ప్రధాన మెనూను తెరువు

పరీక్ష విశ్వనాథ సత్యనారాయణ 1951లో రాసిన నవల. దీనిని పి.ఆర్ అండ్ సన్సు, విజయవాడ 1959 లో ముద్రించారు.

ఈ నవలలో పేదలు సంసారాలలో కలిగే కష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులూ మనకి చక్కగా తెలుస్తాయి. ఈ నవలలోని భాష. చాలా తేలిక భాషలో ఉంటుంది…దేశీయంగా, పల్లెటూళ్ళలో వ్యవసాయదారులు వుపయోగించే చక్కటి మాటలు చాలా ఉన్నై….భాషలో మామూలుగా రెండు రకాల కష్టాలుంటై.. మొదటిది కష్టమైన మాటలు. అవి ఈ పుస్తకంలో లేవు. రెండవది కష్టమైన భావాలు. భావాలలో కష్టం పాఠకుడికి తెలియాలి. అప్పుడుగాని పాఠకుడి బుద్ధికి వివేకం అబ్బదు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పుస్తకంలో అవసరమైన చోట్ల ఆ పరిస్థితి, దాని స్వరూపం చక్కగా చిత్రీకరించబడ్డాయి. ఇది పాఠకుడి బుద్ధికి పదునుపెట్టటం…”పదునులేని కత్తి ఎలా పనికిరాదో, అలానే పదునులేని బుద్ధికూడా నిరుపయోగమే!” ఇవి విశ్వనాథ వారి మాటలు..!!!

కథాంశంసవరించు

పరీక్ష కథా వస్తువు “పేరు”లోనే ఉన్నట్లు పరీక్ష. ఆ రోజుల్లో ఇంగ్లీషు చదువులు పేద సంసారాల మీద ఎలా ప్రభావం చూపాయన్నది ప్రధాన విషయం. కాని, లోతుగా ఆలోచించి చూస్తే ఈ రోజుల్లో విద్యా విధానాలు, పరీక్షలు విద్యార్థుల మనస్సుల మీద, తద్వారా వాళ్ళ జీవన స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నదీ కళ్ళక్కట్టినట్టు కనపడుతుంది….ముఖ్యంగా పిల్లల్ని ఒకటో తరగతి నుంచే పోటీ పరీక్షలకి కూర్చోబెట్టే తల్లిదండ్రులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

కథాకాలం మొత్తం భారతదేశానికి స్వరాజ్యం రావటానికి ముందు పదేళ్ళు, తర్వాత ఐదారేళ్ళు.

గోపాలం, సూర్యం ఇద్దరూ అన్నదమ్ములు. గోపాలానికి పదేళ్ళు, సూర్యానికి తొమ్మిది. వాళ్ళది చిన్న పూరిగుడిసె. కాని వేసవిలో చల్లగా ఉండే వాళ్ళ గుడిసె వదిలి, వేడిగా ఉండే ఆ ఊరి ధనవంతుల ఇళ్ళకి వెళుతుంటారు. ఎందుకు? ఆ ధనవంతుల పిల్లలు పట్నంలో చదువుతుంటారు. ఈ పిల్లలిద్దరికీ చదువుమీద ఇష్టం అనటం కంటే, చదువుకున్నవాళ్ళ మీద, వాళ్ళు పోయే పోకిళ్ళమీద ఇష్టం…మాయని దుస్తులు, ఊటకలాలు, వాచీలు, బూట్లు, కళ్ళజోళ్ళు, సినిమాల గురించి, స్టారుల గురించి మాటాడుకోటం….ఇవన్నీ, ఈ పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. ఇక వాళ్ళవెంటబడి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బ్యాడ్మింటనాడుతుంటే, వీళ్ళ పని, పోయిన బంతి తెచ్చివ్వటం….తండ్రి మాట వినరు..తల్లి గారాబం.

