దీన్ని నెమలిచెట్టు, నెమలి అడుగు, నెమలి కన్ను, నెమలినార చెట్టు, దుందిలము, పింపిణి, అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో Syonakah అంటారట. బహుశా చెట్టు కొమ్మలు పైభాగంలో నెమలి పింఛం మాదిరి విస్తరించి ఉండడంతో ఈ పేరు వచ్చిందేమో! తమిళులు దీన్ని కంపాలా అంటారు. లైటెక్స్ నిగుండో బొటానికల్ పేరు. ఇది ఉష్ణమండలం చెట్టు, భారతదేశానికి చెందినది. ఈ చెట్టు ఆకులు, వేళ్ళు, పట్ట వగయిరా ఆయర్వేద వైద్యంలో వాడుతారు. పశువుల జబ్బులకుఈ చెట్టు నుంచి తయారుచేసిన మందులు వాడుతారు. 'దశమూలా' ఆయుర్వేద మందు దీని వేళ్లతోనే తయారుచేస్తారు. వాపులు తగ్గించడానికి, బెణుకులకు, దగ్గు ,ఆయాసం, అజీర్తి,కడుపులో ఫుల్లు, తలనొప్పికి, చర్మవ్యాధులకు ఈ చెట్టు ఆకులు, వేళ్ళు, పట్టతో మందులు చేస్తారు. సెప్టెంబరు నుంచి నవంబర్ వరకు చెట్టు పూతకు వస్తుంది. పూవులు వంగపండు నీలంగా {purple], పింకు వర్ణంలో గుత్తులుగుత్తులుగా పూస్తాయి. డిసెంబర్ నుంచి జులై వరకు కాస్తుంది. పళ్ళు నల్లగా కుంకుడు గింజలంత ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం అడవుల్లో కృష్ణానది ఇరుదరులా అడవుల్లో కనిపిస్తుంది. మనదేశంలో ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. చెట్టు ఏపుగా దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. దీని కలప మృదువుగా వుండి ఇళ్లకు, ఇతర పనిముట్లకు పనికివస్తుంది. దీని ఆకులు మేకలు, గొర్రెలు తింటాయి. ఈ వృక్షము మనదేశంలో ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో సాధారణంగా పెరుగుతుంది. వేసవిలో చెట్టు కాయలు కాచి అవి ఎండినపుడు చెట్టు పైభాగం అంతా ఎండినట్లు అనిపిస్తుంది.నెల్లూరులొ కొన్ని వీధుల్లొ ఇరుదరుల ఈ చెట్లను నాటారు.

ఫోటో ఈనాడు దినపత్రిక మహబూబ్ నగర్, ఏప్రిల్,22,2022. రచన: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం

1మూలాలు: 1.శ్రీశైలం చెంచులు, కర్నూలు జిల్లా ఆత్మకూరు 'వార్త' పత్రిక ప్రతినిధి డి.సుబ్బారెడ్డి ద్వారా తెలిసిన సమాచారం. 2.ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్, ఏప్రిల్,22,2022, 3. Flavones Contents in Extracts from Oroxylum indicum Seeds and Plant Tissue Cultures