పాయసి
క్రీ. పూ. 6 వ శతాబ్దానికి చెందిన పాయసి బుద్ధుని సమకాలికుడు. కోసల రాజ్యానికి సామంతుడు. సేతవ్య అనే పట్టణానికి పరిపాలకుడు. ఇతను భౌతికవాది. పరలోకం, ఆత్మ, పునర్జన్మ, కర్మ తదితర వైదిక మత విశ్వాసాలను వ్యతిరేకంగా భౌతికవాదాన్ని బోదించాడు. ఆ కాలంలో కర్మ గురించి, ఆత్మ గురించి తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు పాయసి వీటిని ఎలా నిరాకరించినది అన్న విషయం బౌద్ధ, జైన గ్రంధాల వలన మనకు తెలుస్తుంది.[1] ఇతని గురించిన ప్రస్తావన బౌద్ధ దిఘనికాయంలో 'పాయసిసుత్త'లో వివరంగా కనిపిస్తుంది.
పాయసి తాత్వికత
మార్చుపాయసి కోసలరాజు ప్రసేనజిత్తు బహుమతిగా ఇచ్చిన సేతవ్య అనే పట్టణానికి రాజు.[2] పాయసి భౌతిక వాది. దాదాపుగా చార్వాకుడన్నమాట. ఇతనికి ఆత్మలో గాని, పరలోకంలోగాని, పాప పుణ్యాలులోగాని కించిత్తు విశ్వాసం లేదు. ఇహం లేదు. పరం లేదు. జీవులు చచ్చినా తిరిగి పుట్టరు. మంచి చెడు కర్మలకు ఫలముండదు అని బోదించేవాడు.[3]
ఇతని దృష్టిలో 3 విషయములు ప్రధానములు.
- చచ్చినవాడెవడూ తిరిగివచ్చి పరలోకం వున్నదని చెప్పలేదు. కాబట్టి పరలోకం చూసినవాడేవడూ లేడు.[3]
- ధర్మపరులు, ఆస్థికులు చావంటే భయపడుతున్నారు. నిజంగా మోక్షం వున్నదని నమ్మితే వారు చావుకు ఎందుకు భయపడుతున్నారు?[3]
- చనిపోయిన శరీరాల నుండి ఆత్మ బయటకు వెళ్ళినట్లు ఆనవాళ్ళు ఏమిటి?[3]
ఇటువంటి ప్రాతిపదికలతో పాయసి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఏర్పరుచుకొన్నాడు. పాయకిసుత్తాంతంలో ఇతని భావాల సమీక్ష ఈ విధంగా వుంది." పరలోకం లేదు. జన్మ నిచ్చిన తల్లిదండ్రుల వలన తప్ప మరొక రకంగా జీవులు పుట్టరు. పాపపుణ్య కర్మలకు ప్రత్యేకమైన ఫలితాలు లేవు."[1]
పాయసి ప్రయోగాలు
మార్చుప్రయోగాత్మకమైన నిరూపణకు ప్రాధాన్యం ఇచ్చేపాయసి నిదర్శనం కనిపిస్తేనే ఫలితాన్ని నమ్మేవాడు.
- పరలోకం ఉనికిని నిర్దారించుకోవడానికి - మరణశయ్యపై వున్న పాపులను కలుసుకొని వారు మరణించిన పిదప చేరుకొన్న (నరక) లోకాన్నిగురించిన వివరాలు తిరిగివచ్చి తనకు తెలుపవలసినదిగా కోరాడు. అలాగే చావుకు సిద్ధంగా వున్న పుణ్యాత్ములను కూడా అదే విధంగా కోరాడు. అయితే అలా చనిపోయిన వారెవరూ తిరిగివచ్చి తాము దర్శించిన పరలోకం (స్వర్గం, నరకం) గురించి చెప్పినదేమీ లేదు. రుజువులు లేనందువల్ల పరలోకం ఉనికిని తిరస్కరించాడు.