కథకి గోపాలాన్ని నాయకుడనుకోవచ్చు…..తండ్రి రామయ్యకి ఆరుగురు సంతానం. వీళ్ళిద్దరూ కాక నలుగురు ఆడపిల్లలు…. ఉన్నది ఐదెకరాల మాగాణి. అస్తస్తుగా సరిపోతుంటుంది…అప్పుడు వీళ్ళిద్దరికీ పట్నం వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది….తండ్రి నచ్చచెప్పి ఊళ్ళో ఉన్న బళ్ళో వేస్తాడు….ఊళ్ళో ఉన్న బళ్ళో చదువైపోగానే పట్నం వెళ్ళక తప్పని పరిస్థితి…తండ్రికీ వీళ్ళని చదివిస్తే, కనీసం ఏదో ఒక ఉద్యోగం చేసి కుటుంబాన్ని గట్టెక్కిస్తారు కదా అని పట్నంలో పెడతాడు….మధ్యకాలంలో, కూతుళ్ళిద్దరికి రెండెకరాలమ్మి పెళ్ళిళ్ళు చేస్తాడు…పాల వ్యాపారం మొదలెడతాడు….

ఇక అప్పుడు మొదలవుతుంది. సూర్యానికి చెడుతిరుగుళ్ళు, డబ్బు దుబారా ఖర్చులు అలవాటవుతాయి. గోపాలం ఐదోఫారం రెండుసార్లు తప్పుతాడు….తర్వాత సూర్యం పూర్తిగా చదువుమానేసి, ఇంట్లోంచి వెళ్ళిపోతాడు…ఎట్టాగో గట్టెక్కిన గోపాలం స్కూలు ఫైనలుకి కూర్చుంటాడు….రామయ్య కొంచెం చక్కగా ఉండే మూడో కూతురు, శ్యామలకి చదువుకున్న సంబంధం చెయ్యాలని ఎక్కువ కట్నం పెట్టి పెళ్ళి చేస్తాడు..దానికి, ఒక ఎకరం కట్నం పోగా మిగిలిన డబ్బుకోసం ఉన్న రెండెకరాలూ తనఖా పెడతాడు….ఉన్న గేదెల్లో ఒకటి వట్టిపోతుంది…. కాఫీహోటళ్ళ తిండికి అలవాటుపడ్డ రామయ్యకి జబ్బు చేస్తుంది. ఇక కుటుంబ భారం కొంత గోపాలం మీద పడుతుంది..దాంతో స్కూలుఫైనలు పరీక్ష తప్పుతాడు….శ్యామల భర్తకి టైఫాయిడ్ వచ్చి చనిపోతాడు….ఇక శ్యామల తిరిగి ఇంటికి చేరుతుంది…ఆ దుఃఖంతో, అసలే జబ్బుతో ఉన్న రామయ్య పిడుగుపాటులా మరణిస్తాడు…..దాంతో అప్పుల వాళ్ళు గోపాలం గొంతుమీద కూర్చుంటారు…అందువల్ల ఆ సంవత్సరం కూడా పరీక్ష తప్పుతాడు….ఇక్కడ సూర్యం నాటకాల కంపెనీల్లో చేరి రెండు చేతులా సంపాదిస్తుంటాడు…అన్నకి సహాయం చెయ్యకపోగా ఉన్న ఆస్తి వాటా పంచుకుని వెళ్ళిపోతాడు….సూర్యం ఎలాగో బావగారి సహాయంతో ఉన్న ఆస్తికి, అప్పులకి సరిపెట్టి తల్లిని ఇద్దరు చెల్లెళ్ళని తీసుకుని పట్నం చేరతాడు….ఇక అక్కడ అతడు ఎదుర్కున్నే నిత్య సంఘర్షణలతో కథ నడుస్తుంది….శ్యామలకి ఇంట్లో చదువు చెప్పి మెట్రిక్ కి కూర్చోబెట్టి, తను కూడా స్కూలుఫైనలుకి అవకాశాలైపోటంతో మెట్రిక్ కి కూర్ఛుంటాడు…శ్యామల పరీక్ష అవుతుంది, గోపాలం తప్పుతాడు….మధ్యలో తల్లి మరణిస్తుంది…శ్యామలని నర్సు పరీక్ష రాయిస్తాడు..ఆ ట్రైనింగు పూర్తి చేసుకుని శ్యామల ఉద్యోగంలో చేరుతుంది. చిన్న చెల్లెల్ని శ్యామల దగ్గరికి పంపిస్తాడు…అంతలో సూర్యం పెద్ద సినిమా స్టారు అయ్యి ప్రత్యక్షమవుతాడు….అటు చెల్లెలి దగ్గరికి వెళ్ళలేక, తమ్ముణ్ణి యాచించలేక సంఘర్షణ పడ్డ గోపాలం చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు………

