నీలా మాస్ట్రాని ఒరియా సినిమా
కుల వ్యవ్యస్థ సమాజంలో మనుషులు చేసే ‘పని’ ని బట్టి ఏర్పడింది అని సమాజ శాస్త్రవేత్తలు చెప్తారు. కాని మన భారతీయ సమాజంలో అధికారాన్ని, దోపిడిని పెంచి పోషించే వ్యవ్యస్థగానే ఇది పని చేస్తుంది. అంటే మనకు అవసరమయ్యే పనులలో కూడా కొన్ని గొప్ప పనులు అని కొన్ని అసహ్యకరమైన పనులు అని మనిషి పరిగణించడంలోనే పరిపక్వత లేని, స్వార్ధపూరిత ఆలోచనా విధానం ఉంది. తక్కువజాతి వ్యక్తులు చేసే పనులు హీనమైనవి అంటూ కుల వివక్షని, వంట యింటి పని తక్కువదని స్త్రీలపై వివక్షను తరతరాలుగా ప్రోత్సహిస్తూ, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా అట్టడుగుకు నెట్టేసింది వ్యవ్యస్థ. ఈ పనులు జరగకపోతే ఎవరి జీవితాలు సజావుగా సాగవు కూడా. అందుకే బలవంతంగా ఈ పనులకు వారిని కట్టిపడేసి, వారిపై అధికారం చలాయించడం తరాలుగా జరుగుతూనే ఉంది. తాము చేసే పనులని తామే అసహ్యించుకునే స్థితికి ఆ వర్గాలు రావడం వెనుక ఈ వ్యవ్యస్థ తరతరాలుగా వారిపై జరిపిన దోపిడీ ప్రధాన కారణం. ఈ దోపిడిని అర్ధం చేసుకుని ప్రశ్నించిన వారిని సమాజం భరించలేదు. వాళ్లని సాధించి మానసికంగా బలహీనులను చేసి వ్యవ్యస్థ వారిని తన దారికి తెచ్చుకుంటుంది.
అలాంటి సమాజంలో తాను నమ్మిన సిద్దాంతాల ఆధారంగా కులవ్యవ్యస్థను పితృస్వామ్య వ్యవస్థను ఎదిరించి నిలబడిన ఓ స్త్రీ కథతో ఒడియా భాషలో 1996 లో ‘నీలా మాస్ట్రాని’ అనే చిత్రాన్ని చక్రధర్ సాహు తెరకెకించారు. ఒడియా రచయిత గోదాబారిష్ మోహపాత్ర రాసినకథ ఆధారంగా సినిమా తీశారు. ఒడియా సాహిత్యంలో ఈ కథకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ సినిమాకు ఐదు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. నీల ఓ ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది. ఈమెకు ఓ తమ్ముడు. ఆమెకు ఏడెనిమిది ఏళ్ల వయసులోనే తల్లి చనిపోతుంది. తండ్రిని మరో వివాహం చేసుకొమ్మని ఆ ఊరి పెద్దలు కోరతారు. ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచడం కష్టమని ఆయనకి ఓ సంబంధం కూడా చూస్తారు. తాను వివాహం చేసుకుంటే పిల్లలకు అన్యాయం జరుగుతుందని నీల తండ్రి మరో వివాహానికి ఒప్పుకోడు. తానే తల్లి తండ్రి అయి పిల్లలను కష్టపడి పెంచుతాడు. నీల పెరిగి యుక్తవయసుకు వచ్చాక ఆమెకు వివాహం చేయాలని అనుకుంటాడు