- అదేవిధంగా కర్మ సిద్ధాంతాన్ని పాయసి అవహేళన చేస్తూ - పుణ్యాత్ములు, పరివ్రాజకులు చావుకు భయపడుతున్నారే కాని దాన్ని ఎవ్వరూ ఆహ్వానించటం లేదు. మరణాంతరం పరలోక సుఖాలు (స్వర్గం) లభిస్తాయని పుణ్యాత్ములు నిజంగా నమ్మితే, వారు విషం త్రాగో, లేదా కత్తితో కోసుకొనో, పోడుచుకొనో చనిపోయి ఎందుకు స్వర్గ సుఖాలు పొందరు. మరణాంతరం ఏమవుతుందో తెలియదు కాబట్టే వారికి మరణం అంటే భయం. ప్రాణమంటే తీపి కూడా వుంది. అందువల్ల కర్మ కానీ, కర్మఫలం కానీ, పుణ్య పాపాదులు కానీ లేవు అని నిశ్చయించుకొన్నాడు.[4]
- అదేవిధంగా ఆత్మ ఉనికిని గురించి రుజువులు వెదుకుతూ - ఆత్మ అనేది నిజంగా ఉనికిలో ఉన్నట్లయితే మృతదేహం బరువు తక్కువగా, సజీవదేహం బరువు ఎక్కువగా వుండాలి. ఆత్మ శరీరంలో వుండి, మరణాంతరం శరీరాన్ని వదిలిపోతున్నట్లయితే మరణాంతరం శరీరం బరువు తగ్గాలి. దీనిని నిరూపించడానికి చావడానికి సిద్ధంగా వున్న మనిషిని ఒక పేటికలో వుంచి మూతవేసి బరువు తూచాడు. చనిపోయిన అనంతరం కూడా ఆ పేటిక బరువు తగ్గడం జరగలేదు. ఆత్మ ఉనికిని నిర్దారించుకోవడానికి మరో పరిశీలనలో భాగంగా - మరణ శిక్ష పడ్డ క్రూరమైన నేరస్తులను ఒక పెద్ద జాడీలో పెట్టి, మూత బిగించి, ఆ జాడీని మంటల్లో వేసి, బాగా కాల్చిన తరువాత ఆతను చనిపోయాడని తెలుసుకొన్న తరువాత, ఆ జాడీ మూతను తెరిచి చూస్తే, ఏదైనా బయటకు వస్తున్నట్లు కనిపిస్తే ఆత్మ వున్నట్లు లెక్క. కానీ అట్లా ఏదీ బయటకు రావడం లేదు కనుక శరీరంలో ఆత్మ అనేది లేదని నిశ్చయించాడు. మరో పరిశీలనలో భాగంగా - క్షమార్హం కాని నేరాలను చేసినవారిని నిలువు గాను, అడ్డం గాను కోసి చూస్తే, ఏదైనా బహిర్గతమైతే ఆత్మ వున్నట్లు లెక్క. అలా బహిర్గతం కాకపోతే ఆత్మ లేనట్లు లెక్క.[5] ఇలాంటి మూడు పరిశీలనలతో ఆత్మ అనేది లేదని నిర్ణయించాడు.
జైన, బౌద్దాలతో విభేదాలు
మార్చుమొత్తం మీద ఇటువంటి పరిశీలనలతో పాయసి రాజు పరలోకం లేదని, పునర్జన్మలేదని, కర్మ ఫలితం లేదని తెలుసుకొని [1] ఆత్మ, పరలోకం, పునర్జన్మ భావనలను పూర్తిగా తిరస్కరించాడు. కర్మలకు ఫలితం లేదని, పాప పుణ్యాలు లేవని బలంగా విశ్వసించాడు. అయితే భౌతికవాదానికి సంబందించిన పాయసి అభిప్రాయాలను బౌద్ధ ‘పాయసిసుత్త’, జైన ఆగమ గ్రంధం ‘రాయప సేనైజ్జ’ రెండూ తిరస్కరించాయి. బౌద్ధ ‘పాయసిసుత్త’ వృత్తాంతంలో ఒక మిధ్యా దృష్టిమంతుడుగా చిత్రించబడిన పాయసి, గౌతమబుద్ధుని శిష్యుడైన ‘కుమార కాశ్యపుడు’ అనే శ్రమణునితో సుదీర్ఘ వాదన జరిపి చివరకు బౌద్ధాన్ని స్వీకరించినట్లుగా తెలియచేయబడింది.[2] అదే విధంగా జైన గ్రంధాలు పాయసి కాల క్రమేణా చివరకు జైన మతాన్ని స్వీకరించినట్లు పేర్కొన్నాయి.
రిఫరెన్సులు
మార్చు- Indian Philosophy - Debiprasad Chattopadhyaya: People's Publishing House, New Delhi. (First Published: 1964, 7th Edition: 1993)
- Maurice Walshe. The Long Discourses of the Buddha: A Translation of the Digha Nikaya (PDF) (1995 ed.). wisdom publications. Retrieved 6 September 2017.
- "DN23 Payasi Sutta: About Payasi". Pali Canon Online. Archived from the original on 30 అక్టోబరు 2017. Retrieved 6 September 2017.
- కత్తి పద్మారావు (1995). భారతీయ భౌతికవాదం -చార్వాక దర్శనం. లోకాయుత ప్రచురణలు.
- దేవీప్రసాద్ చటోపాధ్యాయ. భారతీయ తత్వశాస్త్రం-సులభ పరిచయం (2016 ed.). విజయవాడ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.