కథలో ఎక్కడా విసుగనిపించదు…. పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్టుంటాయి…ముఖ్యంగా గోపాలం మనస్తత్త్వాన్ని, పదేళ్ళ వయసునుంచీ అతడు పడే సంఘర్షణని అద్భుతంగా చిత్రీకరిస్తారు విశ్వనాథవారు….మొదటి అధ్యాయంలో అన్నదమ్ములిద్దరికీ కలిపి తండ్రి ఒక బ్యాటు కొనిపెడతాడు…ఎక్కువ సేపు ఆడినా గోపాలం కంటే సూర్యానికే ఆట బాగా వస్తుంది….అక్కడ ఎందుకు నాకు ఆట రావట్లేదా అని మథన పడతాడు…..”అన్ని విద్యలూ అందరికీ కుదరవు కాబోలు!” ఈ వాక్యంతో ఆ అధ్యాయం ముగుస్తుంది….మొదట చదువు రావటం చాలా కష్టంగా ఉంటుంది..అక్కడ రెండు మంచి మాటలు వాడతారు, విశ్వనాథ వారు..”వాళ్ళకి పరిశుభ్రత అనేది ఒక సబ్జెక్టు. కాని పరిశుభ్రత వాళ్ళింట్లో లేదు, అంతమందికీ ఒకటే గది. అందులోనే గేదెదూడ. అసలు పరిశుభ్రత అన్న భావమే వాళ్ళకి తెలియదు.అది వాళ్ళ దోషం కాదు…వాళ్ళెరుగని ఈ భావాన్ని గురించిన పాఠం వీళ్ళకి అర్థం కాదు…అర్థంకాని ఈ పాఠం వాళ్ళ మనసుకి బరువవుతుంది….ఒక భావన యొక్క అర్థం పిల్లవాడికి స్వతస్సిధ్దంగా తెలియనిదైతే అది వాళ్ళ మనసుకి బరువవుతుంది….అలా వాళ్ళకి చదువు కష్టమయ్యెను”…..

సూర్యానికి, గోపాలానికి మనస్సుల్లో ఉన్న తారతమ్యాన్ని విస్పష్టంగా చూపిస్తారు… సహజంగా మెతకగుండెవాడైన గోపాలం కొంత వయసొచ్చేపాటికి తమని చదివించటానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలని అర్థం చేసుకుని చదువు మానేసి తండ్రికి సహాయం చేస్తానంటాడు….కాని సూర్యానికివేం పట్టవు…గోపాలం ప్రతి చిన్న విషయాన్ని మనసుకి పట్టించుకుంటాడు,సూర్యం పట్టించుకోడు.తండ్రి సంసార బాధ పడుతుంటే గోపాలం దిగులు పడతాడు..తల్లికి తమ చదువుమూలంగా ఒక్క చీరతొ గడపాల్సొస్తున్నందుకు బాధ పడతాడు…సంసారభారమంతా తనది అన్నట్టు మనసు కష్టపెట్టుకుంటాడు….

