పులి వీరన్న పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. పులి వీరన్న 1946, జూలై 23న దేవరకద్రలో జన్మించాడు. న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించి, ఆ తర్వాత రాజకీయాలలో చేరి కోడంగల్ నుంచి 4 సార్లు పోటీచేసి పరాజయం పొందినాడు. మహబూబ్ నగర్ స్థానం నుంచి 3 సార్లు పోటీచేసి 2 సార్లు విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు.

పులి వీరన్న
పులి వీరన్న

నియోజకవర్గం మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 23, 1946
దేవరకద్ర

రాజకీయ జీవనం

మార్చు

న్యాయశాస్త్రం విద్య అభ్యసించిన పులివీరన్న 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. ఉద్యమంలో భాగంగా రెండూ సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాడు.[1] తొలిసారిగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972లో పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత మరో 3 సార్లు పరాజయం పొందిన పిదప 1989లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చేనేత జౌళి శాఖామంత్రిగా పనిచేశాడు. ఆ తరువాత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు. 2004 ఎన్నికలలో మళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని ఆశించిననూ పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించడంతో కాంగ్రెస్ రెబెల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో పులివీరన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిననూ తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2009 డిసెంబరు 11న మరణించాడు.[2] ఇతని భార్య పులి అంజనమ్మ మహబూబ్ నగర్ పురపాలసంఘపు వైస్ చైర్మెన్‌గా పనిచేసింది.

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 12-12-2009