నీల తండ్రి. ఊరి పెద్దలు మంచి సంబంధం తీసుకువస్తారు. కాని అతను అరుణ్ అనే ఓ అబ్బాయిని ఆ ఊరిలో గమనిస్తాడు. అరుణ్ అనాధ. కష్టపడి చదువుకుని ఫారెస్ట్ ఆఫీసర్ అవుతాడు. అతనికి కుల వ్యవ్యస్థపట్ల నమ్మకం లేదు. ఊరిలో బ్రాహ్మణ యువకుల అహంకారానికి జడవకుండా అందరినీ ఒకే రీతిలో పలకరిస్తూ అందిరిని కలుపుకుపోతూ జీవించే అభ్యుదయ భావాలున్న యువకుడు. ఊరిలో తక్కువ కులం యువకులకు అండగా నిలబడతాడు. అతనికి కుటుంబం, ఆస్థిపాస్తులు ఉండవు. నీల తండ్రి అలాంటి ఆలోచనలున్న వ్యక్తే కాని బ్రాహ్మణ వ్యవస్థను ఎదిరించడు. అరుణ్ భావాలు అతనికి నచ్చుతాయి, డబ్బున్న సంబంధాన్ని కాదని నీల పెళ్లి అరుణ్ తో జరిపిస్తాడు. నీల భర్తతో అడవి మధ్యలో కాపురానికి వెళ్తుంది. అరుణ్ ఆమెను చాలా బాగా చూసుకుంటాడు. భర్త ఒంటరితనాన్ని చిత్రలేఖనంతోనూ పుస్తక పఠనం తోనూ దూరం చేసుకోవడం నీల గమనిస్తుంది. భర్త భావాలు, పేదలపట్ల ప్రేమ, న్యాయబద్దంగా నిస్వార్ధంగా జీవించాలనుకొనే స్వభావం నీలకు నచ్చుతాయి. అతనితో జీవిస్తూ అతని భావాలను ఆమె గౌరవిస్తుంది. ఓ సారి నీల తమ్ముడు అక్క కొత్త కాపురాన్ని చూడడానికి వస్తాడు. అక్కా బావల ప్రశాంతమైన జీవితం చూసి సంతోషిస్తాడు. నీల జీవితానికి ఇక ఏ లోటూ ఉండదని ఆమె తమ్ముడు, తండ్రి సంతోషిస్తారు. ఫారెస్ట్ లో ఓ సారి కలప దొంగలు అర్ధరాత్రి దొంగతనానికి వస్తారు. ఉద్యోగాన్ని బాధ్యతతో నిర్వర్తించే అరుణ్ అర్ధరాత్రి అయినా భయపడకుండా ఒంటరిగా అడవిలోకి వెళతాడు. ఈ కలప దొంగతనం గురించి తెలిసిన మిగతా ఉద్యోగస్తులు దీన్నిపెద్దగా పట్టించుకోరు. అరుణ్ కి వాళ్లెప్పుడూ సహకరించరు. అందువల్ల ఒంటరిగానే ఆ దొంగతనాన్ని ఆపాలని వెళ్లిన అరుణ్ అక్కడ దొంగలు జరిపిన కాల్పులకు గాయపడతాడు. గ్రామస్తులు అతన్ని చివరి క్షణాలలో ఇంటికి తీసుకువస్తారు. నీల చేతుల్లో అతను మరణిస్తాడు. అత్తిల్లు, చుట్టాలంటూ ఎవరూ లేని నీల తిరిగి తండ్రి పంచకే చేరుతుంది. నీల తండ్రి ఛాందసంగా ఆలోచించే వ్యక్తి కానందువల్ల నీలను తిరిగి చదివిస్తాడు. తానే స్వయంగా కూతురికి, కొడుకుతో పాటు చదువు చెప్పి పరీక్షలకు కట్టిస్తాడు. ఇంటి పని చేస్తూ తండ్రి శిష్యరికంలో నీల మెట్రిక్ పరిక్ష పాస్ అయి, అదే ఊరిలో టీచర్ గా ఉద్యోగంలో చేరుతుంది. బ్రాహ్మణ వితంతువు చదువుకుని ఉద్యోగం చేస్తు ఊరి వారి