పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?

పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అన్నది ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ఏర్పరచడానికి సాగిన సంచలన ప్రచారం.

చరిత్ర మార్చు

పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ (పీ.ఎస్.ఐ.) అన్న సామాజిక సేవా సంస్థ ఈ అడ్వర్టైజ్మెంట్ విశాఖపట్టణంలో ప్రారంభించింది.[1] పులిరాజా ప్రచార కార్యక్రమాన్ని 2003లో "పులిరాజా ఎవరు?" అన్న ప్రశ్నతో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో హోర్డింగులు, గోడల మీద పెయింట్ల ద్వారా పులిరాజా ఎవరు అన్న ప్రశ్నను సంధించారు. శాసన సభ్యుల సహా వివిధ వర్గాల ప్రజలు పులిరాజా ఎవరు అన్న ఉత్సుకతతో చర్చించుకున్నారు. ఈ సందర్భంగా శాసన సభలో సభ్యులు పులిరాజా ఎవరు, ఈ ప్రచారం ఏమిటన్న ప్రశ్నకు అప్పటి మంత్రులు కూడా సమాధానం చెప్పలేకపోయారు.[2] క్రమంగా పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అన్న ప్రశ్న వైపుకు ప్రచార సరళిని నడిపారు. టెలివిజన్ ఎడ్వర్టైజ్మెంట్లు, పత్రికల్లో ప్రకటనలు, వీధిలో భారీ హోర్డింగులు, పెయింటింగులు అన్నీ పులిరాజా అన్న ఊహాజనితమైన వ్యక్తి చాలా ధైర్యవంతుడనీ, వేశ్యాలంపటుడనీ, ఐతే పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అంటూ ప్రశ్నించి ఎంత ధైర్యవంతుడైనా ఎయిడ్స్ రావచ్చని క్రమంగా తేల్చేలా రూపొందించారు. పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు కొద్ది ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రచారోద్యమం తరహా, లక్ష్యాలు, ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారికి ప్రయోజనకరంగా అనిపించడంతో సంస్థతో భాగస్వామ్యం వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని సాగించమని కోరింది.[1]

ప్రభావం మార్చు

శృంగారానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడుతూండే స్థితిగతులు నెలకొనివుండడం ఎయిడ్స్ పై అవగాహన, దాని నివారణకు సమస్యలుగా ఉండేవి. ఈ నేపథ్యంలో నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి, జనాన్ని చర్చించేలా చేసేందుకు ప్రజల నోళ్ళలో పులిరాజా ఎవరు అన్న ప్రశ్న నానేలా చేయడంలో ప్రచారం భారీ విజయాన్ని సాధించింది. ఎవరు అన్న ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళడంతో, ఎయిడ్స్ వస్తుందా అన్న ప్రశ్న కూడా విస్తృతిని సాధించింది. అలా క్రమంగా ఈ ప్రచారం ప్రజల్లో ఎయిడ్స్ పై చర్చకు, అవగాహనకు ఉపకరించింది.[3] ఐతే కొంతమంది పులిరాజా అన్న పేరున్న వ్యక్తులకు మాత్రం ప్రచారం వ్యక్తిగతంగా సమస్యలు సృష్టించిందని, వారిని జనం విచిత్రంగా చూస్తూన్నారని వార్తలు వచ్చాయి.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతినిధి. "Puli Raja ads a misery for namesake". టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 30 August 2017.
  2. టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతినిధి. "Who is puliraja". టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 30 August 2017.
  3. http://www.sakshi.com/news/funday/world-aids-day-is-on-december-1-426490 సాక్షిలో "పులిరాజాకు ఇప్పుడేమైంది" కథనం

వెలుపలి లంకెలు మార్చు