పులిజూదం

(పులి జూదం నుండి దారిమార్పు చెందింది)

పులిజూదం లేదా పులి-మేక ఒక భారతదేశపు సాంప్రదాయ ఆట. విశేష ఆదరణ గల ఒక గ్రామీణ క్రీడ. ఇది చదరంగం వలె ఆడు ఆట[1]. ఒకనాడు పల్లెల్లో మేధావి తనానికి నిరూపణగా ఈ ఆటను ఆడేవారు. గ్రామీణ ప్రాంతాలలో, విరామ సమయాలలో నేటికీ ఈ ఆటను ఆడటాన్ని చూడవచ్చు. గ్రామ కూడలిలో, రచ్చబండ దగ్గరో, మరో చెట్టుకిందో, దేవాలయపు కట్టల మీదో, ఇంటి అరుగుల మీదో ఎక్కడో ఒక చోట ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ఏ ప్రాంతంలోనైనా ఈ ఆట ఆడుతూ పల్లెల్లో జనాలు కనిపిస్తారు.

పులి జూదము
పులి జూదము గడి
Genre(s)Board game
ఆటగాళ్ళు2
అమరిక సమయం< 1 నిమిషం
ఆటకు పట్టే సమయం{{{ఆటకు పట్టే సమయం}}}< 1 గంట
Random chanceలేదు
నైపుణ్యంవ్యూహం
Synonym(s)పులి-మేక,
ఆడు పులి ఆట్టమ్ (తమిళనాడు)
హుళి గట్ట, ఆడు-హుళి (కర్ణాటక)
1వ రకం-పులిజూదం
2 వ రకం- పులిజూదం

ఆట వ్యాప్తి

మార్చు

ఈ ఆటను తమిళనాడులో ఆడు పులి ఆట్టమ్ అని, కర్ణాటకలో హుళి గట్ట లేదా ఆడు-హుళి అని వ్యవహరిస్తారు. దక్షిణ ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆటను ఆడతారు. సుమాత్రాలో ఈ ఆటను మ్యూరిమ్యుయెంగ్-రిమ్యూయెంగ్-దో (meurimüeng-rimüeng-do) అంటారు. దీన్ని సాంప్రదాయకమైన గడిలోనే ఆడతారు కానీ, ఈ ఆటలో ఐదు పులులు, పదిహేను మేకలు ఉంటాయి. మధ్య చిత్రంలో సూచించిన పెద్దగడిలో మూడు పులులు, పదిహేను కుక్కలతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రఫాయా అన్న ఆటను ఆడతారు. శ్రీలంకలో ఇదే ఆటను దెమళ దివియన్ కెళియ (දෙමළ දිවියන් කෙළිය) లేదా కొటి సెల్లమ (කොටි සෙල්ලම) అంటారు.[2] ఈ పెద్ద గడితో ఆడే ఆట సాంప్రదాయ పులిజూదం ఆటకంటే కొద్దిగ ఎక్కువసేపు సాగుతుంది.[3]

ఆట పరికరాలు

మార్చు

ఈ ఆట ఆడుటకు కావలసినవి...

  1. పులి జూదం చిత్రం
  2. నాలుగు గచ్చకాయలు
  3. పద్దెనిమిది చింత బిచ్చలు.

పులి జూదం చిత్రం రెండు అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి. పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది, పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు (చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.

ఆటగాళ్ళ సంఖ్య

మార్చు

ఈ ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఆ ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.

ఆట నియమాలు

మార్చు
  1. పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
  2. ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల (పులుల) తో, మరొకరు చింతబిచ్చల (మేకల) తో ఆడాలి.
  3. త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.
  4. ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.
  5. పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
  6. మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.

ఈ విధంగా 18 (18:4;15:3;1:3) మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో ఆడేవాడు జరుపుతూ పోతాడు. తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు.