మధ్యకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. టీచర్ ఇంటర్వ్యూకి కూడా వచ్చిన మొదటి స్త్రీ అభ్యర్థి ఆమె. నీల తన ప్రతిభతోనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉద్యోగం సంపాదించుకుంటుంది. నీల ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆమె తండ్రి మరణిస్తాడు. తమ్ముడికి అండగా ఉంటూ అతని చదువు కొనసాగించడానికి నీల ధైర్యాన్ని ఇస్తుంది. అక్క అండతో ఆమె తమ్ముడు చదువుపై దృష్టిపెడతాడు. ఆ ఊరిలో అప్పుడే స్త్రీవిద్య, స్త్రీస్వేచ్చ గురించి కొందరు గాంధేయ స్త్రీ కార్యకర్తలు పని చేస్తూ ఉంటారు. వారిని నీల గమనిస్తూ తన ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటుంది. నీల స్టూడెంట్లలో సాబి అనే ఓ అమ్మాయి ఆలస్యంగా బడికి వస్తూ ఉంటుంది. నీల ఓ రోజు ఆమెను కారణం అడుగుతుంది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆమెకు అన్నీ చేసి పెట్టి స్కూలుకు వస్తున్నానని సాబి చెబుతుంది. అంత చిన్న పిల్ల పడే కష్టం చూసి నీల బాధపడుతుంది. సాబి తల్లిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్తుంది. అయితే ఆ అమ్మాయి దళితవాడ నుండి వస్తుంది. ఆ వాడలో ఎక్కువగా చాకలివారు ఉంటారు. నీల సాబి ఇంటికి వెళ్లడం కొందరు బ్రాహ్మణ కులస్థులు చూస్తారు. ఆ వాడకు వెళ్లే దారికి అడ్డంగా పనిపాట లేనట్లు పేకాడుతూ ఉండే వీళ్ళు నీల ఆ ఇంటికి రాకపోకలు సాగించడం గమనించి ఆమెను విమర్శిస్తూ ఉంటారు. నీల వారి వయసుకు గౌరవం ఇస్తుంది తప్ప ఆ మాటలను పట్టించుకోదు. ఆ వాడలో మదన్ అనే చదువుకున్న యువకుడు తమ జాతి పై జరిగే వివక్షను ప్రశ్నించే ధైర్యం ఉన్నవాడు కూడా. వాడలో ఇతర అభ్యుదయ భావాలున్నవారితో కలిసి మీటింగ్లు నిర్వహిస్తూ, నాటకాలు వేస్తూ వారిలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీల ఆ వాడకు వస్తూ ఉండడంతో తన నాటకానికి ఆమె సహాయం కోరతాడు. చదువు వచ్చినవారు తక్కువ ఉండడం, మదన్ చెసే పనులు అవసరం అనుభవంలోకి రావడంతో నీల మదన్ కు సహాయపడడానికి ఒప్పుకుంటుంది. ఏకలవ్యుడి నాటకం రిహార్సులు జరుగుతుండగా తాను ఇన్నాళ్లు చదివిన కథలలో తాను ఎరుగని వివక్ష, ఆమెకు స్పష్టంగా అర్ధమవుతుంది. మదన్ లోని బాధ, ఆక్రోశం ఆమెకు ఇంకా బాగా అర్ధం అవుతాయి. వారికి ఉపయోగపడేలా తానూ ఏదో చేయాలనే సంకల్పం ఆమెలో కలుగుతుంది.
