ప్రకృతి దృశ్యం
ప్రకృతి దృశ్యం (ల్యాండ్‌స్కేప్) ఒక భూభాగం, సహజమైన లేదా మానవ నిర్మిత లక్షణాలతో కలిసిపోయి ఆకర్షణీయంగా కనబడే దృశ్యం.[1] పర్వతాలు, నదులు, సరస్సులు, చెరువులు, సముద్రం, ప్రాంతీయ వృక్షాలతో సహా భూభాగంలోని జీవ అంశాలు, వివిధ రకాలైన భూ వినియోగం, భవనాలు, మానవ నిర్మాణాలు, లైటింగ్, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలు ఈ దృశ్యంలో ఉంటాయి. కొన్ని సహస్రాబ్దాలుగా సహజంగా ఏర్పడిన భూమి మూలాలతో, మానవ నివాస సంయోగంతో ఏర్పడిన ప్రకృతి దృశ్యాలు ప్రకృతి మానవుల మధ్య సజీవ సంబంధాన్ని కళ్ళకి కడతాయి. ఇది ఆ ప్రాంతానికి, జాతికి ఒక ప్రత్యేకతను సమకూరుస్తాయి.
ప్రకృతి దృశ్యం యొక్క లక్షణం, దానిలో నివసించే వ్యక్తుల స్వీయ-చిత్రాన్ని నిర్వచిస్తుంది. ఒక ప్రాంతాన్ని, ఇతర ప్రాంతాల నుండి విభిన్నంగా సూచించడంలో సహాయపడుతుంది. ప్రకృతి దృశ్యం వ్యవసాయ భూమి లేదా మానవ నిర్మిత ఉద్యానవనం లేదా అరణ్యం వరకు వైవిధ్యంగా ఉండవచ్చు. ధృవ ప్రాంతాల మంచుతో నిండిన ప్రకృతి దృశ్యాలు, పర్వత ప్రకృతి దృశ్యాలు, విస్తారమైన శుష్క ఎడారి ప్రకృతి దృశ్యాలు, ద్వీపాలు, తీరప్రాంత ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అటవీ లేదా చెట్లతో కూడిన ప్రకృతి దృశ్యాలు, బోరియల్ అడవులు, ఉష్ణమండల వర్షారణ్యాలు, వ్యవసాయ ప్రాంత ప్రకృతి దృశ్యాలు వంటి విస్తారమైన ప్రకృతి దృశ్యాలను భూమి కలిగి ఉంది. భూభాగం యొక్క రూపురేఖలు మార్చే కార్యాచరణను ల్యాండ్‌స్కేపింగ్ అంటారు.
సహజ ప్రకృతి దృశ్యాలు
మార్చుభూమి ఉపరితలం కాలంతో పాటుగా భౌతిక, రసాయన చర్యలకు గురై సహజంగా కొన్ని ఆకర్షణీయమైన రూపాలను ఏర్పరుస్తుంది. దీనిని జియోమార్ఫాలజీలో భాగంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధనల్లో ప్రస్తుతం ఉన్న రూపం ఎలా ఏర్పడింది, అందుకు కారణాలు ఏమిటి, భవిష్యత్తులో ఎలా మారబోతుంది అనే విషయాలు కనిపెడతారు. భూమి మీద ఉండే, మట్టి, నీరు, గాలి, అగ్ని మొదలైనవి రూపురేఖలను నిర్ధారిస్తాయి.
మానవ నిర్మిత ప్రకృతి దృశ్యాలు
మార్చుచైనీస్ గార్డెన్ సుమారు మూడు వేళ్ళ ఏళ్ళుగా మార్పు చెందుతూ వచ్చిన ఉద్యానవన పెంపకం పద్ధతి. ఇది చైనీస్ చక్రవర్తులు, రాజకుటుంబ సభ్యులకు చెందిన విస్తారమైన ఉద్యానవనాలు. వీటిని ఉల్లాసం కోసం, ఆకట్టుకోవడం కోసం నిర్మించబడ్డాయి. పండితులు, కవులు, మాజీ ప్రభుత్వ అధికారులు, సైనికులు, వ్యాపారులు రూపొందించిన ఉద్యానవనాలు, వారి శైలిని ప్రతిబింబించడానికి, ఎడతెరపి లేని జీవితం నుంచి బయటపడ్డానికి రూపొందించబడ్డాయి. వారు ఆదర్శప్రాయమైన సూక్ష్మ ప్రకృతి దృశ్యాన్ని సృష్టించారు. ఇది మనిషి, ప్రకృతి మధ్య ఉండవలసిన సామరస్యాన్ని వ్యక్తీకరించడానికి ఉద్దేశించబడింది.[2]