్స్. 2002. p. 74. Archived from the original on 2019-01-09. Retrieved 2019-03-04.
1958-62 మధ్యలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన తెలుగు వెలుగు శీర్షికకు పుస్తకరూపం