ఒక రోజు ఆ ఊరి బ్రాహ్మణ పెద్ద ఒకతను కొందరితో వచ్చి సాబి తల్లి ఇంటి ముందు ఏదో తవ్వడం మొదలెడతాడు. మదన్ వారిని ప్రతిఘటించబోతాడు. సాబి తల్లి మౌనంగా చూస్తూ ఉంటుంది. నీల అప్పుడే అక్కడికి వస్తుంది. విషయం మదన్ ని అడిగి తెలుసుకొంటుంది. నీ కులం వాళ్లకు విరుద్దంగా నీవు మాట్లాడలేవు కాబట్టి నీకది అనవసరం అని ఆమెతో కోపంగా అంటాడు మదన్. తనకు కులం ముఖ్యం కాదని మంచితనం ముఖ్యం అని ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది నీల. సాబీ తల్లి ఆ బ్రాహ్మణ పెద్ద తాను ఉతికిన బట్టలు ఇవ్వాలని ఇంటికి వెళితే తనపై అత్యాచారం చేసాడని, ఆ విషయం తాను ఊరిలో చెప్పకుండా ఉండడానికి తన ఇంటి ముందు తవ్వకాలలో దేవుని విగ్రహం దొరికిందని ప్రచారం చేసి తనను ఆ ఇంటి నుండి గెంటించే ప్రయత్నంలో ఉన్నాడని నీలకు చెబుతుంది. ఆమె చెప్పినట్లుగానే తవ్విన చోట దేవుని విగ్రహం బైటపడుతుంది. తనకిలాంటి విషయాలు ఏమీ తెలియవని, ఈ అన్యాయాన్ని తాను ఎదిరిస్తానని, అవసరమయితే తన కులాన్ని వదులుకోవడానికయినా సిద్దమే అని నీల అందరి ముందు చెప్తుంది. ఇది బ్రాహ్మణ కులస్తులకు సవాలుగా మారుతుంది. మదన్ ఆ బ్రాహ్మణ పెద్ద దగ్గరే పని చేస్తూ ఉంటాడు. నీల మీద కోపంతో అతను మదన్ ని పని నుండి తీసేస్తాడు. మదన్ కు ఆ ఊరిలో మరే పని దొరకదు. ఊరి వాళ్ళంతా నీలకు మదన్ కు సంబంధం ఉందనే ప్రచారం మొదలెడతారు. తన కులంవారి బెదిరింపులకు నీల లొంగదు. మదన్ ని ఉద్యోగంలో తీసుకోకపోతే తన కులాన్ని ఉద్యోగాన్ని వదిలేస్తానని అంటుంది. అలాగే వదిలేస్తుంది. కులాన్ని వదిలేయడం వల్ల ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని మదన్ నచ్చచెప్పబోతాడు. తాను కులవ్యవ్యస్థను నమ్మనని ఈ రోజు కులంలో ఉండి అన్యాయాన్ని ఎదిరిస్తున్నానని, అవసరమయితే కులం నుండి బైటకు వచ్చి కూడా అన్యాయాన్ని ఎదుర్కుంటానని ఆమె బదులిస్తుంది. తాను ఆ నిర్ణయానికి వస్తే మదన్ కులస్తులు తనను స్వీకరిస్తారా అని అతన్ని అడుగుతుంది. మదన్ తో జీవితం పంచుకోవాలనుకుంటున్న తన కోరికను నీల అలా నిస్సంకోచంగా ప్రకటిస్తుంది. తన నిర్ణయం తమ్ముడి భవిష్యత్తుకు ఆటంకం అవుతుందని తమ్ముడి ఇల్లు, బ్రాహ్మణవాడను శాశ్వతంగా వదిలిపెట్టి మదన్ ను ఆర్య సమాజంలో వివాహం చేసుకుంటుంది. నీలతో వివాహం అయ్యాక మదన్ అభద్రతా భావంలోకి కొట్టుకుపోతాడు. చేయడానికి ఊరిలో ఏ పనీ ఉండదు. చదువుకున్న చదువు వ్యర్ధం అయినట్లు