నాకు మనసుకి హత్తుకున్న కొన్ని మాటలు చెప్తాను….” అందరూ చదవాల్సిందే. జ్ఞానంకోసం అందాం….మరి చదివేది ఉద్యోగం కోసం కదా! చదివినంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావు..కాబట్టి జ్ఞానంకోసమే చదవాలి. డబ్బు పెట్టి జ్ఞానాన్ని కొనుక్కుని చదవాలి. తాను డబ్బు పెట్టలేని స్థితిలో ఆ జ్ఞానమెలా సంపాదించాలి? తినటానికి తిండికూడా లేకుండా ఉండి జ్ఞానం సంపాదించాలా? ఆ జ్ఞానం ఇంగ్లీషు వాళ్ళ చరిత్ర, భూగోళం, సివిక్సా?”…..

ఈ చదువుల వల్ల వాళ్ళ సంసారంలో వచ్చిన బాధలు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి…. పాలమ్మటం వల్ల పిల్లలకి పోషణ తగ్గిపోతుంది…అనారోగ్యపడతారు…..రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సామాన్య ప్రజ ఎలా ఇబ్బందులు పడిందీ వివరంగా మనకి ఈ కథలో అర్థమవుతుంది…..రామయ్య పట్నం పాలు తీసుకెళ్ళడానికి సైకిలు కొంటాడు….దాని వల్ల వచ్చే సౌకర్యంకన్నా నష్టమే ఎక్కువ కనపడుతుంటుంది… సైకిలుకి లైసెన్సు, మునిసిపాలిటీ వాడికి ప్రతి ఆరు నెలలకి పన్ను, కట్టకపోతే పోలీసు వాడి దగ్గర వాయింపుడు….దానికి లైటు లేదని,చైను సరిలేదని….వెలగాల్సిన మున్సిపాలిటీ దీపాలు వెలగవు గాని, ఈ సైకిళ్ళకుండే గుడ్డి దీపాల వల్ల ప్రయోజనమేంటో!….దానిక్కావల్సిన కిరసనాయిలు కల్తీ,,,,చివరికి విసుకొచ్చి, సగం నష్టానికి అమ్మేస్తాడు…..

అసలీ పరీక్షా విధానలమీద విశ్వనాథ వారి విశ్లేషణ అద్భ్హుతంగా ఉంటుంది….అవన్నీ రాస్తే పుస్తకం మొత్తం ఎత్తి రాసినట్టవుతుందేమో!.. ….నాకు నచ్చిన రెండు వాక్యాలు చెప్తాను..చాలా పోటీ పరీక్షలు ఎదుర్కున్న అనుభవంతో ఆ మాటలు నా మనసుకి బాగా పట్టాయి…..” తద్దినం లాగా పరీక్షలు సంవత్సరంలో ఒకరోజు రావటమేంటి? ఆరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవచ్చు, మనసు సరిగ్గా ఉండకపోవచ్చు…ఇంట్లొ పరిస్థితులు బాగుండకపోవచ్చు…అసలు స్పురణ అనేది ఒక్కో వేళ ఒక్కోరకంగా ఉంటుంది…ఒకసారి గుర్తున్నది ఇంకోసారి ఉండదు…..ఇన్ని చెప్తున్నావు ఎంత మంది రాయట్లేదు, అవ్వట్లేదు అంటారేమో! ఒక్కొకరి మనసు చిత్రంగా ఉంటుంది…గోపాలానికి, సూర్యానికి ఎంత తేడా! తల్లికి చీర లేదని గోపాలం పడ్డ బాధ సూర్యం పడలేదు. ఒక్కొకడి మనసు పుప్పొడికన్నా మెత్తగా ఉంటుంది.వాడు భూలోకంలో దేవత వంటి వాడు. జీవితంలో పరీక్షలన్నీ వాడికే!మిగతా వాళ్ళకి చదవటం, పరీక్షలు రాయటం, ఉద్యోగం చెయ్యటం, సంపాదించటం ఇవన్నీ సామాన్య శరీరధర్మాలు…..అందరం మనుషులమే, సమానమే అయినప్పుడు పరుల దుఃఖాన్ని చూసి బుద్ధుడే ఎందుకు బాధ పడ్డాడు.మిగతా వాళ్ళకి ఆ బాధ ఎందుకు కలగ లేదు..???”……….ఇలాంటి, మన మనసులకి కావలసిన తర్కం ఈ పుస్తకం నిండా పుష్కలంగా ఉంది,అన్ని విశ్వనాథ వారి రచనల్లానే……

