పోలరైజేషన్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పోలరైజేషన్ అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాట 'తలీకరణ.'
పోలరైజేషన్ అన్న మాట అర్థం కావాలంటే కాంతి లక్షణాలు అర్థం కావాలి. కాంతి కిరణాల గురించి ముందు తెలుసుకుందాం. చూరులో ఉన్న చిల్లు గుండా కాంతి గదిలోకి ప్రవేశించినప్పుడు, గాలిలో తేలియాడే నలకల వల్ల ఆ కాంతి తెల్లటి కడ్డీలా మనకి కనిపిస్తుంది. ఈ తెల్లటి కడ్డీ కొన్ని కాంతి కిరణాల సమూహం అన్నమాట. ఇలాంటి కిరణాల సమూహాన్ని కిరణ వారం (beam of light) అంటారు. “తరణి కిరణ వారము” అనే ప్రయోగం చిన్నయసూరి నీతి చంద్రికలో ఉంది. అంటే “సూర్య కిరణాల సమూహం” అని అర్థం. కాంతి సన్నగా వెంట్రుక వాసి ప్రమాణంలో ఉంటే దానిని కాంతి కిరణం (ray of light) అంటారు. అంటే ఒక కిరణ వారంలో ఎన్నో కిరణాలు ఉన్నాయన్నమాట; ఒక చీపురు కట్టలో ఎన్నో చీపురు పుల్లలు ఉన్నట్లు ఉపమానం ఊహించుకొండి. ఈ ఉపమానం ఈ సందర్భంలో పూర్తిగా నప్పదు. చీపురు కట్టలో పుల్లలు అన్నీ నిటారుగా, తిన్నగా, ఒంపులు లేకుండా ఉంటాయి. కాని కిరణవారంలో కిరణాలు అలా ఉండవు. "కిరణాలు" అని మనం అంటూన్నా, కాంతి తరంగాల మాదిరి ప్రయాణిస్తుంది. కనుక బాణంలా ముందుకి దూసుకు పోతూన్న కిరణవారంలో ఉన్న కిరణాలు తిన్నగా చీపురు పుల్లలులా కాకుండా మెలికలు తిరిగిన పాములా, లేదా తరంగంలా, ఉంటాయని ఊహించుకోవచ్చు. కనుక మన సారూప్యం సఫలం అవాలంటే ఒక కాంతి వాసం లోని కాంతి కిరణాలు మెలికలు తిరిగిన పుల్లలులా ఉంటాయని ఊహించుకోవాలి. ఈ మెలికలు తిరిగిన పుల్లలన్నిటిని గుత్తగుచ్చి కట్ట కట్టేము అనుకుంటే ఆ కట్టలో ఉన్న అన్ని పుల్లల మెలికలు ఒకే తలం (plane) లో ఉండవు; గజిబిజిగా అని దిశలలోను వ్యాపించి ఉంటాయి. ఇదే విధంగా చూరు లోని చిల్లు గుండా ప్రవహిస్తూన్న కిరణ వారం లోని కాంతి కెరటాలు గజిబిజిగా, అన్ని దిశలలోనూ కంపిస్తూ ఉంటాయి. ఈ రకం కాంతిని “తలీకరించని కాంతి” (un-polarized light) అంటారు. అంటే, ఒక్క తలం (plane) లో కాకుండా అన్ని తలాలలోను కంపిస్తూన్న కాంతి అన్నమాట.
ఇలా అన్ని దిశలలోనూ కంపించే కాంతి తరంగాలని ఒకే ఒక సన్నటి కంత (narrow slit) ఉన్న జల్లెడ గుండా పోనిచ్చేమనుకుందాం. ఆ కంత గుండా అన్ని కిరణాలు దూసుకుని వెళ్లలేవు; కొన్నే వెళ్లగలవు. ఏవి వెళ్లగలవు? ఆ సన్నటి కంత ఏ దిశలో ఉందో అదే దిశలో కంపిస్తూన్న కెరటాలు వెళ్ల గలవు; మిగిలినవి ఆ కంతలోంచి దూరి వెళ్లలేవు (బొమ్మ చూడండి.) ఇప్పుడు కంతలోంచి బయట పడ్డ కాంతి తరంగాలు అన్నీ ఒకే దిశలో కంపిస్తూ ఉంటాయి కదా. అందుకని ఇలా బయట పడ్డ కాంతిని “తలీకరించిన కాంతి” (polarized light) అందాం. అంటే, ఒకే తలంలో కంపింపించే కాంతి. ఇది కేవలం ఉపమానం మాత్రమే అని గుర్తు పెట్టుకొండి.
తలీకరణ చెందిన కాంతికి, చెందని కాంతికి మధ్య తేడా తెలుసుకోవాలంటే ఎర్రటి ఎండలో చలవ కళ్ళజోడు (cooling glasses or polarized sunglasses) పెట్టుకుని చూడండి. అంతా మబ్బు వేసినట్లు దృశ్యం కనిపిస్తుంది. ఎందువల్ల? చలవ కళ్లజోడు సగానికి సగం కాంతిని అడ్డగించి మిగిలిన సగాన్నే కంటికి చేరనిస్తుంది కనుక (బొమ్మ చూడండి).
ఈ “పోలరైజేషన్” అన్న ఇంగ్లీషు మాటని మక్కీకి మక్కీ తర్జుమా చేసి మన వాళ్లు తెలుగు పుస్తకాలలో “ధ్రువీకరణ” అని రాస్తారు. కాని ఈ అనువాదం శుద్ధ తప్పు. పోలరైజేషన్ అనే ప్రక్రియ అర్థం కాని రోజుల్లో ఇంగ్లీషు వాళ్లు పప్పులో కాలేసి ఆ పేరు పెట్టేరు. పూర్వం కాంతి రేణువులులా ఉంటుందని ఉహించుకునేవాళ్లం. అంతవరకు పెద్ద ప్రమాదం లేదు. ఇప్పుడు కూడా సందర్భానుసారంగా కాంతి రేణువులులా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కాని ఆ రేణువులు చిన్న చిన్న అయస్కాంతాలలా ఉంటాయనిన్నీ, ఆ అయస్కాంతాలకి ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం ఉంటాయనీ కూడా పూర్వం ఊహించుకునేవారు. పైపెచ్చు “పోలరైజు” కాని కాంతిలో ఈ ధ్రువాలన్నీ చెల్లా చెదురుగా అన్ని దిశలలోనూ తిరిగి ఉంటాయనిన్నీ, “పోలరైజు” అయిన తరువాత కవాతు చేసే సైనుకులులా ఇవన్నీ ఒకే దిశ వైపు మొగ్గి ఉంటాయనిన్నీ చెబుతూ పోలరైజేషన్ ప్రక్రియని వర్ణించేవారు. ఈ ఊహనం తప్పు. అందుకనే ధ్రువీకరణ అన్న అనువాదం కూడా సముచితమైనది కాదు; తలీకరణ అన్నది మెరుగైన అనువాదం.
ఇతర రంగాలలో "పోలరైజేషన్"
మార్చు- ఆర్దిక శాస్త్రంలో - మధ్య తరగతి ప్రజల ఉద్యోగాలు పోయి, అడుగున, మీద ఉద్యోగాలు మిగలడం.
- రాజకీయ రంగంలో - ప్రజాభిప్రాయంలో మధ్యేమార్గం పోయి ఇరువైపులా అతివాదం మిగలడం
మూలాలు
మార్చు- వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, కినిగె వారి ఇ-పుస్తకం, kinige.com