అనిపిస్తుంది. అంతకు ముందు నిర్వహించే కార్యక్రమాలలోనూ పాల్గొనలేకపోతాడు. ఊరందరికీ వీరి కాపురం వింతగా ఉంటుంది. ఆ వాతావరణంలో చాలా అలజడికి లోనవుతాడు మదన్. అన్ని కష్టాలకు తానే కారణం అని తనను తాను నిందించుకుంటూ ఎంతో ఒత్తిడికి గురవుతాడు. క్రమంగా తాగుడుకి అలవాటుపడతాడు. నీల తోటి చాకలి స్త్రీలతో నదికి వెళ్లి బట్టలు ఉతకడానికి సిద్దపడుతుంది. ఏ పని తక్కువది కాదని, నిజాయితిగా పని చేసుకుని బతకడం గౌరవం అని అంటూ నదికి వెళ్లి సాటి చాకలి వారికి సహాయం చేసి ఆ బట్టలు ఉతికి పెడుతూ ఆ వృత్తిని స్వీకరిస్తుంది. ఇది ఊరందరూ మాట్లాడుకోవడాని మరో విషయం అవుతుంది. ఆ సమయంలోనే కొత్తగా ఉద్యోగంలో చేరిన నీల తమ్ముడి వివాహం నిశ్చయమవుతుంది. ఆ పెళ్లికి ఊరందరికీ ఆహ్వానం అందుతుంది. చాకలివాడలోని స్త్రీలు కూడా పెళ్లికి వెళ్లి విందు ఆరగించి తమ ఇంటికి మిగిలిన పదార్ధాలను తెచ్చుకుంటారు. నీలకు ఆహ్వానం అందదు. ఇది మదన్ ను ఇంకా బాధిస్తుంది. తాగుడులో అతను బాధను మర్చిపోయే ప్రయత్నం చెస్తాడు.
నీల తోటి చాకలి స్త్రీలను తనకు తెచ్చుకున్న తినుబండరాలు పెట్టమని అలా అన్నా తమ్ముడి పెళ్ళిలో తనను భాగం చేయమని బ్రతిమాలుతుంది. ఆమె మాటల్లోని ప్రేమ వారికి అర్ధం కాదు. తమ మధ్యలోకి వచ్చి తమ వృత్తిని స్వీకరించి జీవిస్తున్నఆమె పట్ల ఎలా ప్రవర్తించాలో ఆమె తమ్ముడి పెళ్ళిలో మిగిలిన పదార్దాలు ఆమెకే ఎలా పెట్టాలో అర్ధంకాక వాళ్లు మౌనంగా ఆమెను దాటి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆమె బ్రాహ్మణ స్త్రీ కాదు, చాకలిస్త్రీ కూడా కాదు. ఏ కులమూ లేని ఆమెతో ఎలా మెలగాలో ఎవరికీ అర్ధం కాదు.
నీల పక్కింట్లో ఉండే రెబ, ఆమె తమ్ముడింటి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. నీల మరదలి పెళ్లి చీరను ఉతకడానికి ఆమె తీసుకు వస్తుంది. చాకలి ఉతికి ఇచ్చిన తరువాత అదే చీరను కట్టుకున్న పెళ్లికూతురు భర్త గదిలోకి ప్రవేశిస్తుంది.పెళ్లి తంతుకు ఆ చీర చాలా అవసరం. అది ఉతకడానికి తెచ్చిన రెబతో తాను ఆ చీర ఉతికి ఇస్తానని, అలా అన్నా తమ్ముడి పెళ్లి కార్యక్రమంలో భాగం అవుతానని నీల బతిమాలుతుంది. ఆమె పడుతున్న బాధ అర్దం అయి రెబ ఆ చీర ఉతికి ఇవ్వమని నీలకు ఇస్తుంది. నీల దాన్ని ప్రేమగా ఉతికి ఇస్త్రీ చేసి భద్రంగా పెట్టెలో దాస్తుంది. రెబ దాని తిరిగి ఇవ్వమన్నప్పుడు మాత్రం ఆ చీర ఇవ్వదు. పైగా దాని కోసం అవతలి వారిని ఇంటికి