పాళీ భాష ఉత్తర భారత దేశ మూలాలు కలిగి బుద్ధుడి కాలంలో ఉద్భవించిన ఒక ప్రాచీన భారతీయ భాష. ఇది వేద కాలపు నాగరికత తర్వాత వచ్చిన మిడిల్ ఇండో ఆర్యన్ లకు చెందిన భాష. బుద్ధుడు బౌద్ధ మత గ్రంథాలను రాయడానికి సంస్కృతం వాడకాన్ని వ్యతిరేకించాడు. సంస్కృతం పండితుల భాష కాబట్టి సామాన్యులకు అర్థం కాదని ఆయన అభిప్రాయం.[1]

బర్మీఎస్ మనువంచ తాళపత్రం

పాళీ భాష ఎక్కడ ఉద్భవించిందనే విషయంపైన భిన్నాభిప్రాయాలున్నాయి. కొంత మంది ఇది దక్షిణ భారతదేశంలోనే పుట్టిందని భావిస్తున్నారు. ఉజ్జయిని సామ్రాజ్యం సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లింది కాబట్టి ఇది వింధ్య పర్వతాలకు పడమరగానున్న ఉజ్జయినిలో పుట్టి ఉండవచ్చునని మరికొందరి వాదన. పాళీ భాషలో నిష్ణాతుడైన రిస్ డేవిడ్ ఈ భాష కోసల రాజ్యంలో పుట్టి ఉండవచ్చునని భావించాడు.

పాళీ అనే పదం పవిత్ర గ్రంథం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ పదాన్ని సా.శ. ఐదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ వ్యాఖ్యాత బుద్ధఘోషుడిచే వాడబడింది. అశోకుడి కాలంలో ముద్రించబడిన శాసనాలు ప్రాకృత భాషలో రాయబడ్డాయి. పాళీ భాష దీనికి దగ్గరగా ఉన్నట్లు గమనించారు. దీనికి సంస్కృత భాషతో కూడా కొన్ని సామ్యాలున్నాయి. అయితే సంస్కృత వ్యాకరణంతో పోలిస్తే దీని వ్యాకరణం చాలా సరళీకృతం చేయబడింది. దీనికున్న ధర్మం, నీతి, క్రమశిక్షణాపరమైన నియమ నిభంధనల వల్ల కేవలం బౌద్ధ సన్యాసులకు మాత్రమే పరిమితమై ఉండేది.

పద్నాలుగో శతాబ్దం వచ్చేసరికి భారతదేశంలో పాళీ భాష సాహిత్యం నుంచి దాదాపు అంతరించిపోయింది. అయితే ఎక్కడో దూర ప్రాంతాల్లో మాత్రం 18వ శతాబ్దం వరకూ తన ఉనికిని కాపాడుకున్నది.

మూలాలు మార్చు

  1. "Students Britannica India".

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పాళీ_భాష&oldid=3597403" నుండి వెలికితీశారు