హెరాక్లిటస్ సమకాలికుడైన మరొక గ్రీకు తత్త్వవేత్త పార్మెనిడీస్. హెగెల్ మాటల్లో చెప్పాలంటే అసలైన తత్త్వచింతన పార్మెనిడీస్‌తోనే ప్రారంభమైంది.

"ప్రపంచంలో మార్పు లేనే లేదు. ఏదీ మారదు. మారుతుందని అనుకోవడం భ్రమ" - ఇది పార్మెనిడీస్ సిద్ధాంతం.

జననం మార్చు

ఇతడు దక్షిణ ఇటలీలో ఇప్పటి నేపుల్స్ దిగువన ఈలియా అనే పట్టణంలో రాజకీయంగా పలికుబడి కలిగిన ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. క్రీ.పూ. 540-470 మధ్య జీవించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

పార్మెనిడీస్ సిద్ధాంతం మార్చు

మార్పు ఎలా సాధ్యం? ఒక వస్తువు ఒకసారి ఉండి తరువాత లేకపోవడం ఎలా జరుగుతుంది? ఇది తార్కిక వైరుధ్యం కదా! ఒక వస్తువుకు గల కొన్ని లక్షణాలు భిన్న లక్షణాలుగా మారటం అంటే ఒక వస్తువు ఉన్నదని, అదే సమయంలో లేదని అనవలసి వస్తుంది. ఆ వస్తువు శూన్యం నుంచి వస్తుందని, శూన్యంగా మారగలదని కూడా అంగీకరించవలసి వస్తుంది. ఇది ఎలా సాధ్యం? శూన్యం నుంచి ఏదైనా ఎలా వస్తుంది?

ఒక వస్తువు ఉండనైనా ఉండాలి లేదా లేకుండానైనా పోవాలి. అంతేగాని మధ్యమ మార్గం లేదు. ఏదైతే ఉన్నదో అది మారదు. యథార్థమై ఉంటుంది. నిత్యమై, నిరవధికమై, అవిచ్ఛిన్నమై, సజాతీయమై, వైవిధ్యరహితమై, చలనరహితమఇ, మార్పులేనిదై ఉంటుంది. ఇది ఒక్కటే తర్కబద్ధమైన సిద్ధాంతం. తర్క విరుద్ధమైనదేదీ ప్రపంచంలో ఉండటానికి వీలులేదు.

అయితే ప్రపంచంలో కనిపిస్తున్న మార్పు, వైవిధ్యం, అనేకత్వం, పుట్టడం, గిట్టడం ఇవన్నీ అసత్యమైనవి. భ్రాంతివల్ల అలా కనిపిస్తున్నాయి. ఇంద్రియ జగత్తు నిజంగా లేదు. అది అభాస మాత్రమే. ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరూ సృష్టించలేదు. ఎవరూ నశింపజేయలేరు. అది పూర్ణం, అపరిమితం. నిశ్చలం. అది ఇదివరకు ఉండేది అనిగాని, ఇక ముందు ఉండగలదని అనుకోరాదు. ఎందుకంటే అది ఈ క్షణంలో ఉన్నది. మొత్తంగా, అవిచ్ఛిన్నంగా, ధారావాహికంగఅ ఉంది.