రమ్మనమని మొండిగా బెదిరిస్తుంది. ఆ చీర సమయానికి ఇవ్వకపోతే తన జీవినాధారం పోతుందని నీలను నమ్మి తాను ఆ చీర ఇచ్చానని, ఇది తన కడుపు కొట్టడం అని రెబ కన్నీళ్ళతో బతిమాలినా ఆమె ఆ చీర ఇవ్వదు. దీనితో రెబ నీల తమ్ముడికి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. ఇది బ్రాహ్మణ పెద్దలకు తెలుస్తుంది. వారి పద్దతి ప్రకారం ఆ చీర లేకపోతే ఏ తంతూ జరగదు. దాని కోసం వెలివాడకు వాళ్లు వెళ్లాలి అన్నది నీల విధించిన షరతు. కులంతక్కువ వారి వాడకు వెళ్ళడం వారి దృష్టిలో మహా పాపం. అందుకని ఈ సమస్యను ఎలా పరిషరించాలో తెలియక వారిలోవారు తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఓ చాకలి స్త్రీ ముందు బ్రాహ్మణుడు చేుయిచాపడం కులపెద్దలు సహించలేని విషయం. అప్పటి దాకా చాకలి స్త్రీలు భయంగా భక్తిగా వారి బట్టలను ఉతికి తీసుకువచ్చి ఇంట్లో పెట్టి వెళ్లడం మాత్రమే వాళ్లకు తెలుసు. ఈ తిరుగుబాటు వాళ్లు ఊహించనిది. పైగా తిరగబడుతున్నది తమలోనుండి బైటకు వెళ్లిన ఓ స్త్రీ. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ పెద్దలకు తెలియదు. వాళ్ళ అహం దెబ్బతింటుంది. కాని ఓడిపోవడం వారికి ఇష్టం ఉండదు. వెలివాడకు వెళ్లడం వారిదృష్టిలో ఓడిపోవడమే.
ఇదంతా చూస్తూ ఉన్న నీల తమ్ముడికి అక్కపై కోపంరాదు. అక్కతో చిన్నప్పటి తన జీవితం, ఆమెతో గడిపిన క్షణాలు, తండ్రి చనిపోయినప్పుడు ఆమె ఇచ్చిన బలం ఇవన్నీ అతనికి గుర్తుకు వస్తూ ఉంటాయి. కులం, అంటరానితనం,ఆంక్షలు, నీతీ నియమాలన్నిటికి విరుద్దంగా అక్కతో తనకున్న అనుబంధం గొప్పదని అతనికి అనిపిస్తూ ఉంటుంది. అందుకే అర్ధరాత్రి జోరువాన కురుస్తుండగా అక్క ఇంటి తలుపు కొడతాడు. ఆ పెళ్ళిచీర తనకివ్వమని చేయిచాచి అడుగుతాడు. నీలకు అక్కడ తన ఇంటి ముందు చేయిచాచిన బ్రాహ్మణ కులం కనిపించదు. తన తమ్ముడు కనిపిస్తాడు. అందరిని కాదని కేవలం తనకోసం తనతమ్ముడు ఆ ఇంటి తలుపు తట్టాడని ఆమెకు అర్ధం అవుతుంది. తమ్ముడి క్షేమం కోసం ఓ అక్కలా బాధపడుతుంది. ఆ చీర ఇచ్చి నువ్విక్కడకు వచ్చావని తెలిస్తె నీ భవిష్యత్తు పాడవుతుంది. ఎవరూ చూడక ముందే వెళ్ళిపో, అంటూ అతని మొహంపై తలుపు వేసి కన్నీళ్ళతో ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె పోరు కులవివక్షపై కాని తమ్ముడిపై కాదు. నీల అ చీర ఇవ్వను అని మొండితనం చూపడంలో తక్కువ కులం అని వివక్షను ఎదుర్కుంటున్న వారి అవసరం ఆ అగ్రకులస్తులకెంత