 
3 వ రకం - పులిజూదం

ఆడే పద్దతి

మార్చు
 
ఇది పులిజూదం ఆట యొక్క ప్రత్యమ్నాయ చిత్రీకరణ. ఇందులో ఖాళీ వృత్తాలు మూడు పులులు ఆట ప్రారంభంలో ఉండే స్థానాలను సూచిస్తున్నాయి

ఆటగాళ్ళు: యిద్దరు, కావలసినవి: 3-పులులు, 15-మేకలు

పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీదినుంచి దింపనూవచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీదినుంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగా ఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీదినుంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యవచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల జట్టు, పులులు కట్టుబడిపోతే మేకల జట్టు నెగ్గినట్లు. మేకలు పులులమీదినుంచి దూకలేవు. ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

 
పులిజూదం తరహా ఆటలు ఎడమ నుండి కుడికి 1) సాంప్రదాయ పులిజూదం గడి, 2) భారతదేశంలో ఆడే రఫియా, శ్రీలంకలో ఆడే దెమళ దివియన్ కెళియ యొక్క గడి 3) థాయ్‌లాండ్లో ఆడే లెన్ చోవా గడి[2]

పులి జూదం రకాలు

మార్చు

పులి జూదంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఈ ఆటను ఆడే చిత్రాన్ని బట్టి, ఆడే కాయల సంఖ్యను బట్టి ఈ రకాలు ఉన్నాయి.

  1. ఒక పులి పులి జూదం: ఆడటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ ఆటను ఆడుతారు. చాలా తక్కువ సమయంలో ఈ ఆట ముగుస్తుంది. మూడు మేకలతో పులిని కట్టడి చేస్తారు. చేయలేకపోతే పులితో ఆడేవారు గెలిచినట్లు. ఈ ఆట తెలుగు ప్రాంతాలు అన్ని చోట్లా ఆడిన దాఖాలాలు ఉన్నాయి.
  2. మూడు పులులు పులి జూదం: ఈ ఆటను 3 పులులు, 15 మేకలతో ఆడుతారు. ఈ ఆటను ఉత్తర సర్కారు జిల్లాలలో ఆడుతారు.
  1. నాలుగు పులుల పులి జూదం: ఈ ఆటలో 4 పులులు, 18 మేకలతో ఈ ఆటను ఆడుతారు. ఈ ఆట దక్షిణ తెలంగాణాలోను, రాయలసీమలోనూ చూడవచ్చు.

ఆట ప్రాచీనత

మార్చు

ఈ ఆటలు కాకతీయుల కాలం నాటి నుండి ఉన్నట్లు తెలుస్తోంది.[4]. తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి. కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఒక చోట ... "తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ సాగటాల నే నతి ప్రౌఢుండన్.[5]. ఈ పుస్తకంలో కవి మూడు రకాల పులి జూదములు కలవని గోపరాజు పేర్కొన్నట్టు ప్రతాపరెడ్డి చెప్పాడు. అవి ఒక పులి జూదం, నాలుగు పులల జూదం. మూడవది స్పస్టంగా పేర్కొనలేదని ప్రతాపరెడ్డి చెప్పాడు. అయితే మూడవ ఆటపై సందిగ్థతలో ఉన్నప్పుడు రెడ్డికి సికింద్రాబాద్లోని మారేడుపల్లి వాసి తాడేపల్లి కృష్ణమూర్తి 3 పులుల ఆటను చూసించారు. చదరంగానికి ఏ విధంగానూ తీసిపోని ఈ ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుదనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మూలాలు

మార్చు
  1. గ్రామాలలోని వేడుకలు-క్రీడా వినోదాలు-దేవులపల్లి రామానుజరావు, నవ వసంతం-2, ఏడో తరగతి తెలుగు వాచకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015,పుట-76
  2. 2.0 2.1 Winther, Mats. "Asian Leopard games". mlwi.magix.net. Archived from the original on 4 ఫిబ్రవరి 2016. Retrieved 30 November 2014.
  3. Walker, Damian. "Pulijudam". www.cyningstan.com. Cygnistan. Archived from the original on 30 జూలై 2016. Retrieved 30 November 2014.
  4. సురవరం ప్రతాపరెడ్డి: ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఓరియంట్ లాఙ్మ్న్ ప్రచురణ, 1996, పుట-130
  5. కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక, రెండవ భాగం, పుట-85
"https://te.wikipedia.org/w/index.php?title=పులిజూదం&oldid=4078311" నుండి వెలికితీశారు