ఇక శ్యామల పాత్ర గురించి రెండు మాటలు చెప్తాను…తన ప్రతి రచనలోనూ స్త్రీ పాత్రలని ఎంతో ఉన్నతంగా, అద్భుతంగా చిత్రించే విశ్వనాథవారు, ఈ నవల్లో దానికి శ్యామల పాత్రని ఎన్నుకున్నారు.. స్వతహాగా తెలివిగల్లదైన ఆ పిల్ల, భర్త పోయింతర్వాత ఇంకా మెరుగు పడుతుంది….అమాయకుడైన గోపాలానికి కష్టాల్లో ఆసరాగా నిలబడుతుంది.గోపాలం అప్పుల వైనం అంతా చక్కబెట్టుకోవటం అంతా శ్యామల విజ్ఞతే! తనే పెద్దమనుషులతో మాటాడి వ్యవహారమంతా చక్కబెడుతుంది. తర్వాత పట్నం వెళ్ళాక కూడా తన నగకట్టమ్మి ఇస్తుంది..కాని గోపాలం తీసుకోడానికి అభిమానపడతాడు, అది వేరే విషయం……చివరకి అన్నని తను పోషిస్తానంటుంది, చెల్లెలి బాధ్యత తనే తీసుకుంటుంది…….

మరికొన్ని మంచి మాటలు చెప్పి ముగిస్తాను……”ఈ పరీక్షలు కొండ ఎక్కటంలాంటివి.ఎక్కినంత సేపు శ్రమ.పైకి వెళ్ళినంతవరకు అక్కడికి చేరటమే పరమావధి.చేరిన తరువాత ఏముంది? రాళ్ళు,రప్పలు….లేకపోతే ఇంకో శిఖరముంది.దానిమీదికెక్కాలి. అది కూడా ఎక్కింతర్వాత ఏముంది?..చుట్టుపక్కల కొన్ని మైళ్ళదూరం కనిపిస్తుంది. ఇంకా కాకపోతే, అమెరికా, రష్యా, చైనా, యూరప్- ఈ దేశాలన్నీ కనపడతాయేమో! బంగరుబయలుగా ఉన్న అంత మేర కనిపించాక ఇంకేం కావాలి? అదే పరమ పురుషార్థం…”

చివరగా గోపాలం ఈ మాటలనుకుంటాడు..”తాను కూలి పనికైనా పనికిరాడు. ఈ పరీక్షలలో పడి ఉన్నాడు.తమ్ముడి లాగా మేడలు కట్టటం చేతకాకపోయినా కనీసం గోడలు కట్టటానికి రాళ్ళు ఎత్తటానికి కూడా పనికిరాడు.తాను చదువు కోసమే పుట్టలేదేమో? తనకీ పరీక్ష ఎందుకు?తను సుఖపడటానికే పుట్టలేదేమో? తనకీ పరీక్ష ఎందుకు? తనసలు బ్రతకటానికే పుట్టలేదేమో? తనకీ పరీక్ష ఎందుకు? మనుషులందరూ సమానమన్నమాట వట్టి అబద్ధం. చదవకుండా, ప్రయత్నం చెయ్యకుండా, సంసార బాధ్యత పట్టించుకోకుండా ఉన్న తన తమ్ముడేమో గగనంలో తారలా ఉన్నాడు. అన్నీ పట్టించుకున్న తనేమో అణిగిపోయినాడు. అసలు నేనీ జన్మ ఎందుకెత్తినట్టు?”………………………