ఉందో, వారే లేకపోతే అగ్ర కులాల దైనిక జీవితం ఎంత అల్లకల్లోలం అయిపోతుందో ప్రత్యక్షంగా వాళ్లకి అనుభంలోకి తీసుకురావాలనే ఓ పట్టుదల ఉంది. అగ్రకుల అహంకారంపై శ్రమ విలువ, దోపిడిలోని స్వార్దం అర్ధం చేసుకున్న ఓ స్త్రీ చేసిన తిరుగుబాటు అది. కాని తమ్ముడు ఒంటరిగా ఇంటి ముందుకు రావడంతో తమ్ముడిని ప్రేమించే అక్కగా అతని భవిష్యత్తు గురించి ఆమెలో భయం కలుగుతుంది. అప్పుడే వివాహ జీవితంలో అడుగుపెట్టిన అతను వెలివాడకు వచ్చాడంటే అతని కులం అతన్నిఎంతలా హింసిస్తుందో అన్న భయం ఆమెను లొంగదీసుకుంటుంది. అందుకే ఆ చీరను తమ్ముడికి ఇచ్చి ఎవరూ చూడకుండా అక్కడి నుండి వెళ్లిపొమ్మని అతన్ని కన్నీళ్లతో అడుగుతుంది. కులవ్యవస్థపై, దోపిడి, వివక్షలపై స్త్రీగా ఆమె చేసిన పోరాటం, పీడిత వర్గాలకు ఆమె తనపంధాలో చూపిన పోరాటమార్గం ఆలోచించదగ్గవి. పరిస్థితులకు మదన్ భయపడినట్లు ఆమె భయపడదు. ఎదో ఒక మార్గంలో ఆమె పోరాటం చేస్తూనే ఉంటుంది. మదన్ తో అంతకు ముందు ఆమె చెప్పినట్లుగానూ ఆ కులంలో ఉన్నప్పుడూ దాన్ని వదిలినప్పుడూ కూడా ఆమె వివక్షపై తన పంధాలో పోరాడుతూనే ఉంది. నీలపాత్రను పోషించిన నటి ప్రియాంక మహాపాత్ర. నీల శరీర భాషలో ఎక్కడా ఆవేశం కాకుండా కేవలం ఆలోచనతో ఆమె నిర్ణయాలు తీసుకోవడం మనం గమనించవచ్చు. కథ ప్రారంభంలో ఆమెలో మర్యాద మన్నన సాంప్రదాయాలను గౌరవించే తత్వం కనిపిస్తాయి. తరువాత జీవితం, చదువు నేర్పిన పరిపక్వతతో ఆమె ఎదుగుతుంది. బలవంతురాలవుతుంది, కాని అది ఆవేశంలో బలహీనపడదు. మదన్ లో ఆ అవేశం చల్లారిపోయి అతను అశక్తుడిగా మారడం కనిపిస్తుంది. కాని నీల అనునిత్యం జీవిత సవాళ్లను అదే ప్రశాంతతతో స్వికరిస్తుంది తన పోరాతాన్ని ఆవేశంతో కాక ఆలోచనతో సాగిస్తుంది. సమాజంలో పాతుకుపోయిన కులవివక్షను ఎదుర్కునే క్రమంలో ఆవేశం కాదు ఆలోచన ఆయుధం అవ్వాలి అన్న సందేశాన్ని ఈ పాత్ర ద్వారా ప్రియాంక మహపాత్ర ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కించడంలో విజయం సాధించారు. సాత్వికంగా, శాంతంగా కనిపిస్తూనే వివక్షను ఆమె నిబ్బరంతో ఎదుర్కోవడం, ఆమె చూపిన ధైర్యం అబ్బురపరుస్తాయి. ఒక స్త్రీగా, అన్ని రకాల వివక్షలపై ఆమె జరిపిన పోరు వివేచనతో జీవించేస్త్రీ జీవితానికి నిదర్శనం.
మూలాలు: ముఖపుస్తకంలో శ్రీ కపిల రాంకుమార్ is with Jhansikumari Parupall చేసిన రచన, With venkat Kolgari coperation, Neela Mastrani Oriya film.